logo

భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్‌

భూమి రాసివ్వకపోతే చంపేస్తామంటూ సినీ ఫక్కీలో ఓ ఆలయ పూజారిని అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 19 May 2024 07:15 IST

తమిళనాడు పోలీసులమంటూ హింసించిన వైనం
నిందితుల్లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఛైర్మన్‌
ఈనాడు, చిత్తూరు- గంగాధరనెల్లూరు, న్యూస్‌టుడే

ఏ1 మురుగన్‌     ,    ఏ2 దీపక్‌కుమార్‌ తాళ్ల 

భూమి రాసివ్వకపోతే చంపేస్తామంటూ సినీ ఫక్కీలో ఓ ఆలయ పూజారిని అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఛైర్మన్‌ ఉండటం గమనార్హం. గంగాధరనెల్లూరు సీఐ మారుతీ శంకర్‌ కథనం మేరకు.. అగరమంగళం ఎస్సీ కాలనీకి చెందిన రామచంద్రన్‌ చెరువు కిందున్న తన ఎకరా పొలంలో అంకాళ పరమేశ్వరి చిత్రపటంతో పూజలు చేస్తూ జాతకాలు చెప్పేవారు. పెనుమూరు మండలానికి చెందిన దీపక్‌ కుమార్‌ తాళ్ల బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ స్థాపించి స్థిరపడ్డారు. 15 ఏళ్ల కిందట అగరమంగళానికి వచ్చిన ఆయన అమ్మవారి దయతో చిన్నతనంలో తనకు వచ్చిన వ్యాధి నయమైందని, ఆలయాన్ని సొంత ఖర్చులతో నిర్మిస్తానన్నారు. కోట్లాది రూపాయలతో అంకాళ పరమేశ్వరి ఆలయాన్ని ఐదేళ్ల కిందట పూర్తి చేశారు. ఆలయ విస్తీర్ణాన్ని పెంచుకుంటూ వచ్చిన ఆయన కొందరి భూములు బలవంతంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు న్నాయి. ఈ క్రమంలో పూజారి రామచంద్రన్, దీపక్‌ కుమార్‌కు ఆలయ ధర్మకర్త విషయమై వివాదం మొదలైంది.

లాడ్జీలో బంధించి.. గుడి సమీపంలో రామచంద్రన్‌ భూమిని ఆలయం పేరిట రాసివ్వాలని దీపక్‌కుమార్‌ ఒత్తిడి చేశాడు. ఇందుకు రామచంద్రన్‌ అంగీకరించక ఆలయ వ్యవహారాల నుంచి బయటకు వచ్చేశారు. నెల కిందట దీపక్‌కుమార్‌ అనుచరుడైన మురుగన్‌ పది మందితో పోలీసు దుస్తుల్లో వచ్చి తమిళనాడు పోలీసులమంటూ అగరమంగళం చెరువు వద్ద రామచంద్రన్‌ను బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారు. మొదట శ్రీరంగరాజపురంలోని స్మార్ట్‌ డీవీ కంపెనీ వద్దకు, తర్వాత కాట్పాడి, ఆర్కాట్, దిండిగల్‌ ప్రాంతాల్లో తిప్పారు. చివరకు తమిళనాడు పరిధిలోని ఓ లాడ్జిలో వారం రోజులు  హింసించారు.  భూమి రాసివ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. రామచంద్రన్‌ కుటుంబీకులు న్యాయం చేయాలంటూ జీడీనెల్లూరు పోలీసుల వద్దకు వెళ్లారు. సీఐ శంకర్‌ సమగ్ర దర్యాప్తు చేసి తమిళనాడులో ఉన్న బాధితుడిని విడిపించి తీసుకొచ్చారు.

వైకాపా అభ్యర్థితో సంబంధాలు.. దీపక్‌కుమార్‌కు జిల్లాకు చెందిన వైకాపా అభ్యర్థితో సన్నిహిత సంబంధాలున్నాయి. శ్రీరంగరాజపురం మండలం కొటార్లపల్లెలో అతని స్థలాన్ని కొని దీపక్‌కుమార్‌ స్మార్ట్‌డీవీ కంపెనీ పెట్టడం గమనార్హం.

12 మందిపై కేసు.. రామచంద్రన్‌ ఫిర్యాదు మేరకు ఏ1గా మురుగన్, ఏ2గా దీపక్‌కుమార్‌ తాళ్ల, మరో పది మందితో కలిపి మొత్తం 12 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పది మందిలో తమిళనాడుకు చెందిన ఏడుగురు, అగరమంగళానికి చెందిన శరత్, విజయకుమార్, పవన్‌ ఉన్నారు. ఇందులో శరత్‌ను రిమాండ్‌కు పంపారు.   బాధితుడు రామచంద్రన్‌ శనివారం మీడియాకు వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల విధుల్లో ఉన్నందున అప్పట్లో వివరాలు తెలపలేకపోయామని పోలీసులు దాట వేస్తున్నారు.  

మత్తుమందిచ్చి  గాయపరిచి

గతనెల 18న తమిళనాడు పోలీసులమని చెప్పి పది మంది నన్ను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. విషపు ఇంజక్షన్‌ వేసి తమిళనాడులోని వేలూరు సమీపంలోని  లాడ్జిలో బంధించి భూమి రాసివ్వాలని హింసించారు. లేదంటే చంపేస్తామని, నరికేస్తామని హెచ్చరిస్తూ సూదులతో గుచ్చి గాయాలపాలు చేశారు. చివరకు పోలీసుల రాకతో బయటపడి ఆసుపత్రిలో చేరా. ఇంజక్షన్‌ ఇవ్వడంతో తల తిరుగుతోంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చాయి.

రామచంద్రన్, బాధితుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని