IND vs BAN: టీ20 ప్రపంచకప్‌.. బంగ్లాతో వార్మప్‌ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘన విజయం

టీ20 ప్రపంచకప్‌నకు ముందు శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక వార్మప్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Published : 02 Jun 2024 00:05 IST

న్యూయార్క్‌: ఐపీఎల్ ముగిసిందో లేదో అభిమానులను అలరించేందుకు టీ20 ప్రపంచకప్‌ వచ్చేసింది. జూన్ 2 నుంచి పొట్టి కప్‌ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీకి ముందు శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక వార్మప్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (53 రిటైర్డ్ ఔట్; 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి బంగ్లా టాప్‌ ఆర్డర్ చేతులేత్తేసింది. ఏడో స్థానంలో వచ్చిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా (40 రిటైర్డ్ హర్ట్ ; 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్. 

ఓపెనర్‌ తాంజిద్ హసన్ (17) పరుగులు చేయగా.. సౌమ్య సర్కార్‌ (0), నజ్ముల్ హుస్సేన్ శాంటో (0) డకౌటయ్యారు. లిట్టన్ దాస్ (6) కూడా విఫలమయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 41 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  ఈ దశలో షకీబ్‌ అల్ హసన్ (28; 34 బంతుల్లో 2 ఫోర్లు), మహ్మదుల్లా నిలకడగా ఆడారు. ఈ జోడీ ఆరో వికెట్‌కు 75 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. శివమ్ దూబె వేసిన చివరి ఓవర్‌లో రిషద్‌ (0), జాకేర్ (0) డకౌటయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్ 2,  దూబె 2, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్‌ బుమ్రా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు కెప్టెన్‌ రోహిత్ శర్మ (23; 19 బంతుల్లో)తో కలిసి ఓపెనింగ్ చేసిన సంజు శాంసన్ (1) నిరాశపర్చాడు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా రిషభ్‌ పంత్ వన్‌డౌన్‌లో వచ్చి అర్ధ శతకం బాదాడు. సూర్యకుమార్ యాదవ్ (31; 18 బంతుల్లో 4 ఫోర్లు) రాణించగా.. చివర్లో హార్దిక్ పాండ్య (40*; 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. శివమ్ దూబె (14) పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో మెహది హసన్, షోరిఫుల్ ఇస్లామ్, మహ్మదుల్లా, తన్వీర్ ఇస్లామ్ తలో వికెట్ దక్కించుకున్నారు. గ్రూప్‌-ఏలో ఉన్న భారత్.. జూన్ 5న కెనడాతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని