logo

CT Scan: సిటి స్కాన్‌ వివరాలా..ఫొటో తీసుకోవాల్సిందే..

ఉభయగోదావరి జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా పేరుగాంచిన కాకినాడ జీజీహెచ్‌లో సిటి స్కాన్‌ రిపోర్టు కోసం రోగులకు తిప్పలు తప్పడం లేదు.

Updated : 19 Jul 2023 08:25 IST

కంప్యూటర్‌ స్క్రీన్‌పై ఉన్న నివేదికను చరవాణిలో నిక్షిప్తం చేసుకుంటున్న చిత్రం

న్యూస్‌టుడే, మసీదుసెంటర్‌(కాకినాడ):  ఉభయగోదావరి జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా పేరుగాంచిన కాకినాడ జీజీహెచ్‌లో సిటి స్కాన్‌ రిపోర్టు కోసం రోగులకు తిప్పలు తప్పడం లేదు. కొంత కాలం నుంచి పీపీపీ(పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌) పద్ధతిలో రోగులకు సిటి స్కాన్‌ యంత్రం ద్వారా సేవలందిస్తున్నారు. దీనికి సంబంధించి ఫిల్మ్‌ అందించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ రోగులకు ఉచితంగా సిటి స్కాన్‌ తీస్తారు. దానికి సంబంధించిన దృశ్యాన్ని రోగుల బంధువులు ఫొటో తీసుకోవచ్చు.. ఒకవేళ స్కానింగ్‌కు సంబంధించి ఫిల్మ్‌ అవసరమైతే రూ.300 చెలిస్తే నిర్వాహకులు ఇచ్చేవారు. ఇలా డబ్బులు తీసుకోవడంపై ఓ రోగి ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిల్మ్‌ ఇవ్వవద్దని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ నిర్వాహకులకు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో వారం రోజుల నుంచి ఫిల్మ్‌ అందక రోగులు వైద్యానికి ఇబ్బంది పడుతున్నారు. ఫిల్మ్‌ ఉంటే మెరుగైన వైద్యం చేసేందుకు వీలుంటుందని వైద్యులు చెబుతున్నారని, ఇక్కడ ఇవ్వడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో రోగులకు శస్త్రచికిత్సలు చేయాలంటే సిటిస్కాన్‌ ఫిల్మ్‌ విధిగా ఉండాలని, లేకుంటే అనుమతులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. జిల్లా అధికారులు స్పందించి అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ సమస్యను ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.హేమలతాదేవి వద్ద ప్రస్తావించగా ఎస్‌ఎల్‌ డయాగ్నోస్టిక్‌తో జరిగిన ఎంవోయూలో ఉచితంగా సిటి స్కాన్‌ తీయడం మాత్రమే ఉందన్నారు. ఉచితంగా ఫిల్మ్‌ అందించాలనే విషయం లేదన్నారు. రూ.300 చెల్లించి ఫిల్మ్‌ తీసుకునే విధానాన్ని కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇటీవల నిలిపివేసినట్లు చెప్పారు.  సిటి స్కాన్‌కు సంబంధించి చిత్రాలు, నివేదికల సాఫ్ట్‌, హార్డ్‌ కాపీలు రోగికి ఉచితంగా అందజేస్తారని సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు