logo

ఇంటింటికీ వెళ్లండి..నా మాటగా చెప్పండి..

‘సమయం లేదు. అందరూ ఇంటింటికీ వెళ్లి నా మాటగా, పార్టీ మాటగా చెప్పండి.. ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చే బాధ్యత నాది.

Updated : 03 Sep 2023 06:26 IST

జోన్‌-2 సమీక్షలో శ్రేణులకు చంద్రబాబు పిలుపు

మాట్లాడుతున్న చంద్రబాబు, చిత్రంలో జ్యోతుల నవీన్‌, గోరంట్ల, చినరాజప్ప, అచ్చెన్నాయుడు, యనమల, నల్లమిల్లి, బండారు

  • ‘బాదుడే బాదుడు ప్రారంభించినప్పట్నుంచి వైకాపా ప్రభుత్వ పతనం ప్రారంభమైంది. ఒంగోలులో మహానాడుకు రానీయకుండా అడ్డుకుంటామంటే ప్రభంజనంలా ప్రజలు వచ్చారు. రాజమహేంద్రవరంలో మహానాడు బ్రహ్మాండంగా జయప్రదమైంది.. అదే తెదేపా శక్తి, సామర్థ్యం, కార్యకర్తల బలం’.
  • ‘తెదేపా అధికారంలో ఉండి ఉంటే.. ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి గోదావరి జిల్లాలకు మూడు పంటలకు నీళ్లిచ్చేవాళ్లం. నదులు అనుసంధానం చేసిఉంటే రైతులకు మేలు జరిగేది. కరవు ఉండేది కాదు. వైకాపా వాళ్ల్లు వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేసి రాష్ట్రాన్ని కరవు పీడిత ప్రాంతంగా మార్చారు.’  
  • ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో ఏమిటీ అరాచకం..? నడిరోడ్డుమీద హత్యలు, మానభంగాలు, రౌడీయిజం.. ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు... పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది...  బ్లేడ్‌, గంజాయి బ్యాచ్‌లు వచ్చి భయంకరమైన వాతావరణం నెలకొంది. యువత పెడతోవ పడుతున్నారు.
  • రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు.. ఓటు ఉందో పోయిందో చూసుకోవాలి.

ఈనాడు, కాకినాడ; న్యూస్‌టుడే: కాకినాడ నగరం, పిఠాపురం, కరప

‘సమయం లేదు. అందరూ ఇంటింటికీ వెళ్లి నా మాటగా, పార్టీ మాటగా చెప్పండి.. ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చే బాధ్యత నాది. పార్టీని గెలిపించే బాధ్యత ప్రజలది’ అని శ్రేణులకు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి నాయకుడికి గుర్తింపు ఉంటుందన్నారు. కాకినాడ గ్రామీణ మండలం అచ్చెంపేట కూడలి సమీపంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 36 నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ముఖ్యనాయకులతో ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ 45 రోజుల కార్యక్రమంలో భాగంగా తెదేపా జోన్‌- 2 సమావేశం శనివారం నిర్వహించారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. తెదేపా ఏ కార్యక్రమం చేసినా ప్రజలు జయప్రదం చేయడం ఆనందంగా ఉందన్నారు. సాంకేతికతను అనుసంధానం చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకెళ్లాలని శ్రేణులకు సూచించారు. ప్రతి ఇంటికీ వెళ్లి.. రాష్ట్రంలోని 4 కోట్ల ఓట్లలో కనీసం 3 కోట్ల మంది ప్రజలను 45 రోజుల్లో కలిసి రిజిస్ట్రేషన్‌ చేయించాలని సూచించారు. కార్యకర్తలే తెదేపాకు బలం.. పెద్ద ఆస్తి అని వ్యాఖ్యానించారు. 42 ఏళ్లుగా జెండా మోసిన కార్యకర్తలపై రాష్ట్రాన్ని, భావితరాలను కాపాడాల్సిన చారిత్రక బాధ్యత ఉందన్నారు.. ఆరు నెలలు కష్టపడండి.. మీరిచ్చే హామీలు నెరవేర్చే బాధ్యత .. మీ బాగోగులు చూసే బాధ్యత నేను తీసుకుంటానన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాం..

గతంతో పోలిస్తే తెదేపాకు ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఆదరణ బాగుందని చంద్రబాబు అన్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టామన్నారు. వైకాపా నాయకుల ఇసుక దోపిడీ, దందాలపై పోరాటం చేశామన్నారు. ఈ కార్యక్రమాలు విజయవంతం కావడంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల పాత్ర అభినందనీయమన్నారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ విజయవంతం చేయాలన్నారు. స్థానికంగా గుర్తించిన సమస్యలపై కొత్త కార్యక్రమాలు చేయాలని సూచించారు.

నమ్ముకున్నవారు అనాథలు కారు..

కార్యకర్తల సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెదేపాయేనని చంద్రబాబు అన్నారు.. ముమ్మిడి వరానికి చెందిన మోపూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్యకర్తల్లో కొందరు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పిల్లలకు సరైన చదువులు చెప్పించుకోలేకపోతున్నారన్నారు. చంద్రబాబు స్పందిస్తూ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా రెండు రాష్ట్రాల్లోని కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యపరమైన సేవలందిస్తున్నామని.. పాఠశాలలు సైతం ఏర్పాటు చేశామన్నారు. తెదేపాను నమ్ముకున్నవారెవ్వరూ అనాథలు కారని భరోసా ఇచ్చారు. ః  చాలా మంది కార్యకర్తలు, నాయకులు వేదికపై తన పక్కన కూర్చొనేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కష్టపడి పనిచేయండి. పార్టీని అధికారంలోకి తెండి. అప్పుడు నేనే మీ వద్దకు వస్తా. అని పేర్కొన్నారు.

మేనిఫెస్టోలో చేరుస్తాం..

సమావేశంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు

‘జగ్గంపేట నియోజకవర్గంలో పుష్కర ఎత్తిపోతల పథకాన్ని తెదేపా హయాంలో నిర్మించారు. ఇది మీరిచ్చిన వరం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంద’ని చంద్రబాబు దృష్టికి గండేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పోతుల మోహనరావు తీసుకెళ్లారు. నియోజకవర్గ స్థాయిలో కీలకమైన సమస్యలను గుర్తించి పరిష్కారానికి మేనిఫెస్టోలో చేరుస్తామని చంద్రబాబు ప్రకటించారు.

చంద్రబాబు సీఎం కావడం ఖాయం

తెదేపా అధినేత చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు అన్నారు. ప్రస్తుతం క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌స్థాయి కమిటీలతో తెదేపా నూతన వ్యవస్థ ఏర్పాటు చేసుకుందన్నారు. వైకాపా మాదిరిగా తెదేపా గాలికి పుట్టుకొచ్చిన పార్టీ కాదని.. ఎన్ని అవస్థలు పెట్టినా.. ఆస్తులు కోల్పోయినా.. జైలుకి వెళ్లేందుకైనా కార్యకర్తలు, నాయకులు సిద్ధపడ్డారన్నారు. రానున్న ఎన్నికల్లో తెదేపా 150 పైగా స్థానాల్లో గెలుపొందుతుందన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాల సమాచారం ఇంటింటా తీసుకెళ్లేందుకు ‘బాబు ష్యూరిటీ..భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. దేశ చరిత్రలో 5 కోట్ల మంది ఆంధ్రులు తిరగబడిన, ఛీకొట్టిన ఘనత జగన్‌ సొంతం చేసుకున్నారన్నారు.  

క్షేత్రంలో పని చేయాల్సిందే..

జోన్‌-2 ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రానున్న అయిదు నెలలు చాలా కీలకమని.. పార్టీ అప్పగించిన అన్ని కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు