logo

Andhrapradesh news: తిరిగొస్తావనుకుంటే.. కడుపుకోత మిగిల్చావా..!

అదృశ్యమైన బిడ్డ కోసం కాళ్లు అరిగేలా తిరిగారు. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఏ క్షణమైనా తిరిగొస్తాడని ఆశగా చూస్తున్నారు.

Updated : 14 Sep 2023 07:44 IST

హోసన్న (పాత చిత్రం)

చాగల్లు, న్యూస్‌టుడే: అదృశ్యమైన బిడ్డ కోసం కాళ్లు అరిగేలా తిరిగారు. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఏ క్షణమైనా తిరిగొస్తాడని ఆశగా చూస్తున్నారు. తీరా చెరువులో విగతజీవిగా చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కొవ్వూరు మండలం పంగిడికి చెందిన వి.జాన్‌రత్నం, మరియమ్మ దంపతులు స్థానికంగా నల్లపూసలు వంటివి విక్రయిస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. మూడో సంతానమైన హోసన్న(9) ఈ నెల 10న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. వెతికినా ఆచూకీ దొరకలేదు. బుధవారం చాగల్లులోని మాతంగి చెరువులో ఓ బాలుడి మృతదేహం దొరికిందన్న సమాచారంతో వెళ్లి చూశారు. దుస్తులు ఆధారంగా హోసన్నగా నిర్ధారించారు.

గతేడాది తమ్ముడు.. ఇప్పుడు అన్న..

ఏడాది క్రితం నాలుగో సంతానమైన జయరాజు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి వద్ద నీటి తొట్టెలో పడి మృతి చెందాడు. ఇప్పుడు హోసన్న మృతితో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. చిన్న కొడుకు నీటి తొట్టెలో, పెద్దకొడుకు చెరువులో పడి మృత్యువాత పడటంతో విధి తమపై పగబట్టిందా అంటూ ఆ తల్లిదండ్రులు విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిడదవోలు తరలించారు. జాన్‌రత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై హుస్సేన్‌ తెలిపారు.


ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్‌ బలవన్మరణం

రాజమహేంద్రవరం నేరవార్తలు: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ఆటోడ్రైవర్‌ బలవన్మరణానికి పాల్పడిన ఘటన బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై జగన్‌మోహన్‌రావు తెలిపిన వివరాల మేరకు.. దివాన్‌చెరువు గ్రామానికి చెందిన అక్కిరెడ్డి రామకృష్ణ(63) నగరంలో ఆటో నడుపుతూ.. అతడి భార్య సీత స్థానికంగా కూరగాయల అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఎక్కువగా ఉండటంతో ఈ నెల 8న రామకృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం గమనించిన కుటుంబీకులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని