logo

Kakinada: ముస్సోరి కలిపింది ఇద్దరినీ.. కలెక్టర్ల ప్రేమ కథ

నేనీదరిని.. నువ్వాదరినీ.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ.. అన్నట్లు.. ఒకరిది చండీగఢ్‌.. మరొకరిది ఉత్తరప్రదేశ్‌.. కలెక్టర్‌ అవ్వాలన్నదే ఇద్దరి లక్ష్యం.. కఠోర శ్రమతో గమ్యం వైపు అడుగులు వేశారు.. ముస్సోరిలో ఐఏఎస్‌ శిక్షణకు వెళ్లారు.. ఆ సమయంలో పరిచయం స్నేహంగా మారింది. మనసులూ కలిసి ప్రేమ చిగురించింది.. ఇరువురి తల్లిదండ్రులకు వీరితో పాటు వీరి ఇష్టాలు నచ్చాయి.

Updated : 14 Feb 2024 08:36 IST

లక్ష్యాలు, అభిరుచులు ఒకటిగా ప్రయాణం

నేనీదరిని.. నువ్వాదరినీ.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ.. అన్నట్లు.. ఒకరిది చండీగఢ్‌.. మరొకరిది ఉత్తరప్రదేశ్‌.. కలెక్టర్‌ అవ్వాలన్నదే ఇద్దరి లక్ష్యం.. కఠోర శ్రమతో గమ్యం వైపు అడుగులు వేశారు.. ముస్సోరిలో ఐఏఎస్‌ శిక్షణకు వెళ్లారు.. ఆ సమయంలో పరిచయం స్నేహంగా మారింది. మనసులూ కలిసి ప్రేమ చిగురించింది.. ఇరువురి తల్లిదండ్రులకు వీరితో పాటు వీరి ఇష్టాలు నచ్చాయి. 2013లో ప్రేమతో మొదలై.. 2015లో పెళ్లితో కథ సుఖాంతమైంది. వేర్వేరు చోట్ల బాధ్యతలు..నిత్యం ఎదురయ్యే సవాళ్లు.. అన్నీ సమర్థంగా అధిగమించారు. ఇప్పుడు పక్కపక్క జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ కలెక్టర్‌ హిమాన్షు శుక్లా.. కాకినాడ కలెక్టర్‌ కృతికా శుక్లా దంపతులు.

అర్థం చేసుకునేలా..

‘‘2013లో ముస్సోరి ఐఏఎస్‌ శిక్షణ శిబిరంలో ఇద్దరూ కలిశారు. ఒకరి అనుమానాలు మరొకరు నివృత్తి చేసుకునేవారు. కృతిక ఎకనామిక్స్‌లో దిట్ట.. ఫైనాన్స్‌ పీహెచ్‌డీ చేశారు. ఆమెతో పరిచయం అయ్యాక ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన హిమాన్షు శుక్లా ఎకనామిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ చేశారు. ఇద్దరి ఇష్టాలు.. అభిరుచులు.. లక్ష్యాలు తెలుసుకుని అర్థం చేసుకున్నాక కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి పెళ్లి పీటలెక్కారు’’..

  • ‘యువతీయువకులకు ఏది ప్రేమ.. ఏది ఆకర్షణో తెలుసుకోవాలి. బాహ్య సౌందర్యం తాత్కాలికం.. అంతర సౌందర్యం శాశ్వతమని గుర్తించాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతోంది. ఇష్టాలు, అభిరుచులు, అభిప్రాయాలు కలవకపోతే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. ఎదుటి వారి ప్రాధామ్యాలు తెలుసుకోవాలి.. సంస్కృతి, సంప్రదాయాలకు విలువ ఇవ్వగలగాలి. ప్రతి ఒక్కరికీ ఆర్థిక స్వాతంత్య్రం ముఖ్యం. మా ప్రేమ ఒక రోజులో సాకారం కాలేదు. చాలా సమయం తీసుకున్నాం. ఇద్దరం బాగా ఆలోచించాకే, కలిసి ప్రయాణం చేయాలనే నిర్ణయానికి వచ్చామ’ని వీరు తెలిపారు.

సెలవు పెట్టి వచ్చి..

హిమాన్షు శుక్లాది కాన్పూర్‌.. ముంబై ఐఐటీలో చదివారు. 12వ తరగతి తర్వాత మర్చెంట్‌ నేవీలో కోర్సు పూర్తిచేసి అబ్రాడ్‌ వెళ్లిపోయారు. 20 ఏళ్లకే ఉద్యోగం వచ్చింది. ఇటలీ, యూఎస్‌, చైనాలో అయిదేళ్లు ఉద్యోగం చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని సెలవు పెట్టి దిల్లీ వచ్చారు. శిక్షణ పొందకపోయినా తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్‌కు అర్హత సాధించారు. కృతికా శుక్లాది చండీఘడ్‌.. క్లాస్‌ 10, 12లో టాపర్‌.. న్యూదిల్లీలోని శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో చదివారు. దిల్లీ స్కూలు ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఎంకాం చేశారు. ఐఏఎస్‌ లక్ష్యంతో పరీక్ష రాస్తే రెండో ప్రయత్నంలో ఫలించింది. శిక్షణ సమయంలోనే ఎకనామిక్స్‌ (ఫైనాన్స్‌)లో పీహెచ్‌డీ పూర్తిచేశారు.

  • జీవితంలో ఏదైనా సాధించాలన్న లక్ష్యం ఉండాలి.. దానిని ముందు ప్రేమించగలగాలి. నిర్దేశించుకున్న గమ్యాన్ని సమర్థంగా చేరుకోగలిగితే.. మన ఇష్టాలను పెద్దలు కాదనరు.’ అంటారు కలెక్టర్‌ దంపతులు

ఒడుదొడుకులు తట్టుకోవాలి

‘‘ హిమాన్షుశుక్లా తిరుపతిలో సబ్‌కలెక్టర్‌గా.. పర్యాటక శాఖ ఎండీగా.. గుంటూరు, పశ్చిమగోదావరి జేసీగా పనిచేశారు. ప్రస్తుతం కోనసీమ జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. కృతికాశుక్లా జేసీగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పనిచేశారు. మహిళాభివృద్ధి- శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా పనిచేశాక.. కాకినాడ కలెక్టర్‌గా వచ్చారు.’’ ః వృత్తి, ఉద్యోగ నిర్వహణలో సవాళ్లు, ఒత్తిళ్లు సహజం.. బాధ్యతలు సమర్థంగా నిర్వహించడంలోనే తృప్తి. పని ఒత్తిడి ప్రభావం కుటుంబంపై, ప్రేమ బంధంపై పడకూడదు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. మేమైతే.. సమస్య వచ్చినప్పుడు చర్చించుకుంటాం. నీకు నేనున్నాననే భరోసా ఇచ్చుకుంటాం.. అదే మా ఇద్దరి బలం..అని పేర్కొన్నారు.

ఈనాడు, కాకినాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని