logo

నిలదీద్దాం.. వైకాపాను గద్దె దించేద్దాం

కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెం, పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో శనివారం రాత్రి నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అధికార పార్టీ నేతల అరాచకాలపై నిప్పులు చెరిగారు.

Published : 28 Apr 2024 04:14 IST

వారిని మళ్లీ గెలిపిస్తే ప్రజలను తొక్కేస్తారు
ఓట్లు ఎందుకు వేయాలని నిలదీయండి
ఇంద్రపాలెం, సామర్లకోట బహిరంగ సభల్లో జనసేనాని పవన్‌కల్యాణ్‌

ప్రసంగిస్తున్న పవన్‌.. చిత్రంలో ఉదయ్‌ శ్రీనివాస్‌, పంతం నానాజీ, పిల్లి సత్యనారాయణమూర్తి, అనంతలక్ష్మి

ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం; న్యూస్‌టుడే, సర్పవరం జంక్షన్‌, గాంధీనగర్‌, మసీదు సెంటర్‌, సామర్లకోట, గ్రామీణం, యు.కొత్తపల్లి, పెద్దాపురం: కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెం, పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో శనివారం రాత్రి నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అధికార పార్టీ నేతల అరాచకాలపై నిప్పులు చెరిగారు. ‘చలమలశెట్టి సునీల్‌ ప్రతి అయిదేళ్లకో పార్టీ మారిపోతాడు.. ఐడియాలజీ లేదు. ఒక పార్టీకి నిలబడని వాడు.. మీకోసం ఎలా నిలబడతాడ’ని పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. దళిత డ్రైవర్‌ను చంపేసి డోర్‌డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును ఎంపీ అభ్యర్థి సునీల్‌ పక్కన తిప్పుకొంటున్నాడు.. ఏమనుకుంటున్నారు ఒక్కొక్కరు.. ప్రజల్ని ఎలా చూస్తున్నారని పవన్‌ ధ్వజమెత్తారు. హత్యలు, దోపిడీలు చేసి బయటకు వచ్చి ఏమైనా చేసేస్తామంటే ప్రజలు స్వాగతించరన్నారు. వైకాపా ఎమ్మెల్యే, ఎంపీలు వస్తే ఎందుకు మీకు ఓట్లేయాలని అడగండని ప్రజలను కోరారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌, పెద్దాపురం తెదేపా అభ్యర్థి చినరాజప్పను గెలిపించాలని కోరారు. ఎక్కడ తెదేపా, భాజపా పోటీచేస్తున్నా జనసేన నాయకులు మనస్ఫూర్తిగా మద్దతు తెలిపి కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

  • ‘ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి అహంకారం.. తెదేపా అధినేతను, నన్ను పొగరు ఎక్కువై ఎలాపడితే అలా తిట్టాడు.. కన్నబాబు, మీరు చేసింది మర్చిపోలేదు. మిమ్మల్ని గద్దె దించే సమయం వచ్చింది’
  • కాపుల పక్షాన ఉన్నానని మాట్లాడే కన్నబాబు.. కాపు రిజర్వేషన్‌ ఇవ్వనని జగన్‌ చెప్పినప్పుడు పక్కనే ఉన్నా ఎందుకు మాట్లాడలేదు.
  • ఇసుక మన అందరి సొత్తా? లేదా జగన్‌, కన్నబాబు, ద్వారంపూడి, చలమలశెట్టి సొత్తా.. మానవ వనరులు, సహజ వనరులన్నీ మన ఆస్తి అని గుర్తుంచుకోండి.. ఇలాంటి వాళ్లను మళ్లీ గెలిపిస్తే ప్రజలను తొక్కేస్తారని అర్థం చేసుకోండి

పవన్‌ కల్యాణ్‌

ఎవర్నో నలిపేసి ఎదగకూడదు..

చిరంజీవి పడేసిన భిక్షతో కన్నబాబు రాజకీయంలోకి వచ్చారని పవన్‌ విమర్శించారు. కన్నబాబూ.. ఇలా రా అంటే పరుగెత్తుకు వచ్చే వ్యక్తి.  చిరంజీవి దగ్గరకు వచ్చి చిన్న సమాచారం ఇచ్చేవ్యక్తి.. అంచెలంచెలుగా ఎదిగారు. నాయకులుగా ఎదగాలి మాకేం ఇబ్బందిలేదు. ఎవర్ని నలిపేసి ఎదుగుతున్నావనేది కీలకం..అని వ్యాఖ్యానించారు.

సామర్లకోట సభలో పవన్‌.. చినరాజప్ప, ఉదయ్‌ శ్రీనివాస్‌

పరిష్కారం చూపుతా..

సూర్యారావుపేటలో మత్స్యకారుల గుడిసెలు కన్నబాబు బలవంతంగా ఖాళీచేయించారు. అక్కడ 750 ప్లాట్లు వేసి 30 మాత్రమే ఇచ్చారు. మిగిలినవి వీళ్లే ఉంచుకున్నారని తెలిసింది. మేము వచ్చాక స్థలాలు కేటాయించేలా చూస్తామని పవన్‌కల్యాణ్‌ బాధితులకు భరోసా ఇచ్చారు. ఇళ్ల స్థలాల విషయంలో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన రెవెన్యూ అధికారిని వేధించారని.. న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కొంగోడు గ్రామానికి వంతెన చాలా అవసరం.. కమిషన్‌ కోసం కాంట్రాక్టర్‌ను కన్నబాబు తరిమేశారని ఆరోపించారు. ఎత్తిపోతల పథకాలు, జూనియర్‌ కళాశాల, అవుట్‌డోర్‌ స్టేడియంతోపాటు. కరపలో ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామన్నారు.. డీజిల్‌, గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. నియోజకవర్గాల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.. నైపుణ్య శిక్షణ ఇప్పించి పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అభివాదం చేస్తూ...

మత్స్యకారులను గుండెల్లో పెట్టుకుంటాం..

దేశంలో 30 శాతం మత్స్యసంపద ఉత్పత్తి, 35 శాతం ఎగుమతి రాష్ట్రం నుంచే జరగుతున్నా.. తుపానులు తట్టుకునే ఇళ్లు లేవు. నీటికి ఇబ్బందులు ఉన్నాయి.మిమ్మల్ని గుండెల్లోకి హత్తుకుని కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని పవన్‌కల్యాణ్‌ భరోసా ఇచ్చారు.


ఇంద్రపాలెంలో అశేష జనవాహిని

జిల్లా నాయకులకే నిర్ణయాధికారం ఉండాలి..

జిల్లాలోని కొండలు తవ్వాలన్నా.. మైనింగ్‌ చేయాలన్నా మిథున్‌రెడ్డి అనుమతి తీసుకోవాలి. ఈ పరిస్థితి మారాలని, స్థానిక నాయకులకే వనరులపై స్వీయ నిర్ణయాధికారం, సంపూర్ణ ఆధిపత్యం ఉండాలి తప్ప జగన్‌కు, మిథున్‌కు కాదని పవన్‌ అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఏడీబీ, కెనాల్‌ రహదారులు నిర్మిస్తామని.. చెరుకు, కర్రపెండలం, పామాయిల్‌ రైతులకు మేలు చేస్తామని భరోసానిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని