logo

వైకాపాకు ఓటేస్తే.. మీ ఆస్తులన్నీ తాకట్టే

రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకూ న్యాయం చేస్తుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హామీ ఇచ్చారు.

Published : 29 Apr 2024 06:18 IST

యువత, ఉద్యోగ, పోలీసులకు న్యాయం చేసే బాధ్యత మాది
కిర్లంపూడి వారాహి విజయభేరి సభలో పవన్‌కల్యాణ్‌

ఈనాడు, రాజమహేంద్రవరం - న్యూస్‌టుడే, కిర్లంపూడి, జగ్గంపేట, గ్రామీణం: రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకూ న్యాయం చేస్తుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హామీ ఇచ్చారు. పొరపాటున వైకాపాకు ఓట్లేస్తే మీకున్న ఆస్తుల దస్త్రాలన్నీ డిజిటలైజ్‌ చేసి దోచేస్తారని.. మీకు తెలియకుండా తాకట్టు పెట్టేస్తారని హెచ్చరించారు. కిర్లంపూడిలో ఆదివారం వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా గంజాయికి అలవాటు చేశారని మండిపడ్డారు. వారాంతపు సెలవులు ఇవ్వకుండా రేయింబవళ్లు ఊడిగం చేయించుకుంటున్న ఉద్యోగులు, పోలీసులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  సీపీఎస్‌ సమస్యను ఏడాదిలో పరిష్కరించేలా ఇప్పటికే చంద్రబాబుతో చర్చించానని.. 30న విడుదల చేసే కూటమి మేనిఫెస్టోలో దీనిపై స్పష్టత ఇస్తామన్నారు.

అది ధైర్యజ్యోతి

‘నేనొస్తే.. అరచేతిలో హారతులు వెలిగిస్తారు. అది మీ గుండెల్లోని ధైర్యజ్యోతి. జగన్‌లాంటి నీచ ప్రభుత్వానికి ఎదురుతిరగడానికి ధైర్యం ఇచ్చే జ్యోతి’ అని పవన్‌ అన్నారు. అన్యాయం చేసేవారిపై ఎదురు తిరగాలని, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ విషయంలో తెదేపా ప్రభుత్వంతో పోల్చితే జగన్‌ హయాంలో తక్కువ మంది ప్రయోజనం పొందారని, అంబేడ్కర్‌ విదేశీ విద్య విషయంలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల విద్యుత్తు ఉచితమని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక తండాల్లో ఉంటేనే పథకం వర్తిస్తుందని మెలిక పెట్టారని పవన్‌ విమర్శించారు.

తంగెళ్లకు పవన్‌ స్వీట్‌ వార్నింగ్‌..

తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ టీటైం ప్రారంభించి 24వేల మందికి ఉపాధి కల్పించి సంపద సృష్టించిన వ్యక్తి.. దాంట్లో 11వేల మంది మహిళలు ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగా పెట్టా.. అని పవన్‌కల్యాణ్‌ అన్నారు. వైకాపా నాయకుల్లా.. మా అన్నదమ్ములకు, ఆడపిల్లలకు ఏమాత్రం అన్యాయం చేసినా జగన్‌ను చీల్చిచెండాడినట్లే.. నిన్నూ చీల్చిచెండాడుతా. నాతో సహా అందరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ఎవ్వరూ అతీతులు కాదని పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. సభల్లో కాకినాడ జిల్లా తెదేపా అధ్యక్షులు జ్యోతుల నవీన్‌, తోట నవీన్‌, అలమండ చలమయ్య, ఎం.నారాయణస్వామి, బి.గోపి.. జనసేన నాయకులు తుమ్మల రామస్వామి, వరుపుల తమ్మయ్యబాబు, మేడిశెట్టి సూర్యకిరణ్‌, పెంటకోట మోహన్‌.. భాజపా నాయకులు ఎస్‌.సత్తిరాజు, ఉమ్మిడి వెంకట్రావు, కూరాకుల రాజా, తదితరులు పాల్గొన్నారు.

  • ఏలేరు ప్రాజెక్టుతో పూర్తిమేలు జరగాలంటే పోలవరం వాడుకలోకి రావాలన్నారు. అన్న క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ క్యాంటీ¨న్లు ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు.
  • దశదిశా మార్చే ఎన్నికలు 13-14 రోజులు ఉన్నాయి. పిఠాపురం నుంచి పోటీచేస్తున్నానని, మీ బాగోగులు చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సరైన సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలు లేక ఆర్థికంగా అంతా చితికిపోయారని పవన్‌కల్యాణ్‌ ఆవేదన వ్యక్తంచేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని