logo

సమయం దాటినా అధికార పార్టీ వ్యక్తికి అనుమతి

ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6.00 గంటలలోగా పోలింగ్‌ కేంద్రంలో ఉన్నవారికే ఓటేసేందుకు అవకాశం ఉంటుంది.

Published : 14 May 2024 04:18 IST

కూటమి యువకుడికి నిరాకరణ
ప్రశ్నించినందుకు జనసేన బూత్‌ ఏజెంట్‌పై ఫిర్యాదు

రావిమెట్లలో ఉద్రిక్త పరిస్థితి

నిడదవోలు: ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6.00 గంటలలోగా పోలింగ్‌ కేంద్రంలో ఉన్నవారికే ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. సమయం మించిపోయినా సరే వైకాపా అనుకూల వ్యక్తిని అనుమతించి, జనసేన అనుకూలమైన వ్యక్తిని అనుమతించకపోవడం నిడదవోలు మండలం రావిమెట్లలో ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార పార్టీకి చెందిన ఒకరు ఓటేసేందుకు సాయంత్రం ఆరు దాటిన తర్వాత రావిమెట్లలోని పోలింగ్‌ కేంద్రానికి రాగా అనుమతించారు. ఆ తర్వాత జనసేన పార్టీకి చెందిన మరొకరు రాగా సమయం అయిపోయిందని అనుమతించలేదు. దీనిపై జనసేన పార్టీ బూత్‌ ఏజెంట్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీ వ్యక్తికి అవకాశం ఇచ్చి, తమ మనిషిని ఎందుకు అనుమతించట్లేదని ప్రశ్నించారు. ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి జనసేన పార్టీ బూత్‌ ఏజెంట్‌పై వైకాపా నాయకులతో వైకాపా ఎమ్మెల్యే శ్రీనివాస్‌నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఘటనకు సంబంధించి సమిశ్రగూడెం ఎస్సై రమేశ్‌ వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. విషయం తెలియడంతో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్‌ అక్కడకు వెళ్లారు. ఎస్సై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని