logo

మే 18 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు

అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మే 18 నుంచి 24 వరకు జరగనున్న స్వామివారి కల్యాణోత్సవాలకు ఏర్పాట్లపై పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు అధ్యక్షతన సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది.

Published : 29 Apr 2024 06:19 IST

సమావేశంలో చర్చిస్తున్న ఆర్డీవో, ఈవో, వివిధ శాఖల అధికారులు

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మే 18 నుంచి 24 వరకు జరగనున్న స్వామివారి కల్యాణోత్సవాలకు ఏర్పాట్లపై పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు అధ్యక్షతన సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. ఈవో కె.రామచంద్రమోహన్‌, పలు శాఖల అధికారులు పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు. మే 19న స్వామివారి కల్యాణం జరగనున్న నేపథ్యంలో వేదిక వద్ద భద్రత, ఇతర ఏర్పాట్లు, బారికేడ్లు తదితర అంశాలపై సమీక్షించి నిర్ణయం తీసుకున్నారు. భక్తులను కొండపైకి తెచ్చేందుకు ప్రత్యేక ఉచిత బస్సులు అందుబాటులో ఉంచుతారు. పోలీస్‌, దేవస్థానం భద్రతా సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తారు. కల్యాణం అనంతరం భక్తులకు ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం పంపిణీకి ఆరు కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. ఉత్సవాల్లో రాత్రి 7 గంటల నుంచి గ్రామోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో భారీ వాహనాలు గ్రామంలోకి అనుమతించకుండా జాతీయ రహదారిపై నుంచి మళ్లించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఉత్సవాలు జరిగే వారం రోజులు నిత్యకల్యాణం, ఆయుష్యహోమం తదితర ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తారు. 23న శ్రీచక్రస్నానానికి పంపా రిజర్వాయర్‌లో కనీసం 100 అడుగుల నీటిమట్టం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులతో చర్చిస్తున్నారు. మే 18న స్వామి, అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెను చేయడం, 19న కల్యాణం, 20న అరుంధతి నక్షత్ర దర్శనం, రావణ వాహన సేవ, 21న పండిత సదస్యం, పొన్న వాహన సేవ, 22న వనవిహారం, రథోత్సవం, 23న శ్రీచక్రస్నానం, 24న శ్రీపుష్పయాగం తదితర కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఏడాది శ్రీపుష్పయాగం నిత్యకల్యాణ మండపంలో నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని