logo

అడిగేవారే లేరు!

గుంటూరు నగరంలో మూడేళ్ల క్రితం రూ.6కోట్ల నిధులు వెచ్చించి చేపట్టిన ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, సంపులు, పంప్‌హౌస్‌లు ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు.

Updated : 06 Feb 2023 06:09 IST

ట్యాంకులు, సంపులు, పంప్‌హౌస్‌లు నిరుపయోగం
నిర్మాణ పనుల్లో లోపాలు నీ రూ.కోట్లు వృథా
ఈనాడు, అమరావతి

లక్ష్మీపురంలో వినియోగంలోకి రాని ఓవర్‌హెడ్‌ ట్యాంకు

గుంటూరు నగరంలో మూడేళ్ల క్రితం రూ.6కోట్ల నిధులు వెచ్చించి చేపట్టిన ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, సంపులు, పంప్‌హౌస్‌లు ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు. ఈ పనులు ప్రణాళికాబద్ధంగా జరగలేదు. దీంతో సంపులు, ఓవర్‌హెడ్‌ ట్యాంకుల్లోకి నీరు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. అసలు సంపుల్లోకే నీళ్లు రానప్పుడు ట్యాంకుల్లోకి ఇంకేమి ఎక్కుతాయని ప్రాజెక్టు అధికారులు, గుత్తేదారు వదిలేశారు. కౌన్సిల్‌కు నూతన పాలకవర్గం ఏర్పడినా ఏనాడు ఈ ప్రాజెక్టులను ఎందుకు వినియోగంలోకి తేలేదని కౌన్సిల్‌ సమావేశాల్లో నిలదీసిన కార్పొరేటర్‌ లేరంటే అతిశయోక్తి కాదు.

బిల్లులు చెల్లించాక ఇప్పుడేం చేస్తారు!

ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల పనులు చేసిన గుత్తేదారు సంస్థకు ఇప్పటికే సింహభాగం నిధులు చెల్లించేశారు. చేసిన పనులకు మించి చెల్లింపులు చేశారని తెలుస్తోంది. ఇప్పుడు గుత్తేదారు సైతం ఆ ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావడానికి ఆసక్తి చూపటం లేదు. పనుల నిర్వహణలో భారీ లోపాలు ఉన్నట్లు గుర్తించారు. సంపులోకి నీరు చేరేలా కాకుండా భూమి నుంచి అదనపు ఎత్తులో దాని నిర్మాణం చేపట్టారు. దీంతో ట్రయల్‌ రన్‌లోనే చుక్క నీళ్లు సంపులోకి పడలేదు. ట్యాంకుల్లోకి పైపులైన్ల ద్వారా నీళ్లు ఎక్కించడానికి అవసరమైన అనుసంధానం పనులు సంపూర్ణంగా చేయలేదు. పర్యవసానంగా ట్యాంకుల్లోకి నీళ్లు వెళ్లటం లేదు. ఈ లోపాలు బయటపడగానే నిర్మాణ పనులను పర్యవేక్షించిన ప్రాజెక్టు అధికారులు, గుత్తేదారు ఎవరికి వారు నాలుక కర్చుకున్నారు. వీటిని సరి చేయాలంటే మొదటి నుంచి చేపట్టాల్సిందేనని ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా మూడేళ్ల నుంచి ట్యాంకులు దిష్టిబొమ్మల్లా కనిపించడం తప్ప వాటి వల్ల ప్రజలకు ప్రయోజనం శూన్యం.

చిన్న పనులేనని చెప్పి..

ఈ పనుల గురించి ఇంజినీరింగ్‌ అధికారులను ప్రశ్నిస్తే ఇంకా చిన్న చిన్న పనులు కొన్ని చేయాల్సి ఉన్నాయని, వాటిని పూర్తి చేసి వెంటనే వినియోగంలోకి తెస్తామని తప్పుదారి పట్టిస్తున్నారు. కమిషనర్లు మారుతున్నారే తప్ప నిరుపయోగ ప్రాజెక్టులు మాత్రం పట్టాలెక్కడం లేదు. లక్ష్మీపురం నుంచి నెహ్రూనగర్‌ దాకా రూ.10 కోట్లు వెచ్చించి చేపట్టిన తాగునీటి పైపులైను అక్కరకు రాలేదు. దానికి సంబంధించి కనెక్షన్ల అనుసంధానం జరగలేదు. పనులు పూర్తి చేయకుండానే గుత్తేదారుకు చెల్లింపులు చేయడంతో పత్తాలేకుండా పోయారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకులదీ అదే దుస్థితి. రూ.కోట్ల నిధులు వెచ్చించి వినియోగంలోకి లేకుండా వదిలేసిన ప్రాజెక్టులపై మేయర్‌, కమిషనర్‌ స్థాయిలో స్పందించి సమీక్షలు చేస్తే తప్ప బాధ్యులైన ప్రాజెక్టు అధికారులు, గుత్తేదారుల్లో చలనం రాదు.

నగరపాలకకు రూపాయి భారం లేకుండా..

గతంలో ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కింద నగరపాలక వాటా లేకుండా పూర్తిగా గ్రాంటు రూపంలో రూ.400 కోట్లు తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్టును చక్కగా వినియోగించుకుని నగరం మొత్తానికి సమగ్రంగా నీళ్లు ఇవ్వాలని 23 జోన్లుగా విభజించారు. అందులో భాగంగా 13 ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిర్మించగా లక్ష్మీపురం, నెహ్రూనగర్‌లో తలపెట్టినవి మాత్రం ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు. ఈ ట్యాంకుల పరిధిలో ఉన్న ప్రజలకు నీళ్లు సమృద్ధిగా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అయినా యంత్రాంగం పట్టించుకోవడం లేదు.

ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం

ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల్లోకి నీళ్లు చేరే పరిస్థితి లేక ఇప్పటి దాకా అవి వినియోగంలోకి రాలేదు. ఇటీవల కమిషనర్‌ దృష్టికి ఈ విషయం రాగానే స్పందించి ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. వాటిని వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. త్వరలోనే గుత్తేదారును పిలిచి అసంపూర్తి పనులు చేయించి ట్యాంకులు వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ చెల్లింపులు ఎక్కువ చేసి ఉంటే ఇంకా చేయాల్సిన పనులకు సర్దుబాటు చేస్తాం. అయినా అదనంగా చెల్లింపులు చేసి ఉంటే గుత్తేదారు నుంచి రికవరీ పెడతాం.

భాస్కర్‌, పర్యవేక్షక ఇంజినీరు, నగరపాలక సంస్థ
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని