logo

ఎన్నికల వేళా.. ఆగని దోపిడీ

అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది.

Published : 20 Apr 2024 05:17 IST

 అర్ధరాత్రి అడ్డగోలుగా తవ్వకాలు

పదుల సంఖ్యలో లారీలతో ఇసుక రవాణా

 అధికార పార్టీ ప్రజాప్రతినిధి మేనల్లుడి నిర్వాకం

 

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, కొల్లిపర: అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధి మేనల్లుడు ఇసుక వ్యాపారం చేస్తుండడంతో క్షేత్రస్థాయి యంత్రాంగం జీ హుజూర్‌ అంటోంది. అనుమతులు లేకపోయినా యంత్రాల వాడకంపై నిషేధం వంటి నిబంధనలకు నీళ్లొదిలి కాసుల కక్కుర్తితో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తూ రూ.కోట్లు అక్రమార్జనకు తెరలేపారు. ప్రజాప్రతినిధి అండ దండిగా ఉండడంతో యథేచ్ఛగా చెలరేగిపోయారు. కృష్ణానదిలో ఏకంగా బాటలు వేసి మరీ ఇసుక తవ్వి రవాణా చేస్తున్నారు. ఇసుకాసురుల దాహానికి అక్కడి గోతులే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, రోడ్లు పాడవుతున్నాయని స్థానికులు పదే పదే మొరపెట్టుకుంటున్నా ఇసుకాసురుల ముందు అరణ్యరోదన అవుతోంది. ఇదీ డెల్టా ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి మేనల్లుడి నిర్వాకం.

వారం రోజుల నుంచి మొదలై..

కృష్ణానదిలో కొల్లిపర మండల పరిధిలో వారం రోజుల నుంచి వైకాపా నేత ఇసుక అక్రమ తవ్వకాలకు తెరలేపారు. అంతకుముందు కూడా బుసక పేరుతో అనుమతులు తీసుకుని ఇసుక రవాణా చేసి రూ.కోట్లు కూడబెట్టుకున్నారు. నదిలో యంత్రాలతో తవ్వకాలను నిషేధించడంతో అనుమతి పొందిన కంపెనీ కొన్నాళ్లుగా తవ్వకాలు నిలిపేసింది. ఇదే అదనుగా వైకాపా నేత అక్రమ తవ్వకాలను ప్రారంభించారు. కొల్లిపర మండల పరిధిలో బొమ్మువానిపాలెం, మున్నంగి, వల్లభాపురం, అన్నవరపులంక తదితర రీచ్‌లలో రాత్రివేళ భారీ యంత్రాలు పెట్టి నిత్యం 150కు పైగా లారీల ఇసుకను తరలిస్తున్నారు. పెట్టుబడి లేని వ్యాపారం కావడం రోజువారీగా పెద్దఎత్తున ఆదాయం సమకూరుతుండడంతో నేతకు కాసుల వర్షం కురుస్తోంది.

కృష్ణా జిల్లాలో కట్టడితో ఇక్కడ డిమాండ్‌..

ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో ఇసుక తవ్వకాలను కట్టడి చేయడంతో గుంటూరు జిల్లా ఇసుకకు మరింత డిమాండ్‌ పెరిగింది. ఇదే అదనుగా చీకటిపడితే చాలు నదిలో పెద్దఎత్తున అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఏకంగా నదిలో లారీల రాకపోకలకు దారులు ఏర్పాటు చేసుకున్నారు. లారీలు ఇసుక నింపుకోవడానికి ఒక దారిలో వెళ్లేలా.. మరో దారిలో వేగంగా బయటకు వచ్చేలా చూస్తున్నారు. దీని వల్ల సమయం వృథా కాకుండా ఎక్కువ ట్రిప్పులు ఇసుక తరలించాలనేది నేత లక్ష్యం. ఒకవైపు ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు బిజీగా గడుపుతుండడంతో ప్రజాప్రతినిధి మేనల్లుడు మాత్రం ఇసుక అక్రమ రవాణాలో తీరిక లేకుండా ఉన్నారు. ప్రజాప్రతినిధి తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదంటూ బీరాలు పలుకుతుండగా ఆయన అండతోనే మేనల్లుడు ఇసుకాసురుడిగా అవతారమెత్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. లారీకి రూ.20వేల చొప్పున వారం రోజుల్లో 1050 ట్రిప్పుల ద్వారా సుమారు రూ.2.10 కోట్లు కొల్లగొట్టారు. ఇసుక వ్యాపారం మొత్తం మేనల్లుడి చేతిలో పెట్టడంతో రూ.కోట్లు సంపాదించి మామకు సమకూర్చారు.

యంత్రాంగానికి తెలిసినా.....

కొల్లిపర మండలంలో కృష్ణానదిలో ఇసుక రీచ్‌లలో రాత్రివేళ అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా క్షేత్రస్థాయి యంత్రాంగం పట్టించుకోలేదు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో గత నెల 16 నుంచి  24 గంటలు పనిచేసే తనిఖీ కేంద్రాలతో పాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ కూడా అన్ని మార్గాల్లో తనిఖీలు చేస్తున్నారు. రాత్రివేళ మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో వారం రోజులుగా  ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నా క్షేత్రస్థాయి యంత్రాంగం వాహనాలను స్వాధీనం చేసుకోలేదు. పోలీసు, రెవెన్యూ, భూగర్భగనులశాఖ అధికారులు అనుమతులు లేకుండా నదిలో తవ్వకాలు జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడలేదు. క్షేత్రస్థాయి యంత్రాంగం మొత్తం ప్రజాప్రతినిధి కనుసన్నల్లో పనిచేస్తుండడంతో ఎవరికివారు మిన్నకుండిపోయారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛగా పనిచేయాల్సిన యంత్రాంగం ఇంకా ప్రజాప్రతినిధి ఆదేశాలకు అనుగుణంగా పని చేయడం గమనార్హం.


33 లారీలు.. 2 పొక్లెయిన్లు స్వాధీనం

కొల్లిపర మండలం అన్నవరపులంకలో అనుమతులు లేకుండా ఇసుక తవ్వి తరలిస్తున్న 2 భారీ పొక్లెయిన్లు, 33 లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో లారీలు, పొక్లెయిన్లు స్వాధీనం చేసుకోవడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో గుంటూరు నుంచి పోలీసు బృందంతో ఏఎస్పీ నచికేత్‌ షెల్కే వెళ్లి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు