logo

Hyderabad: ఆమె.. అతడు.. అశ్లీలం!.. నగ్న వీడియోల ఉచ్చులో విలవిల

ఒకే ఒక్క ఫోన్‌కాల్‌ జీవితాలను తారుమారు చేస్తోంది. ఆనందాన్ని మాయం చేసి మనోవేదన మిగుల్చుతోంది. ఇప్పటి వరకూ మగవాళ్లు మాత్రమే బాధితులుగా ఉండేవారు.

Updated : 14 Mar 2023 07:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఒకే ఒక్క ఫోన్‌కాల్‌ జీవితాలను తారుమారు చేస్తోంది. ఆనందాన్ని మాయం చేసి మనోవేదన మిగుల్చుతోంది. ఇప్పటి వరకూ మగవాళ్లు మాత్రమే బాధితులుగా ఉండేవారు. తాజాగా మహిళలనూ ఈ ఉచ్చులోకి గుంజుతున్నారు. పాతికేళ్ల యువకుడు ప్రైవేటు ఉద్యోగి. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతితో ఛాటింగ్‌ చేశాడు. ఫోన్‌ నంబరు ఇచ్చాడు. కొద్దిరోజులకు వాట్సాప్‌ నంబర్‌కు నగ్నవీడియో కాల్‌ చేసింది. ఇతడు దాన్ని చూస్తున్నట్టు అటువైపు వీడియో తీశారు. ఊహించని ఈ ఘటన నుంచి తేరుకునేలోగానే రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. కాదంటే ఆ దృశ్యాలను స్నేహితులు, బంధువులకు పంపుతామంటూ బెదిరింపు. దాచుకున్న సొమ్ము నుంచి రూ.50వేలు ఇచ్చి బయటపడ్డాడు. మరోసారి రూ.లక్ష చెల్లించాడు. తరచూ అట్నుంచి వేధింపులు ఎదురవటంతో నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం వలపు వలతో డబ్బులు వసూలు చేస్తున్న సైబర్‌ నేరస్థులు పెరుగుతున్నారు. 60-70 రోజుల వ్యవధిలో 3 కమిషనరేట్ల పరిధిలో 100కుపైగా ఫిర్యాదులు రావటం పరిస్థితికి అద్దం పడుతోంది.

సామాజిక వేదికలే అస్త్రాలు

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, డేటింగ్‌ యాప్స్‌.. ఇవే మాయగాళ్లకు అసలైన అస్త్రాలు. స్నేహం పేరుతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపుతారు. ప్రొఫైల్‌లో అందమైన చిత్రాలు, ఉన్నత కొలువు చేస్తున్నట్టు నింపుతారు. స్నేహ అభ్యర్థనకు స్పందించగానే ఛాటింగ్‌ చేస్తారు. అవతలి వారి వయసు, సామాజిక హోదా తదితర విషయాలను ధ్రువీకరించుకుంటున్నారు. అర్ధరాత్రి దాటాక వాట్సాప్‌ ఫోన్‌కాల్‌ చేసి గంటల తరబడి మాట్లాడుతున్నారు. బుట్టలో పడినట్టు నిర్దారణకు వచ్చాక పథకం అమలు పరుస్తున్నారు. వాట్సాప్‌లో నగ్న వీడియోకాల్‌ చేసి చూస్తున్నట్లు స్క్రీన్‌ రికార్డింగ్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేస్తారు. రూ.20,000 నుంచి రూ.5 లక్షల వరకూ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటారు. ఎదురుతిరిగితే సామాజిక మాధ్యమాల్లో ఆ నగ్న వీడియోలను పెడుతున్నారు. అయినా లొంగకపోతే ఫోన్‌ జాబితాలోని మహిళలకు ఆ వీడియోలను పంపుతారు. మీ స్నేహితుడు/సోదరుడితో కలసి మీరు నగ్న వీడియోలు చూస్తున్నారంటూ మార్ఫింగ్‌ ఫొటోలతో పరువు తీస్తామంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి సామాజిక మాధ్యమాల్లో వచ్చే స్నేహ అభ్యర్థనకు స్పందించవద్దని నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచించారు. కొత్తవారి వీడియో కాల్‌ స్వీకరించవద్దన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని