logo

Hyderabad: నేను రాలేను.. సోదరుడి దహన సంస్కారాలు మీరే చేయండి

నేను కువైట్‌లో ఉన్నాను.. చనిపోయిన మా తమ్ముడికి నేనొక్కదానినే.. తల్లిదండ్రులు లేరు.. నేను ఇక్కడి నుంచి ఇప్పుడు రాలేను.. మృతదేహాన్ని మున్సిపల్‌ వారికి అప్పగించండి.. లేదంటే మీరే మా తమ్ముడి అంత్యక్రియలు పూర్తి చేయండి

Updated : 27 Apr 2023 10:02 IST

పోలీసులను కోరిన కువైట్‌లో నివసిస్తున్న మహిళ

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: నేను కువైట్‌లో ఉన్నాను.. చనిపోయిన మా తమ్ముడికి నేనొక్కదానినే.. తల్లిదండ్రులు లేరు.. నేను ఇక్కడి నుంచి ఇప్పుడు రాలేను.. మృతదేహాన్ని మున్సిపల్‌ వారికి అప్పగించండి.. లేదంటే మీరే మా తమ్ముడి అంత్యక్రియలు పూర్తి చేయండి అంటూ ఓ మహిళ బంజారాహిల్స్‌ పోలీసులను కోరింది. ఆంధ్రప్రదేశ్‌ తిరుపతిలోని క్రాంతినగర్‌కు చెందిన పవన్‌కుమార్‌ మహానంది(37) కొంత కాలంగా బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి వద్ద జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో నివసిస్తున్నాడు. దాతలు పెట్టే భోజనాన్ని స్వీకరిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. మూడు రోజుల క్రితం తీవ్ర కడుపునొప్పి వచ్చింది. బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. స్థానికుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఎస్సై కరుణాకర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. మృతుడి బ్యాగులో లభించిన ఆధార్‌ కార్డు ఆధారంగా తిరుపతిలో సంప్రదించారు. తద్వారా అతనికి సోదరి శారద ఉందనే విషయాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కువైట్‌లో ఉన్న ఆమెకు కరుణాకర్‌రెడ్డి ఫోన్‌ చేయగా తాను రాలేనని, మున్సిపాలిటీ వారికి అప్పగించి దహన సంస్కారాలు పూర్తి చేయాలని కోరారు. ఈ మేరకు మున్సిపల్‌ అధికారులకు లేఖ రాస్తామని ఎస్సై తెలిపారు. లేదంటే ఎవరైనా స్వచ్ఛంద సంస్థ నుంచి లేదా మరెవరైనా వస్తే దహన సంస్కారాలు నిర్వహిస్తామని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని