logo

గెలుపు బాధ్యత మీదే!

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతలు ఎన్నికల ప్రచారానికి మరింత పదును పెడుతున్నారు.  ఉదయం మొదలు రాత్రి వరకు తమ పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులపై స్థానిక నాయకులను అడిగి తెలుసుకుంటున్నారు.

Updated : 28 Apr 2024 04:00 IST

మండల స్థాయిలో పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు

న్యూస్‌టుడే, పరిగి: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతలు ఎన్నికల ప్రచారానికి మరింత పదును పెడుతున్నారు.  ఉదయం మొదలు రాత్రి వరకు తమ పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులపై స్థానిక నాయకులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా మండల స్థాయిలో ఉన్న నాయకత్వానికే గెలుపు బాధ్యతలను అప్పగిస్తున్నారు. మీ మండలంలో ఇంత మెజార్టీ తీసుకువచ్చే విధంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేస్తున్నారు. మండల, తాలుకా స్థాయిలో కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తూ వారిని ఉత్తేజితులను చేస్తున్నారు. కాంగ్రెస్‌, భాజపా, భారాస నాయకులు ఎవరికి వారు తమ వ్యూహాలను రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నారు. బూత్‌స్థాయిలో ఐదారుగురు ఒక బృందంగా ఏర్పడి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తుండటంతో పరిగి నియోజకవర్గ రాజకీయం రసకందాయంలో పడింది.

రంజిత్‌రెడ్డి తరఫున టీఆర్‌ఆర్‌: జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి తమ అభ్యర్థి రంజిత్‌రెడ్డి విజయానికి విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి ఉమారెడ్డి, రంజిత్‌రెడ్డి అర్ధాంగి సీతారెడ్డి కూడా ఇంటింటి ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. 

గట్టి పోటీ ఇవ్వాలని భాజపా..

అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన భాజపా ఈసారి పరువు కోసం గట్టి పోటీ ఇచ్చేందుకు తలపడుతోంది. 2014లో తెరాస తరఫున పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 73,023 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మారిన సమీకరణల నేపథ్యంలో ఈసారి ఆయన భాజపా నుంచి బరిలో ఉన్నారు. పార్టీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న బూనేటి కిరణ్‌ కేంద్రం అమలు చేస్తున్న పథకాలతో ప్రచారం చేస్తున్నారు. గతంలో కొండాకు ఉన్న పరిచయాలు ఇక్కడ ప్రధానం కానున్నాయి.

పాగా వేయాలని భారాస

శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైన భారాస తిరిగి నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఓటర్లు ఎక్కువగా ఉన్న గ్రామాలపై మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి దృష్టి పెట్టారు. పార్టీ నాయకులతో సమావేశాలను నిర్వహిస్తూ వారిని ఉత్తేజితులను చేస్తున్నారు. నియోజకవర్గంలో బీసీల ఓటు బ్యాంకు అధికంగా ఉన్న నేపథ్యంలో కాసాని దృష్టి పరిగిపై పడింది. స్థానికంగా ఉన్న పరిచయాలు, ఆయా పార్టీల నాయకులతో ఉన్న సంబంధాలను మరింత బలపరుచుకునేందుకు కృషి చేస్తున్నారు.

ముగ్గురూ పాతవారే

ఇటీవలి వరకు భారాస పార్లమెంటు సభ్యునిగా పనిచేసిన గడ్డం రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌ తరఫున పోటీలో ఉన్నారు. భారాస నుంచి గతంలో ఉమ్మడి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్‌, గతంలో ఎంపీగా పనిచేసిన ప్రస్తుత భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా జిల్లాకు సుపరిచితులే. నామినేషన్లు కూడా దాఖలు చేయడంతో అసలు ఘట్టం ప్రారంభమైంది. ఎవరికి వారు అంచనాలు వేసుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పల్లెల్లో ప్రచారం ఊపందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని