logo

యువ వాటరూ.. నీదే జోరు

యువ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే గెలుపు తథ్యమని భావిస్తున్న నాయకులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో దాదాపు సగం మంది ఓటర్లు 18 నుంచి 39 ఏళ్లలోపు వారే ఉండటంతో వీరిని తమవైపు తిప్పుకొంటే గెలుపు ఖాయమనే ధీమాలో నేతలున్నారు.

Updated : 28 Apr 2024 03:55 IST

వారిని ప్రసన్నం చేసుకునేందుకు నేతల ప్రయత్నాలు
యువసేన పేరుతో గ్రూపులు.. విహారయాత్రలు

ఈనాడు, హైదరాబాద్‌: యువ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే గెలుపు తథ్యమని భావిస్తున్న నాయకులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో దాదాపు సగం మంది ఓటర్లు 18 నుంచి 39 ఏళ్లలోపు వారే ఉండటంతో వీరిని తమవైపు తిప్పుకొంటే గెలుపు ఖాయమనే ధీమాలో నేతలున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో (హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాలు, మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలోని కొంత భాగం) మొత్తం 45లక్షలకుపైగా ఓటర్లు ఉండగా అందులో దాదాపు 22లక్షల మంది యువ ఓటర్లున్నారు. ఇందులోనూ మూడింట ఒక వంతు అంటే 13లక్షల మంది 30 నుంచి 39 ఏళ్లలోపు వారున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో మిగిలిన భాగం, చేవెళ్ల నియోజకవర్గంలోనూ 40శాతం మంది ఇదే వయస్సు ఉన్నారు.

లక్ష్యం నిర్దేశిస్తున్నారిలా.. కొత్తగా ఓటరుగా నమోదైన 18 నుంచి 25 ఏళ్ల వారిని తమ వెంట ప్రచారానికి రావాలని కోరుతున్నారు. యువజన సంఘాలతో కలిసి సమావేశాలు నిర్వహించి తమ వైపు తిప్పుకోవాలని వారికి సూచిస్తున్నారు. బూత్‌స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తూ 50శాతం ఓట్లు పడాలంటూ లక్ష్యం నిర్దేశిస్తున్నారు. నాయకుడి పేరుతో యువసేన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ గ్రూపులు ఏర్పాటు చేయించి ఎక్కువ మంది అందులో చేరేలా ప్రేరేపిస్తున్నారు. ప్రచారానికి వచ్చేవారికి రోజూ బిర్యానీ, వారాంతపు చెల్లింపులతో పాటు ఎన్నికల తర్వాత గోవా, తదితర ప్రాంతాలకు విహారయాత్రలు ఉంటాయని హామీ ఇస్తున్నారు. వీరిని పర్యవేక్షించే బాధ్యతలను 25 నుంచి 39 ఏళ్లు ఉన్నవారికి అప్పగించి అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, బస్తీల్లో ప్రచార బాధ్యతలు అప్పగిస్తున్నారు. మహిళలకు ప్రచార బాధ్యతలు అప్పగిస్తూ మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని