logo

ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూపుతూ..

నగరంలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. నామినేషన్ల దాఖలు పూర్తికావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టిపెట్టారు.

Updated : 28 Apr 2024 06:43 IST

ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూపుతూ..
నాలుగు ఎంసీ స్థానాల్లో అభ్యర్థుల పథమిలా

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. నామినేషన్ల దాఖలు పూర్తికావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టిపెట్టారు. పార్టీల రాష్ట్ర, కేంద్ర నాయకులు జాతీయ అంశాలపై మాట్లాడుతుంటే.. అభ్యర్థులు స్థానిక అంశాలే తమ ప్రచార అంశంగా ప్రజల్లోకి వెళుతున్నారు. కొందరైతే ప్రత్యేకంగా మ్యానిఫెస్టోలను ప్రకటిస్తున్నారు. తమని గెలిపిస్తే చేసే పనులను చెప్పడంతో పాటు ప్రత్యర్థి పార్టీల లోపాలను ఎత్తిచూపుతున్నారు.

నగరంలోని ఎంపీ స్థానాలు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల.. ఇవి వేటికవే భిన్నమైనవి. ఈసారి ప్రచారం గతం కంటే భిన్నంగా సాగుతోంది. అభ్యర్థులు కొందరు ప్రత్యేకంగా ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకుని వారు చెప్పినట్టు చేస్తున్నారు. ప్రచార, సామాజిక మాధ్యమాల నిర్వహణ మొత్తం వారే చూసుకుంటున్నారు. లోకల్‌, నాన్‌ లోకల్‌ అంశాలను తెరమీదకు తీసుకొస్తున్నారు.

చేవెళ్ల

చేవెళ్ల స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. మూడు నగరం పరిధి, మరో మూడు పూర్తిగా గ్రామీణం, మరొకటి కలబోతగా ఉంటాయి. భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఏకంగా నియోజకవర్గం కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో ప్రకటించారు. ప్రభుత్వ తోడ్పాటుతో అందించే పథకాలతో పాటు వ్యక్తిగతంగా చేసే పనులను అందులో ప్రకటించారు. ఈస్థానం పరిధిలో 700 గ్రామాలను తాను రెండుమూడు సార్లు తిరిగానని, మీరు ఒక్కసారైనా తిరిగారా అంటూ ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి.. ఎంపీగా ఐదేళ్లుగా తాను ఎంతో అభివృద్ధి చేశానని చెబుతున్నారు. ఇక్కడినుంచి బీసీ నినాదంతో భారాస తరఫున కాసాని జ్ఞానేశ్వర్‌ రంగంలో ఉన్నారు.

మల్కాజిగిరి

దేశంలోనే పెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గమిది. తెలంగాణవాసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచివచ్చి ఏళ్లకిందట స్థిరపడినవారు ఉన్నారు. భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి వినూత్న ప్రచారంతో ముందుకెళుతున్నారు. ఎస్‌ఆర్‌డీపీ కింద గతంలో రాష్ట్రంలో అధికారంలోఉన్న తమ ప్రభుత్వం 36 ప్రాజెక్టులు పూర్తిచేస్తే, కేంద్రంలోని భాజపా సర్కారు చేపట్టిన ఉప్పల్‌-మేడిపల్లి ఫ్లైఓవర్‌ ఆరేళ్లుగా పెండింగ్‌లోనే ఉందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పట్నం సునితా మహేందర్‌రెడ్డి ఉన్నారు. గెలిపిస్తే చేయబోయే పనులపై కరపత్రాలు పంచుతున్నారు. ఈ ప్రాంతాన్ని కోకాపేటలా అభివృద్ధిచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారంలో ప్రకటించారు. మోడీ పరివార్‌గా తమను గెలిపించాలని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ కోరుతున్నారు. విశ్వకర్మ యోజన పథకంతో అందులోఉన్న 17 కులాలకు న్యాయం చేస్తానని చెబుతున్నారు.

సికింద్రాబాద్‌..

భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్‌.. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే, మంత్రిగా తాను ఎంతో అభివృద్ధి చేశానని, ఎంపీగానూ గెలిపిస్తే మరిన్ని పనులు చేస్తానని చెబుతున్నారు. భాజపా అభ్యర్థిగా ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గల్లీగల్లీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. దశాబ్దకాలంగా జంటనగరాల్లోని అణగారిన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా.. ముఖ్యంగా మహిళలు, యువత, మైనారిటీ సంక్షేమానికి కేంద్రం గణనీయంగా నిధులు కేటాయించిందని చెబుతున్నారు. కాంగ్రెస్‌నుంచి దానం నాగేందర్‌ ఇప్పుడిప్పుడే ప్రచారం మొదలెట్టారు. గెలిపిస్తే చేయబోయే పనులపై కరపత్రాలు పంచుతున్నారు.

హైదరాబాద్‌

సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ హైదరాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఏడు నియోజకవర్గాల్లో గల్లీగల్లీ తిరుగుతున్నారు. దీటుగా భాజపా అభ్యర్థి మాధవీలత విస్తృత ప్రచారం చేస్తున్నారు. స్థానికం కన్నా జాతీయ అంశాలపైనే వీరి ప్రచారం జరుగుతోంది. భారాసనుంచి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నుంచి మహమ్మద్‌ సమీర్‌ బరిలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు