logo

ఎండకు తాళలేం.. ఎన్నికల విధులకు వెళ్లలేం

ఎన్నికల విధుల పట్ల కొందరు ఉద్యోగులు ఆసక్తి చూపట్లేదు. రకరకాల కారణాలు చెప్పి మినహాయింపు కోరుతున్నారు. నిత్యం సుమారు వంద నుంచి 200ల మంది ఉద్యోగులు లేఖలు ఇస్తుండటమే అందుకు నిదర్శనం.

Published : 28 Apr 2024 03:07 IST

 

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల విధుల పట్ల కొందరు ఉద్యోగులు ఆసక్తి చూపట్లేదు. రకరకాల కారణాలు చెప్పి మినహాయింపు కోరుతున్నారు. నిత్యం సుమారు వంద నుంచి 200ల మంది ఉద్యోగులు లేఖలు ఇస్తుండటమే అందుకు నిదర్శనం. జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం చుట్టూ వారంతా చక్కర్లు కొడుతున్నారు. ఇదేంటని కొందరు అధికారులను ‘ఈనాడు’ ఆరా తీయగా.. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పారు. అటు.. జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌, రిటర్నింగ్‌ అధికారులు అనుదీప్‌ దురిశెట్టి, హేమంత్‌ పాటిల్‌, సిబ్బంది విభాగం నోడల్‌ అధికారి ఉపేందర్‌రెడ్డిలోనూ మినహాయింపు లేఖలపై ఆందోళన నెలకొంది. మే 13 వరకు ఇంకెంత మంది మినహాయింపు కోరుతారోనని ఆలోచిస్తున్నారు.

సరిపడా ఉన్నప్పటికీ ఆందోళనే..

ప్రతి 16 మంది అభ్యర్థులకు ఓ బ్యాలెట్‌ యూనిట్‌ అవసరమైనందున, ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌ను మోసేందుకు ఒక్కో సిబ్బందిని నియమించుకోవాలి. ఈ లెక్కన హైదరాబాద్‌ జిల్లాలోని 3,986 పోలింగ్‌ కేంద్రాలకు 16వేల మంది ఉద్యోగులు, మరో 10 వేల మంది సిబ్బంది కావాలని అధికారుల అంచనా. అలాగే.. మరో 20శాతం మందిని రిజర్వులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం.. 20శాతం రిజర్వు యంత్రాంగంతో కలిపి ఉద్యోగులు, సిబ్బంది జిల్లా ఎన్నికల అధికారి వద్ద సిద్ధంగా ఉన్నారు. వారికి ఇటీవలే విధులు నిర్వర్తించాల్సిన అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించారు. అయినప్పటికీ.. మినహాయింపు కోరుతూ రోజువారీ  విన్నపాలతో ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు.
కారణాలు: ఎండలు మండిపోతుండటం.. మేలో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో చాలామంది విధులకు ఆసక్తి చూపడం లేదు. కొందరు మహిళా ఉద్యోగులు.. తమకు కేటాయించిన కేంద్రాలు దూరంగా ఉన్నాయని, ముందురోజు రాత్రి పోలింగ్‌ కేంద్రంలో నిద్రించడం కష్టమని, సదుపాయాల్లేవని మినహాయింపు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు