logo

వేసవిలో నగరానికి అదనపు జలాలు

గ్రేటర్‌ వ్యాప్తంగా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు డిమాండ్‌ పెరిగిందని..

Published : 29 Apr 2024 04:11 IST

నీటి సరఫరా 553 ఎంజీడీల నుంచి 575 ఎంజీడీలకు పెంపు
‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ వ్యాప్తంగా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు డిమాండ్‌ పెరిగిందని.. దీంతో ఆయా ప్రాంతాల్లో బోర్లపై ఆధారపడే వారంతా ప్రస్తుతం జలమండలి సరఫరా చేసే నీటిపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో ఒక్కసారిగా ఆ ప్రభావం పడిందని పేర్కొంది. ‘నగర వాసి.. నీటికి అల్లాడి’ శీర్షికన ‘ఈనాడు’లో శనివారం ప్రచురితమైన కథనానికి జలమండలి స్పందించింది. వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కార్యాచరణను రూపొందించామని.. అన్ని జలాశయాల నుంచి నగరానికి సరఫరా పెంచినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రోజుకు 553 ఎంజీడీలు సరఫరా చేయగా...ప్రస్తుతం 575 ఎంజీడీలు అందిస్తున్నట్లు చెప్పింది. గోదావరి, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌, మంజీరాల నుంచి అదనపు జలాలను తరలించి సరఫరా చేస్తున్నట్లు వివరించింది. ట్యాంకర్‌ బుకింగ్స్‌, సరఫరా కోసం జలమండలి ప్రత్యేకంగా చర్యలు చేపట్టిందని, 3 షిఫ్టుల్లో.. రాత్రిళ్లు కూడా నీటిని సరఫరా చేస్తున్నామని.. సరఫరా సమయాన్ని తగ్గించడం లాంటి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ట్యాంకర్‌ సరఫరా ఆలస్యమైతే ముందుగా సంబంధిత వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం ఇస్తున్నామని, తద్వారా నీటి సరఫరాలో పారదర్శకత పాటిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వేకు నీటి సరఫరాలో ఎలాంటి కోతలు పెట్టలేదని, ఒప్పందం చేసుకున్న దాని కన్నా 20 శాతం ఎక్కువే సరఫరా చేస్తున్నామని జలమండలి తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని