logo

రసవత్తరం..చేవెళ్ల పోరు

చేవెళ్ల లోక్‌సభ ఎన్నికలు ప్రతిసారీ రసవత్తరంగా సాగుతాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంటుంది.

Published : 29 Apr 2024 04:26 IST

తొలి గెలుపు కాంగ్రెస్‌దే
రెండుసార్లు గెలిచిన భారాస
బోణీ కొట్టాలని భాజపా

న్యూస్‌టుడే, తాండూరు, వికారాబాద్‌: చేవెళ్ల లోక్‌సభ ఎన్నికలు ప్రతిసారీ రసవత్తరంగా సాగుతాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంటుంది. 2008లో దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 2009 లో చేవెళ్ల లోక్‌ సభ ఏర్పాటైంది. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎస్‌.జైపాల్‌రెడ్డి, తెదేపా నుంచి జితేందర్‌రెడ్డి, భాజపా నుంచి బద్దం బాల్‌రెడ్డి పోటీ చేశారు. పోటీ మాత్రం కాంగ్రెస్‌, తెదేపాల మధ్యనే జరిగింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 38.78 శాతంతో 4,20,807 ఓట్లు సాధించింది. తెదేపా 37.08 శాతంతో 4,02, 275 ఓట్లను సాధించింది. భాజపా కేవలం 10.39 శాతంతో 1,12,701 ఓట్లు మాత్రమే సాధించింది. కాంగ్రెస్‌ పార్టీ తెదేపాపై 18,532 ఓట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ ఎన్నికలు హోరాహోరీ

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీగా మారుతున్నాయి. భాజపా, కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులు ముగ్గురూ గెలపునకు చెమటోడుస్తున్నారు. భారాస మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని చూస్తోంది. ఆ పార్టీ తరపున కాసాని జ్ఞానేశ్వర్‌ అభ్యర్థిగా తొలిసారి బరిలో దిగారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, పరిగి మాజీ ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, డాక్టర్‌ ఆనంద్‌కుమార్‌, కొప్పుల మహేష్‌రెడ్డి  తమ అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ మద్దతు కూడగడుతున్నారు.


తొలి విజయం కోసం...

ఈ ఎన్నికల్లో గెలుపొంది బోణీ కొట్టాలని భాజపా చూస్తోంది. 2009, 2019 ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భాజపా గెలుపుపై కోటి ఆశలు పెట్టుకుంది. పార్టీ తరపున కొండావిశ్వేశర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. చేవెళ్లపై ప్రత్యేక మ్యానిఫెస్టో తెచ్చారు.


తెరాస (భారాస) ఆరంభం.. అదిరింది  

2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి చవిచూసింది. తొలిసారిగా రంగంలోకి దిగిన  తెరాస అనూహ్య విజయం సాధించింది. పార్టీ తరపున పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి 33.06 శాతంతో 4,35,077 ఓట్లు సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పట్లోళ్ల కార్తీక్‌ రెడ్డి పోటీ చేశారు. 27.53 శాతంతో 3,62,054 ఓట్లు సాధించారు. తెరాస కాంగ్రెస్‌పై 73,023 ఓట్ల తేడాతో విజయం సాధించింది. తెదేపా నుంచి పోటీ చేసిన తూళ్ల వీరేందర్‌గౌడ్‌కు 26.34 శాతంతో 3,53,203 ఓట్లు వచ్చాయి. ఈఎన్నికల్లో భాజపా పోటీ చేయకుండా తెదేపాకు మద్దతు ఇచ్చింది.

  • 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించలేదు. కొండా విశ్వేశ్వర్‌ రెడ్డే 2019లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. తెరాస నుంచి రంజిత్‌రెడ్డి, భాజపా నుంచి బి.జనార్దన్‌రెడ్డి బరిలోకి దిగారు. తెరాస అభ్యర్థి విజయం సాధించారు.

గ్రామాల్లో తిరుగుతూ.. మద్దతు కూడగడుతూ

భారాస సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి  కాంగ్రెస్‌ పార్టీలో చేరి అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి సభలు, సమావేశాలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌ తన నియోజకవర్గ పరిధి గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతూ కాంగ్రెస్‌ గెలవాల్సిన అవసరాన్ని వివరిసున్నారు. మండలాల వారీగా కార్యకర్తలు, మండలస్థాయి నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇక బుయ్యని అభ్యర్థి రంజిత్‌రెడ్డితో కలిసి సమన్వయ ప్రచారం చేస్తున్నారు.  వికారాబాద్‌ ఎమ్మెల్యేగా ఉన్న శాసన సభ స్పీకర్‌  గడ్డం ప్రసాద్‌ కుమార్‌ రంజిత్‌ రెడ్డి గెలుపునకు తనవంతు కృషి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని