logo

ఓట్ల పండగకు దూరంగా ఉంటే ఎలా?

చట్టసభలకు ప్రాతినిథ్యం వహించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న Ëపోలింగ్‌ ప్రక్రియలో మేధావులు, విద్యావేత్తలు, యువకులు, విద్యార్థులు సరిగా పాల్గోవడం లేదు.

Published : 29 Apr 2024 04:44 IST

ఓటు హక్కు వినియోగంపై నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సభ్యుల అవగాహన

ఈనాడు, హైదరాబాద్‌: చట్టసభలకు ప్రాతినిథ్యం వహించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న పోలింగ్‌ ప్రక్రియలో మేధావులు, విద్యావేత్తలు, యువకులు, విద్యార్థులు సరిగా పాల్గోవడం లేదు. దశాబ్దాలుగా వీరు పోలింగ్‌కు దూరంగా ఉండటంతో పోలింగ్‌శాతం తగ్గిపోతోంది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో కొందరు నేరచరిత కలిగిన వారు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికవుతున్నారు. సరైన పాలకులను ఎన్నుకునేందుకు వజ్రాయుధమనే ఓటు హక్కును వినియోగించుకోవాలన్న లక్ష్యంతో ఎలక్షన్‌ వాచ్‌ కమిటీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ జాతీయ ఛైర్మన్‌ డాక్టర్‌ బొమ్మరబోయిన కేశవులు తెలిపారు.  

ఆలోచనలుంటే మార్పు తథ్యం..  ఓటు మనం ఎందుకు వేయాలి? ఎవరికి వేయాలి? అన్న అంశాలపై ఇప్పటికీ 50శాతం మంది యువతకు అవగాహన లేదని కమిటీ గుర్తించింది. కొందరికి తమ ఎమ్మెల్యే, ఎంపీగా ఎవరో కూడా తెలియదని తేలింది. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యా సంస్థలు, వైద్యకళాశాలల్లో సదస్సులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. పోలింగ్‌ ప్రక్రియలో ఎవరైనా అక్రమాలకు పాల్పడినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని వివరిస్తున్నారు.

ప్రలోభాలు.. మద్యం సరఫరా..  ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొందరు నాయకులు డబ్బు, మద్యం సరఫరా చేస్తారని, వాటికి దూరంగా ఉండాలంటూ నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ కమిటీ సభ్యులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధానప్రాంతాల్లో ర్యాలీలు, సభలు నిర్వహించి డబ్బు, మద్యం ఎందుకు ఇస్తున్నారో తెలుసా? అంటూ వారిని ప్రశ్నించి డబ్బు, మద్యానికి ఓటును అమ్ముకోకూడదంటూ వివరిస్తున్నారు. యువత చరవాణుల్లో సీ-విజిల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి ఫిర్యాదుల ఎలా చేయాలో అవగాహన కల్పిస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని