logo

అరచేతిలో ఏఐ..ప్రచారానికి సై

మేము గెలిస్తే కూడళ్లను అభివృద్ధి చేస్తాం.. రహదారులను విస్తరిస్తాం.. గ్రామాలు, పట్టణాలను సుందరీకరిస్తాం.. ఎన్నికల ప్రచారంలో నేతలు ఇలా హామీలు ఇస్తుంటారు.

Updated : 29 Apr 2024 05:35 IST

ఎన్నికల్లో సాంకేతికత వినియోగం
చేయబోయే అభివృద్ధి కళ్లముందే

ఏఐతో రూపొందించిన మూసీ పరీవాహక చిత్రమిది

ఈనాడు, హైదరాబాద్‌: మేము గెలిస్తే కూడళ్లను అభివృద్ధి చేస్తాం.. రహదారులను విస్తరిస్తాం.. గ్రామాలు, పట్టణాలను సుందరీకరిస్తాం.. ఎన్నికల ప్రచారంలో నేతలు ఇలా హామీలు ఇస్తుంటారు. ఓటర్లు మాత్రం ఇవన్నీ విని ఊరుకుంటారు. కానీ చెప్పిన పనులన్నీ పూర్తయిన తరువాత ఆ ప్రాంతం ఎలా ఉంటుందో ముందే చూపిస్తే మదిలో గుర్తుండి పోతుంది. ప్రగతి ఫలాలు కళ్ల ముందే కదలాడుతుంటాయి. అందుకే ప్రస్తుత ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు కృత్రిమ మేథ (ఏఐ)ను వినియోగిస్తున్నారు. ప్రచారంలో ఈ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. సామాజిక మాధ్యమాల వేదికగా ఏఐతో రూపొందించిన చిత్రాలను ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా చేస్తున్నారు.

శంకరపల్లిలో ఇలా..

గ్రేటర్‌ పరిధిలోని 4 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎండలు మండిపోతుండటంతో క్షేత్రస్థాయిలోకి వెళ్లడం కంటే సామాజిక మాధ్యమాల వేదికగానే అభ్యర్థులు ఎక్కువగా ప్రచారాన్ని రక్తికట్టిస్తున్నారు. ఇందులోనూ కొత్తదనం చూపేందుకు అభ్యర్థుల తరఫున ప్రచార బాధ్యతలు చూస్తున్న స్ట్రాటజిస్టులు కసరత్తు చేస్తున్నారు.

కొందరు ముందుంటున్నారు..

నియోజకవర్గాల అభివృద్ధిపై పార్టీలు, అభ్యర్థుల ఆలోచనలు మాటల్లో ఎంత వివరించినా వందశాతం జనంలోకి వెళ్తుందని చెప్పలేం. అదే చిత్రాలైతే చూడగానే ఆకట్టుకుంటాయి. చేవెళ్లలో భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కోసం పనిచేస్తున్న వాలంటీర్లు, కీబోర్డ్‌ వారియర్స్‌.. పరిగి, శంకర్‌పల్లి, రాజేంద్రనగర్‌ ప్రాంతాల అభివృద్ధి ఎలా మారబోతుందనేది ఏఐ రూపొందించిన చిత్రాలతో ప్రచారం చేస్తున్నారు. కొందరు ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థులపై ఏఐతో మీమ్స్‌ రూపొందించి వ్యంగ్యాస్త్రాలనూ వదులుతున్నారు.

ఏఐ వర్చువల్‌ అసిస్టెంట్‌తో..

ఒక్కో లోక్‌సభ పరిధిలో సుమారు 25 లక్షల ఓటర్లున్నారు. అందర్ని కలుసుకోవడం అసాధ్యం. ఇంటి నుంచే ఏఐ వర్చువల్‌ అసిస్టెంట్‌ సాయంతో ఓటర్లకు చేరువయ్యే టూల్స్‌ను టెకీలు అభివృద్ధి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు వినియోగించారు కూడా. లోక్‌సభ ప్రచారానికి ఈ తరహా ఏఐ వర్చువల్‌ అసిస్టెంట్‌తో ఎన్నికల వరకు ఓటర్లతో టచ్‌లో ఉండొచ్చని టెకీలు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని