logo

అమ్మను పిలిచి.. మృత్యుంజయుడై..

అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌ స్థలంలో ఆడుకుంటున్న జంపన ఉజ్వల్‌ కుమార్‌(4) హఠాత్తుగా ‘అమ్మా’ అని కేక వేశాడు. పెద్దగా అరవటంతో కంగారుపడిన తల్లి బయటికి వచ్చింది.

Updated : 30 Apr 2024 05:58 IST

నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

తల్లిదండ్రులు అలేఖ్య, సాయికుమార్‌తో ఉజ్వల్‌

సైదాబాద్‌, న్యూస్‌టుడే: అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌ స్థలంలో ఆడుకుంటున్న జంపన ఉజ్వల్‌ కుమార్‌(4) హఠాత్తుగా ‘అమ్మా’ అని కేక వేశాడు. పెద్దగా అరవటంతో కంగారుపడిన తల్లి బయటికి వచ్చింది. కుమారుడి కుడి కాలును పట్టుకుని వీధి కుక్కలు గేటు బయటికి ఈడ్చుకెళ్తున్న దృశ్యం చూసి నివ్వెరపోయింది. చేతికి అందిన ఓ కత్తెర తీసుకుని కుక్కల సమూహంపై విసిరింది. అయినా కుక్కలు కుమారుడిపై విచక్షణరహితంగా దాడి చేస్తుండటంతో ఓ కర్ర తీసుకుని బాదడంతో పారిపోయాయి. అయితే అప్పటికే చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం సాయంత్రం మూసారాంబాగ్‌ డివిజన్‌ లక్ష్మీనగర్‌ కాలనీలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన ఉజ్వల్‌ కుమార్‌ను వెంటనే కుటుంబ సభ్యులు మలక్‌పేట ఏరియా ఆసుపత్రికి వైద్యం కోసం తరలించగా నారాయణగూడ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అప్పటికే నారాయణగూడ ఆసుపత్రి మూసివేయడంతో నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఉస్మానియా ఆసుపత్రికి పంపారు. బాలుడి ముఖానికి వైద్యులు 12 కుట్లు వేశారు. ఆంధ్రప్రదేశ్‌ అనంతపురం జిల్లా కదిరి మండలం వీరపల్లిపేటకు చెందిన జంపన సాయికుమార్‌, అలేఖ్య దంపతులు రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చారు. నెల రోజుల నుంచి లక్ష్మీనగర్‌ కాలనీలోని శ్రీనిధి నిలయం అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. అలేఖ్య వాచ్‌మెన్‌గా పని చేస్తుండగా, సాయికుమార్‌ తాగునీటి సరఫరా చేసే దినసరి కూలి. వీరికి ఆరు నెలల మరో బాబు ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని