logo

ఉమ్మడి జిల్లాలో రూ.650 కోట్లు

రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని ఈ నెల 28 నుంచి విడుదల చేయనున్నట్లు రాష్ట్రప్రభుత్వం బుధవారం ప్రకటించింది. తొలిరోజు ఎకరం వరకు భూమి గల రైతులకు నిధులను విడుదల చేసి ప్రతిరోజు ఎకరం చొప్పున పెంచుకుంటూ పోతారు

Published : 24 Jun 2022 04:25 IST

ఈ నెల 28 నుంచి రైతుబంధు నగదు బదిలీ

జగిత్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని ఈ నెల 28 నుంచి విడుదల చేయనున్నట్లు రాష్ట్రప్రభుత్వం బుధవారం ప్రకటించింది. తొలిరోజు ఎకరం వరకు భూమి గల రైతులకు నిధులను విడుదల చేసి ప్రతిరోజు ఎకరం చొప్పున పెంచుకుంటూ పోతారు. గత సీజన్లలో రికార్డుల్లో సాగుభూమిగా నమోదై ఉన్న మొత్తానికి నిధులను ఇవ్వగా ఈ సీజన్‌లో వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూమిని గుర్తించగా పథకం నుంచి మినహాయించే అవకాశముంది. ఇదే తరుణంలో భూ మార్పిడికి గడువు విధింపు, గత కొన్ని సీజన్ల మాదిరిగా భూ పరిమితి విధించకుండా అందరికీ పెట్టుబడి సాయం అందుతుందని అన్నదాతలు ఆశిస్తున్నారు. 2018లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించగా తొలుత ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇచ్చారు. ప్రస్తుతం ఎకరాకు రూ.5 వేల చొప్పున రెండు వానాకాలం, యాసంగిలకు నిధులను అందిస్తున్నారు. 2019 యాసంగిలో కేవలం 5 ఎకరాల వరకు భూమికలిగిన వారికే నిధులను ఇవ్వగా అంతకుముందు, ఆ తరువాతి సీజన్లలో ఎలాంటి భూపరిమితి విధించకుండా రైతులందరికీ నిధులిచ్చారు. ఈ వానాకాలంలోనూ ఎలాంటి పరిమితి విధించవద్దని కర్షకులు కోరుతున్నారు.

గడిచిన పంటకాలాల మాదిరిగా ఈ పంటకాలంలోనూ ప్రభుత్వం వద్ద వివరాలు సక్రమంగా ఉన్నవారికే నిధులందే అవకాశముంది. గత పంటకాలాల్లో ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 43 వేల మందికిపైగా రైతులకు రూ.10 కోట్లకుపైగా రైతుబంధు పథకం నిధులందలేదు. వ్యవసాయాధికారులకు పట్టాదారుల వివరాలు లభ్యం కాకపోవటం, కొందరు ఇతర ప్రాంతాల్లో ఉండటం, బ్యాంకు ఖాతాల నెంబర్లు తప్పుగా ఉండటం, బ్యాంకుల వివరాల్లేకపోవటం, రెవెన్యూ రికార్డులు సరిగా లేకపోవటం, నగదు ట్రాన్స్‌ఫర్‌ గాకపోవటం తదితర కారణాలతో గతంలో వీరికి నిధులందలేదు. నూతన రైతుల నమోదు, పాతవారి వివరాల్లోని పొరపాట్లను సరిదిద్దటం తదితరాలకు ప్రస్తుతం అవకాశం కల్పిస్తే లబ్ధిదారుల సంఖ్య పెరిగి రూ.650 కోట్ల నుంచి రూ.660 కోట్లవరకు పెట్టుబడిసాయం రైతులకు అందే అవకాశముంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని