logo

తరగతుల నిర్వహణకు వైద్య కళాశాల సిద్ధం

కరీంనగర్‌ జిల్లా ప్రజలకు శుభవార్త. ఇప్పటి వరకు చాలామంది ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వేలల్లో బిల్లు కట్టి ఇబ్బందిపడ్డారు. ఏదైన రోగంతో దవాఖానాలో చేర్పిస్తే రోజువారీ ఖర్చులకు బంధువుల గుండెల్లో వణుకు పుట్టేది.

Published : 18 Jun 2023 03:52 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సంక్షేమ విభాగం

హాజరు నమోదు చేస్తున్న సహాయ ఆచార్యులు

కరీంనగర్‌ జిల్లా ప్రజలకు శుభవార్త. ఇప్పటి వరకు చాలామంది ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వేలల్లో బిల్లు కట్టి ఇబ్బందిపడ్డారు. ఏదైన రోగంతో దవాఖానాలో చేర్పిస్తే రోజువారీ ఖర్చులకు బంధువుల గుండెల్లో వణుకు పుట్టేది. ఇప్పుడు కరీంనగర్‌ వైద్య కళాశాలకు అనుమతి రావడం, వైద్య బృందం నియామకమై సేవలందిస్తుండడంతో ఆ బాధలు తీరనున్నాయి. ఎలాంటి అత్యవసర వైద్య సేవలైనా ఈ బృందం అందించనుంది.

గతంలో నలభై మంది రోగులకు ఒక వైద్యుడు ఉంటే, రానున్న తరుణంలో 10 మందికి ఒక వైద్యుడు వచ్చే అవకాశముంది. డాక్టర్లపై ఒత్తిడి తగ్గి పేద రోగులకు మెరుగైన వైద్యం అందనుంది. ఈ ఏడాది వైద్య కళాశాలలో తరగతుల నిర్వహణకు జాతీయ వైద్య మండలి వంద సీట్లతో అనుమతి ఇచ్చిందని శనివారం వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఉన్నతాధికారులు, జిల్లాలోని ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

15 విభాగాల్లో 26 మంది సహాయ ఆచార్యుల నియామకం: కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రభుత్వం 15 విభాగాల్లో 26 మంది సహాయ ఆచార్యులను నియమించింది.  అనస్థిషియా, జనరల్‌ సర్జరీ, మెడిసిన్‌, పిడియాట్రిషన్‌, గైనిక్‌, బయో కెమిస్ట్రీ, అనాటమీ, పాథాలజీ, మైక్రో బయోలజీ, ఫల్మనాలాజీ, ఈఎన్‌టీ, సైకియాట్రిక్‌, ఫొరెన్సిక్‌, రేడియాలజీ, ఆర్థో విభాగాల్లో మొత్తం 26 మంది సహాయ ఆచార్యులను నియమించగా, ఇప్పటికే 25 మంది విధుల్లో చేరి రోగులకు సేవలందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతోపాటు వీరి సేవలు అందనున్నాయి. విద్యార్థుల కౌన్సెలింగ్‌ పూర్తయి తరగతులు ప్రారంభ సమయానికి వైద్య బృందం రానుంది. గతంలోనే ప్రిన్సిపల్‌ను నియమించగా ప్రస్తుతం పరిపాలన అధికారులను నియమించారు. వారు కూడా విధుల్లో చేరారు.

95 శాతం నిర్మాణం పూర్తి: వైద్య కళాశాల తరగతుల నిర్వహణకు కొత్తపల్లిలో రూ.7 కోట్లతో గదులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 95 శాతం తరగతి గదుల నిర్మాణం పూర్తయిందని, తరగతుల ప్రారంభానికి ముందే మొత్తం పనులు పూర్తి చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ అండ్‌ సర్జికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఈఈ రవీందర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని