logo

Lawyer Missing: కరీంనగర్‌లో న్యాయవాది అదృశ్యంపై ఉత్కంఠ

కరీంనగర్‌ జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది ద్యావనపల్లి వేణుగోపాల్‌రావు అదృశ్యంపై ఉత్కంఠ నెలకొంది.

Updated : 22 Sep 2023 07:59 IST

వేణుగోపాల్‌రావు

కరీంనగర్‌ న్యాయవార్తలు, కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది ద్యావనపల్లి వేణుగోపాల్‌రావు అదృశ్యంపై ఉత్కంఠ నెలకొంది. బుధవారం సాయంత్రం ఆయన ద్విచక్రవాహనం, చరవాణి అల్గునూర్‌ సమీపంలోని కాకతీయ కెనాల్‌ పక్కన ఉన్నాయి. కెనాల్‌ పక్క నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి బుధవారం సాయంత్రం సెల్‌ఫోన్‌ మోగుతుండటంతో లిఫ్ట్‌ చేసి అవతలి వారికి విషయం చెప్పాడు. కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించి ఎల్‌ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. అదే రోజు రాత్రి న్యాయవాది భార్య కరీంనగర్‌ రెండో ఠాణాలో భర్త వేణుగోపాల్‌రావు కనిపించడంలేదని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. చరవాణి స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్‌స్పెక్టర్‌ రాంచందర్‌రావు తెలిపారు. గురువారం ఉదయం కెనాల్‌ నీటిని తగ్గించి రెస్క్యూ టీమ్‌ ద్వారా వెతకడం ప్రారంభించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రఘునందన్‌రావు, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, అదనపు ప్రభుత్వ న్యాయవాది పూరెల్ల రాములు, న్యాయవాదులు బైక్‌ వదిలిన స్థలానికి చేరుకున్నారు. ముద్దసాని సంపత్‌, కొమ్ము రవిపటేల్‌, కృష్ణ ఆధ్వర్యంలో కొందరు న్యాయవాదులు కాలినడకన హుజూరాబాద్‌ వరకు కెనాల్‌ను పర్యవేక్షిస్తూ వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం తగ్గినా ఆచూకీ దొరకలేదు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని న్యాయవాదులు కోరుకుంటున్నారు. ఆయన అదృశ్యానికి గల కారణాలు తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని