logo

బాలింత మృతి.. ముగ్గురు వైద్యులపై కేసు

వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం జమ్మికుంటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి  వద్ద బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగగా ముగ్గురు వైద్యులపై కేసు నమోదైంది. బాధిత కుటుంబీకులు, ఎస్సై ఎస్‌.రాజేశ్‌ కథనం ప్రకారం..

Updated : 15 Feb 2024 07:28 IST

మానస

జమ్మికుంట, న్యూస్‌టుడే : వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం జమ్మికుంటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి  వద్ద బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగగా ముగ్గురు వైద్యులపై కేసు నమోదైంది. బాధిత కుటుంబీకులు, ఎస్సై ఎస్‌.రాజేశ్‌ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కనుకుల గ్రామానికి చెందిన మానస (24)ను రెండో ప్రసవానికి జమ్మికుంటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం సిజేరియన్‌ చేయగా మగ శిశువు జన్మించాడు. అనంతరం ఆమెకు బీపీ తగ్గిందని వైద్యులు చెప్పడంతో వరంగల్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిశీలించి ఆలస్యంగా తీసుకొచ్చారని, పరిస్థితి విషమించిందని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మంగళవారం అర్ధరాత్రి మానస మృతి చెందింది. మృతదేహాన్ని జమ్మికుంట ప్రైవేట్‌ ఆసుపత్రి వద్దకు తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. హుజూరాబాద్‌ గ్రామీణ సీఐ సంతోష్‌, జమ్మికుంట గ్రామీణ సీఐ కిషోర్‌, జమ్మికుంట, వీణవంక ఎస్సైలు రాజేశ్‌, వంశీకృష్ణ ఆసుపత్రి వద్దకు చేరుకొని బాధితులకు సర్ది చెప్పారు. ఆసుపత్రి వైద్యులు రాణి, రాము, అనస్తీషియా వైద్యుడు సుధాకర్‌రావు నిర్లక్ష్యం, సిజేరియన్‌ వికటించటమే తన భార్య మానస మృతికి కారణమని ఆమె భర్త శ్రీకాంత్‌ చేసిన ఫిర్యాదుతో ముగ్గురు వైద్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. మానసకు సిజేరియన్‌ అనంతరం గుండె సంబంధిత సమస్యలు వచ్చాయని, దీంతో బీపీ తగ్గిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తమ నిర్లక్ష్యమేమీ లేదన్నారు. వరంగల్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకొని అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందితే ఇక్కడికి వచ్చి ఆందోళన చేశారని, డబ్బులు డిమాండ్‌ చేశారని వైద్యులు రాము, శ్రీనివాస్‌లు బుధవారం ఫిర్యాదు చేశారని ఎస్సై రాజేశ్‌ తెలిపారు. విచారణ చేస్తున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని