logo

రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు

గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది.

Published : 19 Apr 2024 04:39 IST

ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు

రుద్రంగి మండల కేంద్రంలో నిర్మించిన రహదారి

న్యూస్‌టుడే, వేములవాడ గ్రామీణం: గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. అయితే అధికారులు మిగులు పనులపై దృష్టిసారించడం లేదు. పైగా రహదారి నిర్మాణ సమయంలో ఏర్పడిన సమస్యను పట్టించుకోకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

వేములవాడ- కోరుట్ల ప్రధాన రహదారిలోని రుద్రంగి మండల కేంద్రంలో రహదారి అస్తవ్యస్తంగా ఉండేది. గుంతల రహదారి వల్ల వాహనదారులు, స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్లు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురైన సంఘటనలున్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వం రూ. 12.8 కోట్లు మంజూరు చేయడంతో పక్కా రహదారి నిర్మించారు. దీంతో రవాణా సౌకర్యం మెరుగుపడి సమస్య తీరింది. అయితే మిగులు పనులపై అధికారులు దృష్టిసారించడం లేదు. రహదారిని ఎత్తుగా నిర్మించడం వల్ల పలువురి ఇళ్లు, దుకాణాలు పూర్తిగా కిందకు అయ్యాయి. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా మురుగు కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో వర్షపు నీరు ఇళ్లు, దుకాణాల్లోకి వస్తుంది. రహదారి వెంబడి పక్కన ఉన్న కాలనీల్లోకి వెళ్లేందుకు అప్రోచ్‌ రోడ్లను ఎత్తుగా నిర్మించి తారు వేయకపోవడంతో అది కోతకు గురై ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. డివైడర్‌ మధ్యలో సెంట్రల్‌ లైటింగ్‌ ఉన్నప్పటికీ దీపాలు వెలగడం లేదు. పచ్చదనం కోసం, రాత్రి సమయంలో ఎదురెదురుగా వస్తున్న వాహనాల లైట్లు ఒకదానిపై మరొకటి పడకుండా ఉండేందుకు డివైడర్‌ మధ్యలో మొక్కలు నాటాల్సి ఉండగా ఆ పనులు కూడా చేపట్టలేదు.

దుకాణాల్లో చేరిన వర్షపు నీరు (పాతచిత్రం)


ఇళ్లలోకి నీరు
- పిల్లమారపు ప్రవీణ్‌, స్థానికుడు

రహదారి నిర్మాణం ఎత్తుగా చేపట్టారు. నిర్మాణ సమయంలో మా అభ్యంతరాలను పట్టించుకోలేదు. రహదారి ఎత్తుగా ఉండటం వల్ల ఇళ్లు, పలువురి దుకాణాలు కిందకు అయ్యాయి. వర్షాకాలంలో వరద లోపలికి చేరుతుంది. సమస్య పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి.


ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి
- మంగ శేఖర్‌, స్థానికుడు

వీధిలో నుంచి ప్రధాన రోడ్డుపైకి వెళ్లే సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారి ఎత్తుగా ఉండటం, అప్రోచ్‌ రోడ్డుపైన తారు వేయకపోవడం వల్ల ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి పలువురు కిందపడుతున్నారు. డివైడర్‌ మధ్యలో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయడంతోపాటు మొక్కలు నాటాలి.  


పరిశీలించి పరిష్కరిస్తాం
- సతీశ్‌, ఏఈ, ఆర్‌అండ్‌బీ

నిబంధనల మేరకు రహదారి నిర్మాణం చేపట్టాం. స్థానికుల సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. మురుగు కాలువల నిర్మాణం, డివైడర్‌ మధ్యలో మొక్కలు నాటడం, సెంట్రల్‌ లైటింగ్‌ పునరుద్ధరణ త్వరగా పూర్తయ్యే విధంగా చూస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని