logo

వారసత్వ సంపద పరిరక్షణకు ఓటేద్దాం

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు. శాతవాహనులు, కాకతీయులు, నిజాముల కాలంలో నిర్మించిన కోటలు, మెట్ల బావులు, ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి.

Updated : 20 Apr 2024 06:15 IST

‘దేఖో అప్నా దేశ్‌ పీపుల్‌ ఛాయిస్‌-2024లో భాగస్వాములమవుదాం

ఎలగందుల ఖిల్లా

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు. శాతవాహనులు, కాకతీయులు, నిజాముల కాలంలో నిర్మించిన కోటలు, మెట్ల బావులు, ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న స్వామి క్షేత్రం.. కొండగట్టు అంజన్న ఆలయం, గోదావరి ఒడ్డున గల ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, కోటిలింగాల శివాలయం, పెద్దపల్లిలో రామగిరి ఖిల్లా, కరీంనగర్‌లో ఎలగందుల కోటా తదితర కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి ఏళ్ల తరబడి సరైన వసతులు లేక అభివృద్ధికి నోచుకోవట్లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడి కోటలు, అద్భుత శిలా సంపద మరుగున పడుతున్నాయి. అయితే వాటి పరిరక్షణకు, వసతుల మెరుగుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. దీని కోసం  https///innovateindia.mygov.in./dekhoapna-desh/ అనే వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. దీనిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

ఆన్‌లైన్‌లోనే...

మరుగున పడ్డ పర్యాటక ప్రాంతాలను గుర్తించేందుకు వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌ ఓటింగ్‌లో పాల్గొనాలి. సైట్‌లోకి వెళ్లాక ‘ఓట్‌ నౌ’ పై క్లిక్‌ చేసి పేరు, చిరునామా, ఇతర వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. తర్వాత విభాగాల వారిగా ఓటేయాల్సిన ప్రాంతాలను ఎంపిక చేసుకుని.. అక్కడ కల్పించాల్సిన వసతులను గుర్తించాలి. రవాణా, పారిశుద్ధ్యం తదితర వసతులు ఇందులో ఉంటాయి. ఉదాహరణకు ఎలగందుల కోట ఎంపిక చేస్తే అక్కడ ఎలాంటి వసతులు కావాలో సైట్‌లో పొందుపర్చవచ్చు. ఇలా ఏదైనా జనాదరణ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసుకోవచ్చు.

ఇవీ మన ప్రాంతాలు...

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజలు పురాతన కట్టడాల కింద ఎలగందుల, ధూళికట్ట కోటలు.. దేవాదాయ శాఖ పరిధిలో కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, కోటి లింగాల, ఇల్లందకుంట రామాలయం, కొత్తగట్టు మత్య్సగిరీంద్రస్వామి, ధర్మపురి నృసింహాస్వామి ఆలయాలకు, బిజగిరిషరీఫ్‌ దర్గా, గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం, రామగిరి ఖిల్లా, మానేరు జలాశయాలు తదితర ప్రాంతాలకు ఓటు వేయొచ్చు. వైల్డ్‌లైఫ్‌ కింద జగిత్యాల జిల్లా రాయికల్‌, సారంగపూర్‌ అడవులు లాంటి ప్రదేశాలను ఎంపిక చేసి అక్కడ లేని వసతులను ఆన్‌లైన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. ఓటేసిన వారు ప్రశంసాపత్రం కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

అయిదు విభాగాల్లో ...

దేశంలో అనేక రకాల పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వీటిని బాగు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గత మార్చిలో జమ్మూకశ్మీర్‌లో పర్యటించినప్పుడు ‘దేఖో అప్నా దేశ్‌ పీపుల్‌ ఛాయిస్‌-2024 పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో అయిదు విభాగాలుంటాయి. ఆధ్యాత్మిక, వారసత్వ, ప్రకృతి, అడవులు, సాహసోపేత ప్రాంతాలుగా విభజించారు.

30 వరకు అవకాశం

ఈ నెల 30 వరకే ఓటేసే అవకాశం ఉంది. అనంతరం వాటిని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి ప్రజల కోరిక మేరకు వసతులు మెరుగుకు చర్యలు తీసుకుంటుంది. వేములవాడ, కొండగట్టుల్లోని ఆలయాల్లో భక్తుల కోసం హరిత హోటళ్లు, గదులు పెంచే అవకాశం ఉంటుంది. ఎలగందుల కోటను మరింతా ఆకర్షణీయంగా తీర్చిదిద్దవచ్చు.

ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వారసత్వ ప్రాంతాలతో పాటు జింకల పార్కు, మానేరు డ్యాం ప్రాంతాల్లో సౌకర్యాల మెరుగుకు ఓటేశా. ఓటింగ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొంటే మన పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.

ఘన్‌శ్యాం ఓజా, సామాజిక కార్యకర్త, కరీంనగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని