logo

ఆస్తుల పరిరక్షణ.. చోరీల నియంత్రణ

సింగరేణి ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించామని.. చోరీల నియంత్రణకు నిరంతరం అధికారులతో చర్చిస్తున్నామని సింగరేణి ముఖ్య భద్రతాధికారి దీక్షితులు అన్నారు.

Updated : 28 Apr 2024 05:39 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని : సింగరేణి ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించామని.. చోరీల నియంత్రణకు నిరంతరం అధికారులతో చర్చిస్తున్నామని సింగరేణి ముఖ్య భద్రతాధికారి దీక్షితులు అన్నారు. భారీ యంత్రాలకు సంబంధించి విడిభాగాలు చోరీకి గురికాకుండా ప్రత్యేక కమిటీలు వేసినట్లు తెలిపారు. ఆయా నివేదికల ఆధారంగా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ‘న్యూస్‌టుడే’ నిర్వహించిన ముఖాముఖిలో పలు అంశాలను వివరించారు.

ప్రశ్న: సింగరేణిలో లక్షల రూపాయల విలువ చేసే యంత్రాల విడిభాగాలున్నాయి. వీటి పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

సమాధానం: సంస్థలో కేబుల్‌ చోరీలపై దృష్టి సారించాం. ఇటీవలి కాలంలో ఎక్కువగా అవే చోరీలు జరుగుతున్నాయి. దీనిపై ప్రత్యేకంగా కమిటీ వేశాం. ఆయా నివేదికల ఆధారంగా నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి వారంలో రెండు సార్లు డివిజన్ల వారిగా భద్రతాధికారులతో సమీక్షిస్తున్నాం. అయా అంశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. దీనివల్ల చోరీల నియంత్రణ మెరుగ్గా ఉంటుంది.

ప్ర: తుక్కుగా మారిన భారీ యంత్రాల విడిభాగాలు మాయమవుతున్నాయి. వాటిని ఏ విధంగా కాపాడతారు?

స: భారీ యంత్రాల విడిభాగాల పరిరక్షణకు డైరెక్టర్‌(పా) ప్రత్యేకంగా కమిటీ వేశారు. స్టోర్స్‌ జీఎంతో పాటు భద్రతా జీఎంలతో కలిసి కమిటీ నియమించారు. దీనిపై పర్యవేక్షణ చేసి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికలు తయారు చేశాం. త్వరలోనే నివేదికలను డైరెక్టర్‌(పా)కు అప్పగిస్తాం. దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయలపై నిర్ణయం తీసుకుంటారు.

ప్ర: గతంలో డీజిల్‌ చోరీ ఘటనలు అధికంగా జరిగాయి. ప్రస్తుతం నిఘా ఎలా?

స: కంపెనీలోని ప్రతి బంక్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. కంపెనీ యంత్రాలకు జీపీఎస్‌ విధానం అమలు చేశాం. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో నిఘా విభాగాలను విస్తృతం చేశాం. చెక్‌పోస్టుల వద్ద భద్రతను పెంచాం. డీజిల్‌ నింపే సమయంలో సంబంధిత అధికారి కీ తెరిస్తేనే ఇంధనాన్ని నింపుతారు.

ప్ర: బొగ్గును కొందరు ఇటుక బట్టీలకు అక్రమంగా తరలిస్తున్నారు? నియంత్రణ?

స: బొగ్గు రవాణా చేసే వాహనాలకు జీపీఎస్‌ ఏర్పాటు చేశాం. కొన్ని ఏరియాల్లో పూర్తిస్థాయిలో జీపీఎస్‌ ఉండగా ఇంకా కొన్ని ఏరియాల్లో ఈ విధానాన్ని అమలు చేయాల్సి ఉంది. బొగ్గు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఇటుక బట్టీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇటుక బట్టీల వద్ద నిల్వ ఉన్న బొగ్గు, వినియోగిస్తున్న బొగ్గుకు సంబంధించి బిల్లులు ఉండాలి. లేదంటే అక్కడున్న బొగ్గును స్వాధీనం చేసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని