logo

ధాన్యం తూకాల్లో వేగం ఏదీ?

జిల్లాలో వరి కోతలు 80 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెల 15 నాటికి కోతలు ముగుస్తాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

Published : 29 Apr 2024 02:24 IST

ఇప్పటివరకు కొన్నది 69 వేల మెట్రిక్‌ టన్నులే

ఎల్లారెడ్డిపేటలో తూకం వేస్తున్న హమాలీలు

న్యూస్‌టుడే, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల గ్రామీణం: జిల్లాలో వరి కోతలు 80 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెల 15 నాటికి కోతలు ముగుస్తాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మేలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అంచనా వేశారు. వారి ప్రణాళిక ప్రకారంగానే ఏప్రిల్‌ చివరి వారం నుంచి కేంద్రాలకు పోటెత్తుతున్నాయి. మేలో మరింత ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయి. జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 3 - 3.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓవైపు అకాల వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తుంది. తరచూ ఆకాశంలో కమ్ముకుంటున్న మేఘాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ వర్షాలు పడతాయోనని భయాందోళనకు గురవుతున్నారు. తూకాలను వేగవంతం చేస్తే నష్టం వాటిల్లదని రైతులు భావిస్తున్నారు. కొనుగోళ్లపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

జిల్లాలో యాసంగి సీజన్‌లో 1,74,750 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. పంట సాగు విస్తీర్ణాన్ని బట్టి 4.36 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు లెక్కకట్టారు. ‘ఏ’ గ్రేడు రకానికి రూ. 2,203, సాధారణ రకం ధాన్యానికి రూ. 2,183 ప్రభుత్వం మద్దతు ధరగా నిర్ణయించింది. ధాన్యం సేకరించేందుకు 44 ఐకేపీ, 202 పీఏసీఎస్‌, 9 డీసీఎంఎస్‌, 4 మెప్నా మొత్తం 259 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలోని 244 కొనుగోలు కేంద్రాల్లో తూకాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27 నాటికి 10,076 మంది రైతుల వద్ద ఐకేపీ ద్వారా 12,991.600 మెట్రిక్‌ టన్నులు, పీఏసీఎస్‌ల ద్వారా 53,071.660, డీసీఎంఎస్‌ల నుంచి 1,516.760, మెప్నా ద్వారా 1,589.460 మెట్రిక్‌ టన్నులు కలుపుకొని మొత్తం 69,169.480 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 64,731.240 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి, మిల్లులకు చేర్చేందుకు 4,438.240 మెట్రిక్‌ టన్నుల ధాన్యం బస్తాలు సిద్ధంగా ఉన్నాయి. 6,564 మంది రైతులు విక్రయించిన రూ. 90.40 కోట్ల విలువైన 41,034.200 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇందులో 4,189 మంది రైతులకు చెందిన 24,795 మెట్రిక్‌ టన్నులకు డబ్బులు రూ. 54.62 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్ణీత తేమశాతం ఉన్న ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. తూకాలు, ఆన్‌లైన్‌ ఎంట్రీలో కొంత ఆలస్యమవుతున్నట్లు కర్షకులు చెబుతున్నారు. అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తూకాల్లో జాప్యం లేకుండా చూడాలని, ఆన్‌లైన్‌ నమోదును త్వరితగతిన పూర్తిచేయాలని నిర్వాహకులకు సూచిస్తున్నారు.

ఆన్‌లైన్‌ నమోదులో ఆలస్యం

రైతులు వరిని కోసిన వెంటనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. కేంద్రాల్లో నిర్ణీత తేమశాతం వచ్చే వరకు కవర్లలో ఆరబెడుతున్నారు. అయితే తూకాల్లో జాప్యం చోటుచేసుకోవడంతో రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. ఓవైపు తూకం వేసిన బస్తాలను మిల్లులకు చేర్చడం, ధాన్యం రాశులను తూకం వేయడం, ఈ రెండు పనులు ఏకకాలంలో సాధ్యం కావడం లేదు. లారీలు రాగానే హమాలీలు తూకాలు నిలిపివేసి, బస్తాలను లోడ్‌ చేస్తున్నారు. మిల్లుల్లో బస్తాలు దింపగానే ట్రక్‌షీట్‌తో రైతుల వివరాలను నిర్వాహకులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ నమోదులో ఆలస్యం చోటుచేసుకొంటుందని అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పటికైనా కేంద్రాల నిర్వాహకులు ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, సకాలంలో డబ్బులు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

చర్యలు తీసుకొంటున్నాం

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత వేగంగా కొనుగోళ్లు చేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నాం. నాణ్యత ప్రమాణాల ప్రకారం రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి.

జితేందర్‌రెడ్డి, డీఎస్‌వో, సిరిసిల్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని