logo

పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యం

కేంద్రంలో కొనసాగిన పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు.

Published : 29 Apr 2024 02:26 IST

మంత్రి పొన్నం

అభివాదం చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ అభ్యర్థి రాజేందర్‌రావు

కరీంనగర్‌ కొత్తపల్లి, కరీంనగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కేంద్రంలో కొనసాగిన పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. ఆదివారం కొత్తపల్లి మండలంలోని బావుపేట గ్రామంలో, కొత్తపల్లిలో నిర్వహించిన కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చేతులెత్తేశారన్నారు. నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పి కనీసం ఒక్కరి ఖాతాలో అయినా వేశారా? అని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదని, పెన్షన్‌ ఇవ్వలేదని, తెలంగాణ విభజన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. పదేళ్లలో ఏ ఒక్క హామీ అమలు చేయకుండా భాజపా నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని కరీంనగర్‌ భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించడమే కాకుండా ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఎన్ని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ.. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపాకో హఠావో... దేశ్‌కో బచావో మన అందరిని నినాదం కావాలన్నారు. తనను గెలిపిస్తే బావుపేటను మండలం చేస్తానని, సొంత నిధులతో ఎస్సీ కాలనీలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌, ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్‌ గ్రామీణ మండలం చామనపల్లిలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసినప్పుడు భార్య మంగళసూత్రాన్ని అమ్మి నామినేషన్‌ రుసుం చెల్లించానని చెప్పుకొన్న భాజపా అభ్యర్థి బండి సంజయ్‌కి వందల కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు కోడూరి సత్యనారాయణగౌడ్‌, నేతలు రోహిత్‌రావు, పులి ఆంజనేయులుగౌడ్‌, భాస్కర్‌రెడ్డి, పద్మాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని