logo

ఓట్లు అడిగే హక్కు వినోద్‌కే ఉంది

కరీంనగర్‌లో అభివృద్ధి చేసిన వినోద్‌కుమార్‌కే ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందని.. ఇతర పార్టీల అభ్యర్థులకు లేదని భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు.

Published : 29 Apr 2024 02:28 IST

కేటీఆర్‌

చొప్పదండి రోడ్‌షోలో మాట్లాడుతున్న కేటీఆర్‌, చిత్రంలో అభ్యర్థి వినోద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌, హాజరైన జనం

కరీంనగర్‌ (ఈనాడు), తిమ్మాపూర్‌, చొప్పదండి (న్యూస్‌టుడే) : కరీంనగర్‌లో అభివృద్ధి చేసిన వినోద్‌కుమార్‌కే ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందని.. ఇతర పార్టీల అభ్యర్థులకు లేదని భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌, అల్గునూర్‌లలో నిర్వహించిన బూత్‌ కమిటీ స్థాయి నాయకుల సమావేశంలో, చొప్పదండిలో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. మోదీ- రేవంత్‌రెడ్డిలు ఒక్కటేనని.. జూన్‌ 4 తరవాత రేవంత్‌రెడ్డి భాజపాలో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజా సమస్యలపై గళం విప్పాలంటే గులాబీ జెండా పార్లమెంటులో కనిపించాలన్నారు. కరీంనగర్‌లో భారాస నాయకులు, కార్యకర్తలను పోలీసులు కేసుల రూపంలో ఇబ్బంది పెడుతున్నారని తన దృష్టికి వచ్చిందని.. ఈ ఇబ్బందులు పోవాలంటే పక్కాగా మళ్లీ రాష్ట్రంలో 10-12 ఎంపీ స్థానాలు గెలవాలన్నారు. ప్రజాశక్తిని కూడగట్టుకునే విధంగా పని చేస్తే ఏడాది లోపల కేసీఆర్‌ రాష్ట్రాన్ని శాసిస్తారని అన్నారు. ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న ఏసీపీ, డీసీపీలు అప్పుడు మన పక్కన నిలబడతారని, ఇది జరగాలంటే ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతును ఓట్ల రూపంలో కూడగట్టాలన్నారు. భాజపాతో స్నేహం లేదని ఒకవేళ ఉంటే.. మన ఆడపడుచును జైల్లో పెట్టే పరిస్థితి వచ్చేదా? అని ప్రశ్నించారు. కారు ఓవర్‌ లోడు కావడంతో ఒకరిపై ఒకరికి ఈర్ష్ష్య పెరిగిందని.. వ్యక్తిగత అహం వీడి అభ్యర్థి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు.  కాంగ్రెస్‌ నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.  భాజపా అభ్యర్థి బండి సంజయ్‌కు జై శ్రీరామ్‌ అనడం తప్ప ఏం తెలియదని విమర్శించారు. ఆయన కరీంనగర్‌కు చేసింది శూన్యమన్నారు. ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ పార్టీ గురించి నాలుగున్నర నెలల్లోనే జనాలకు అర్థమైందని అన్నారు. లోక్‌సభలో బండి సంజయ్‌ తెలంగాణ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. దేశంలో జడ్పీ సమావేశానికి హాజరు కాని ఏకైక వ్యక్తి బండి సంజయ్‌ మాత్రమేనని విమర్శించారు.  కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయ, మేయర్‌ సునీల్‌రావు, టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, భారాస జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని