logo

ఉపాధి పని... ఉదయపు నడక

లోక్‌సభ ఎన్నికల ప్రచార సరళి మారింది. ఎండలు మండుతుండటంతో ఇంటింటికీ తిరగడానికి నాయకులు జంకుతున్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉండే ప్రాంతాలకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Published : 29 Apr 2024 02:29 IST

సమూహ ప్రాంతాల్లో ఓట్ల అభ్యర్థన
మండే ఎండల్లో మారిన ప్రచార సరళి
న్యూస్‌టుడే, గోదావరిఖని

సారంగాపూర్‌ మండలం లక్ష్మీదేవిపల్లిలో ఉపాధిహామీ కూలీలతో మాట్లాడుతున్న నిజామాబాద్‌ ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల ప్రచార సరళి మారింది. ఎండలు మండుతుండటంతో ఇంటింటికీ తిరగడానికి నాయకులు జంకుతున్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉండే ప్రాంతాలకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గంపగుత్తగా ఓట్లు పడే అవకాశముండే చోటుకు వెళ్తూ మద్దతు కూడగడుతున్నారు.

ప్రస్తుతం ప్రతి గ్రామంలో ఉపాధిహామీ పథకం పనులు నిర్వహిస్తున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఉదయం 9 గంటలలోపే కూలీలంతా పనులకు వెళ్తున్నారు. చెరువులు, కాలువల్లో పూడికతీత, కాంటూరు కందకాల తవ్వకం తదితర మట్టి పనులు చేపడుతున్నారు. ఒక్కో ఊరిలో 100 నుంచి 500 మంది ఒకే చోట ఉంటూ పనులు నిర్వహిస్తున్నారు. దీంతో నాయకులు ఉపాధిహామీ పనులు జరుగుతున్న ప్రాంతాలనే ప్రచార అడ్డాలుగా మార్చుకున్నారు.

పని ప్రాంతాలే అడ్డాలు

కరీంనగర్‌, పెద్దపల్లి, నిజమాబాద్‌ లోక్‌సభ స్థానాల పరిధిలో ఉమ్మడి జిల్లాలో 9.42 లక్షల మంది ఉపాధిహామీ కూలీలున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో దాదాపు జాబ్‌కార్డున్న ప్రతి ఇంటి నుంచీ పనికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక్క కూలీని ప్రభావితం చేసినా ఆ కుటుంబంలోని మూడు ఓట్లు వచ్చే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీల నాయకులు, అభ్యర్థులు ఉపాధిహామీ పనులపై దృష్టి సారించారు. కరీంనగర్‌ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ సతీమణి డా.మాధవి కొద్ది రోజులుగా గ్రామాల్లో తిరుగుతూ ఉపాధిహామీ కూలీలను కలుస్తున్నారు. నిజమాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఇటీవల సారంగాపూర్‌ మండలం లక్ష్మీదేవిపల్లిలో కూలీలను కలిసి ఓట్లడిగారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు పల్లెల్లో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. భారాస నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉపాధిహామీ పని ప్రాంతాలే అడ్డాలుగా ప్రచారం చేస్తున్నారు.

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కశాశాల మైదానంలో వాకర్స్‌తో మాట్లాడుతున్న కరీంనగర్‌ ఎంపీ భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌

హామీల  కేంద్రాలు

ప్రస్తుతం యాసంగి ధాన్యం చేతికొస్తుండగా ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎక్కువ మంది రైతులు, వారి కుటుంబాలు కేంద్రాలను ప్రచారానికి వినియోగించుకుంటున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దకు వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ధాన్యం తూకంలో అవకతవకలు జరుగుతున్నా, తరుగు సమస్యలున్నా వెంటనే అధికారులతో మాట్లాడుతూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మైదానాలకు వరుస

పల్లెల్లో ఉపాధిహామీ పని ప్రాంతాలకు వెళ్తున్న నాయకులు, పట్టణాల్లో విశాల ప్రాంతాలు, మైదానాల బాట పడుతున్నారు. వాకర్స్‌తో కలిసి నడుస్తూ ప్రచారం చేస్తున్నారు. ఉదయం వాతావరణం చల్లగా ఉండటంతో పాటు ఎక్కువ మంది ఒకచోట దొరుకుతుండటంతో అభ్యర్థులు ఆ సమయాన్నే ఎంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలా మంది ఉదయపు నడకకు వెళ్తున్నారు. దీంతో పట్టణ కేంద్రాల్లోని మైదానాలకు నాయకులు క్యూ కడుతున్నారు. కరీంనగర్‌, గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కోరుట్ల, హుజూరాబాద్‌, వేములవాడ, సుల్తానాబాద్‌ పట్టణాల్లో ఉదయం నడకకు వచ్చే వారిని ఎక్కువ మంది నాయకులు కలుస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు స్వయంగా వచ్చి వాకర్స్‌ను కలిసి ఓటు అభ్యర్థిస్తున్నారు.

కరీంనగర్‌ ఎస్సారార్‌ కళాశాల మైదానంలో వాకర్స్‌తో కలిసి క్రికెట్‌ ఆడుతున్న భాజపా అభ్యర్థి బండి సంజయ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని