logo

44 రోజులు.. రూ.9.71 కోట్లు

లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.

Updated : 29 Apr 2024 06:16 IST

తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నగదు

నగదును చూపిస్తున్న కరీంనగర్‌ పోలీసులు

  • మార్చి 16న కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేసి ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న రూ.6.67 కోట్ల నగదును పట్టుకున్నారు. పట్టుబడిన నగదును ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు.
  • ఏప్రిల్‌ 20న కరీంనగర్‌ పట్టణంలో రూ.88 లక్షల నగదును కొంత మంది ఎలాంటి పత్రాలు లేకుండా ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు. పట్టుబడిన నగదును సీజ్‌ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.

న్యూస్‌టుడే, కరీంనగర్‌ నేరవార్తలు: లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 28వ తేదీ వరకు 44 రోజుల్లో రూ.9.71 కోట్ల నగదును పట్టుకున్నారు.

  • జగిత్యాల జిల్లాలో అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.90 లక్షల విలువ గల 1.506 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ.3.96 లక్షల విలువైన 15.81 కిలోల గంజాయిని పట్టుకున్నారు. రూ.33,765 విలువ గల మద్యం సీజ్‌ చేశారు.
  • కరీంనగర్‌ జిల్లాలో 1140.205 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. రూ.52 వేల విలువ గల 2.50 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.40 వేల విలువ గల గంజాయిని పట్టుకున్నారు. అదేవిధంగా రూ.7.63 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.
  • పెద్దపల్లి జిల్లాలో రూ.38 వేల విలువగల గంజాయి పట్టుకుని, 574 లీటర్ల మద్యం సీజ్‌ చేశారు.

ఇంకా 15 రోజులే..

లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 15 రోజులే మిగిలి ఉంది. పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి భిన్న మార్గాలు అవలంబిస్తుంటాయి.. ప్రలోభాలపైనా దృష్టి పెడతాయి. ఈ క్రమంలో అధికారులు కూడా తనిఖీలు విస్తృతం చేస్తారు. ఈ సమయంలో సామాన్యులు జాగ్రత్తగా ఉండకపోతే తమ డబ్బు కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సరైన పత్రాలు లేకుండా నగదు, ఇతర సామగ్రి తరలించవద్దని పోలీసుశాఖ, ఎన్నికల పర్యవేక్షణ అధికారులు ఎప్పటికప్పుడు చెబుతున్నా వాటిని లెక్క చేయకుండా కొంత మంది నగదు, ఇతర వస్తువులు తరలిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు.

వెనక్కి తీసుకుంది రూ.71 లక్షలు

ఉమ్మడి జిల్లాలో రూ.9.71 కోట్లు ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుబడగా ఆధారాలు చూపి రూ.71 లక్షలు మాత్రం వెనక్కి తీసుకున్నారు. తనిఖీల సమయంలో పత్రాల ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు పట్టుకున్న రూ.9.71 కోట్లను త్రీమెన్‌ కమిటీకి అప్పగించారు. బాధితులు తరువాత కమిటీకి సరైన పత్రాలు చూపడంతో రూ.71 లక్షలు వెనక్కి ఇచ్చేశారు. సరైన పత్రాలను చూపిస్తే నగదు విడుదల చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సరైన ఆధారాలతో నగదు, బంగారం తరలిస్తే ఇబ్బందులుండవని సూచిస్తున్నారు.

స్వాధీనం చేసుకున్న నగదు (రూ.లలో)

జగిత్యాల : 14,64,410
సిరిసిల్ల : 74,37,300
కరీంనగర్‌: 7,96,55,850
పెద్దపల్లి : 86,04,302

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని