logo

చైతన్య ఫలితం.. శాంతియుతం

ఒకప్పుడు ఎన్నికలంటేనే గ్రామాల్లో పగలు, ప్రతీకారాలు కనిపించేవి. నిత్యం గొడవలతో ఘర్షణ వాతావరణం నెలకొనేది.

Updated : 30 Apr 2024 06:11 IST

తగ్గుతున్న సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

ఒకప్పుడు ఎన్నికలంటేనే గ్రామాల్లో పగలు, ప్రతీకారాలు కనిపించేవి. నిత్యం గొడవలతో ఘర్షణ వాతావరణం నెలకొనేది. ఆవేశాలు, కక్షలతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం వెంటాడేది. ఇలాంటి సమయంలో చాలా మంది ‘మనకెందుకీ గొడవ’ అనుకుంటూ ఓటుకు దూరంగా ఉండే పరిస్థితి. కాగా కొన్నేళ్లుగా పల్లెల్లో శాంతియుత వాతావరణం నెలకొనడానికి అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి దోహదపడుతున్నాయి. ఫలితంగా ఏటికేడు సమస్యాత్మక ప్రాంతాలు తగ్గుతున్నాయి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా క్షేత్ర స్థాయిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.  

ఎలా గుర్తిస్తారంటే..

ఎన్నికల సమయంలో అల్లర్లు, గొడవలు జరిగే ప్రాంతాలను సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల జాబితాలో చేరుస్తారు. హింసాత్మక ఘటనలు, అల్లరిమూకల ప్రభావం, ఘర్షణలు, ఇరువర్గాల పరస్పర దాడులు, కేసులు పెట్టుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటే సమస్యాత్మకమైనవిగా గుర్తిస్తారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ కేంద్రాలపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. అదనపు సిబ్బందితో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారు. చిన్నపాటి గొడవ కూడా లేకుండా పోలింగ్‌ ముగిసే వరకు నిఘా తీవ్రతరం చేస్తారు.

మంథని నియోజకవర్గంలో అవగాహన కల్పిస్తున్న పోలీసులు

ఫలిస్తున్న ప్రచారం

ఉమ్మడి జిల్లాలోని మంథని, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో పలు ప్రాంతాల్లో తీవ్రవాద ప్రాబల్యం ఉండేది. ఎన్నికల సమయంలో అక్కడి గ్రామాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునేవి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రౌడీషీటర్లు పేట్రేగిపోయేవారు. ప్రజాస్వామ్యంలో ‘ఓటు’ ఆయుధంతో భవిత మారుతుందంటూ అధికారులు చేస్తున్న ప్రచారం ఫలిస్తోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,654 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 2019 ఎన్నికల్లో 659 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించగా ప్రస్తుతం 475 ఉన్నాయి.

సమన్వయంతో ముందుకు..

  • ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్తున్నారు.
  • సుమారు 30 ఏళ్ల కిందటి వరకు మావోయిస్టుల కదలికలు అధికంగా ఉండేవి. మారుమూల గ్రామాలకు రవాణా వ్యవస్థ అంతంతమాత్రంగా ఉండటం కూడా ఇందుకు కారణం.
  • గతంతో పోలిస్తే అక్షరాస్యత పెరగడంతో చదువుకున్న యువత ఓటు హక్కు వినియోగంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పోలింగ్‌ శాతం పెరుగుతోంది.
  • గొడవలు లేకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఊరూరా చైతన్యం కల్పిస్తున్నారు. కోడ్‌ ఉల్లంఘిస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
  • రౌడీషీటర్లు, మాజీ మావోయిస్టులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి గొడవలకు తావు లేకుండా ముందస్తుగా బైండోవర్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని