logo

భూసారం.. పరీక్షలతో ఫలం

రైతులందరి భూముల్లోని సారాన్ని తెలుసుకునేలా మట్టిపరీక్షలను తప్పనిసరి చేస్తామని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు రేకెత్తాయి.

Published : 16 May 2024 04:29 IST

సిఫార్సుకన్నా 16-50 శాతం అధికంగా ఎరువుల వినియోగం

మినీ భూసార పరికరాలు

న్యూస్‌టుడే, జగిత్యాల వ్యవసాయం: రైతులందరి భూముల్లోని సారాన్ని తెలుసుకునేలా మట్టిపరీక్షలను తప్పనిసరి చేస్తామని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు రేకెత్తాయి. సాధారణంగా 2.5 ఎకరాలకొక నమూనాను తీసి విశ్లేషిస్తేనే కచ్చితమైన ఫలితాలు వస్తాయి. కానీ తక్కువ విస్తీర్ణంలో నమూనాలు తీయటం, ఫలితాలను ఆలస్యంగా ఇవ్వటంతో చాలామంది రైతులు ఆచరించటంలేదు. భూసార పరీక్షల్లేక, ఫలితాలు పొందినవారు కూడా రసాయన ఎరువుల మోతాదును విస్మరించటంతో సిఫార్సుకన్నా 16-50 శాతం వరకు అధికంగా ఎరువులు వాడుతున్నారు. 2.5 ఎకరాలకొక మట్టినమూనాను విశ్లేషించాలన్న ప్రభుత్వం అంచనా ప్రకారం జిల్లాలో భూమినిబట్టి కనీసం 1.75 లక్షల పరీక్షలు చేయాలి. ఒకసారి పరీక్షిస్తే మళ్లీ 2-3 సంవత్సరాల తరువాత మళ్లీ పరీక్షించాలి. ఎరువుల ధరలు, కాలుష్యం పెరిగిన నేపథ్యంలో భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగానే ఎరువుల మోతాతును నిర్దేశించుకోవటం అవశ్యంగా మారింది.

జగిత్యాల జిల్లాలో సరైన విశ్లేషణకేంద్రం లేక కరీంనగర్‌కు పంపించాల్సి ఉండగా జిల్లాలోనే పూర్తిస్థాయి పరీక్షలకు ఇకమీదట ఏర్పాట్లు చేయాలి. 71 ఏఈవో క్లస్టర్లలోని రైతు వేదికల్లో మినీ భూసార పరీక్ష కేంద్రాలకు నిధులను విడుదల చేసి వినియోగంలోకి తేవాలి. అధికారుల సిఫార్సు మేరకు జగిత్యాలలో రూ.60 లక్షల నిధులతో భూసార పరీక్ష కేంద్రం నిర్మాణం, చల్‌గల్‌ ప్రదర్శన క్షేత్రంలోని ల్యాబ్‌ను వినియోగించటం, వ్యవసాయ కళాశాల, పొలాస పరిశోధనస్థానంలోనూ భూసార పరీక్షలు చేయించటంద్వారా పరీక్షల సంఖ్యను పెంచవచ్చు. కేంద్రం సూచించినట్లుగా భూసార పరీక్ష ఫలితాల కార్డులున్నవారికే రసాయన ఎరువులను విక్రయించాలి. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించి భూసార పరీక్షలను చేయించాల్సిఉంది.

సమగ్ర వివరాలతో కార్డులివ్వాలి

ప్రతిమొక్క తన జీవిత చక్రం పూర్తి చేసుకోవడానికి 17 రకాల పోషకాలు అవసరం. వీటిలో కర్బనం, ఆక్సిజన్‌, హైడ్రోజన్‌, నీరు, బొగ్గుపులుసు వాయువు, ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్‌లతో పాటు సూక్ష్మపోషకాలైన ఐరన్‌, జింక్‌, కాపర్‌, బోరాన్‌, నికెల్‌, మాలిబ్దినం, మాంగనీస్‌ ఉండాలి. భూసార పరీక్షల ద్వారా ప్రధాన, ద్వితీయ, సూక్ష్మపోషకాలశాతం తెలిస్తే మనం వేయాల్సిన ఎరువులశాతం తెలుస్తుంది. అలాగే భూమి స్వభావం పీహెచ్‌ స్థాయి అంటే ఆమ్ల గుణమా క్షార గుణమా, మధ్యస్థమా అనే వివరాలు, ఎలక్ట్రో కండక్టివిటీ(ఈసీ) లవణాల మోతాదును, సస్యరక్షణ సిఫారసులు తెలుస్తాయి కాబట్టి రైతులందరి నేలలను పరీక్ష చేసేలా చర్యలు తీసుకోవాల్సిఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని