logo

తగ్గుతున్న మామిడి ధర

మామిడి ధరలు రోజురోజుకు తగ్గుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Published : 30 Apr 2024 02:17 IST

మామిడి కాయల గ్రేడింగ్‌, ప్యాకింగ్‌

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు: మామిడి ధరలు రోజురోజుకు తగ్గుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రధానంగా పండించే బంగినపల్లి రకానికి కిలోకు రూ.60-70 వరకు పలికిన ధరలు ప్రస్తుతం రూ.20-50కి పడిపోయాయి. జిల్లాలో 35 వేల ఎకరాల్లో మామిడి సాగు ఉండగా 1.32 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రావాలి. ఇప్పటివరకు కనీసం 25 వేల మెట్రిక్‌ టన్నుల మామిడి కాయలను కొనాల్సిఉండగా కేవలం 6,500 టన్నులను మాత్రమే కొనుగోలు చేశారు. ఈ సీజన్‌లో తొలుత పూత బాగా వచ్చినా చలి, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు, తేనెమంచు, బూడిద తెగులు, తామర పురుగుల ప్రభావం, అకాలవర్షం, ఈదురు గాలులతో పూత, పిందెలు పెద్దఎత్తున రాలిపోయాయి. తోటనుబట్టి కాపు గణనీయంగా తగ్గినట్లు రైతులు, తోటల గుత్తేదారులు పేర్కొంటున్నారు. కాత తక్కువగా ఉన్నపుడు ధర పెరగాల్సిందిపోయి తగ్గుముఖం పడుతోంది.

కాయల ఎగుమతి

జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, మేడిపల్లి, రాయికల్‌, గొల్లపల్లి తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు కాయలను కొనుగోలు చేస్తారు. మార్కెట్లతో పాటు నేరుగా తోటల నుంచి కూడా కాయలను సేకరించి పెట్టెల్లో నింపి తరలిస్తారు. స్థానికంగా ధరల్లేనప్పుడు రైతులు కాయలను నాగ్‌పూర్‌, హైదరాబాద్‌ తదితర మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో చల్‌గల్‌లో లక్ష చదరపు అడుగుల్లో సిద్ధమైన షెడ్లు అందుబాటులోకి రావటం, వాలంతరి ప్రదర్శనక్షేత్రం నుంచి తీసుకున్న స్థలంలోనూ వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టడం, కాయలను బహిరంగ వేలం పద్ధతిన కొనుగోలు చేయటం తదితరాలు కలిసివస్తాయనుకున్నా ధరాఘాతం వేధిస్తోంది. అయితే మంగుతో కాయల నాణ్యత తగ్గటం, దిల్లీ మార్కెట్‌కు ఇతరప్రాంతాల కాయలు పెద్దఎత్తున రావటం తదితరాలతో ధర తగ్గినట్లు పేర్కొంటున్నారు.

తగిన చర్యలుండాలి

స్థానికంగా ధరలు తగ్గినపుడు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనువుగా జిల్లాలోని మామిడి కొనుగోలు కేంద్రాల్లో దేశవ్యాప్త మామిడి మార్కెట్ల ధరలను ప్రదర్శించాలి. కాయల గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ తదుపరి లారీలు, ట్రక్కులు, కిసాన్‌ రైలు ద్వారా దిల్లీ కేంద్రంగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతిని పెంచటం ధరల్లో స్థిరత్వాన్ని తేనుంది. స్థానిక వ్యాపారులు ఒకే ధరను చెప్పేందుకు వీలులేకుండా దూరప్రాంత వ్యాపారులను కొనుగోళ్లకు రప్పించాలి. గతంలో ప్రకటించినట్లు జగిత్యాల బ్రాండ్‌తో కాయలను ఎగుమతి చేయాలి. అపెడ, ఉద్యానశాఖ, ఎఫ్‌పీవోలు, మహిళా సంఘాల ద్వారా మామిడిని కొనుగోలుచేసి మాల్స్‌, ఉప ఉత్పత్తుల తయారీ కంపెనీలకు తరలిస్తే అధిక ధరలు దక్కుతాయి. రైతు సంఘాల ద్వారా మామిడి కాయలను సేకరించి చల్‌గల్‌లోని రైపెనింగ్‌ ఛాంబర్‌లో మాగేసి నాణ్యమైన పండ్లను జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లోనూ విక్రయించటం కలిసిరానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని