logo

యువశక్తి కీలకం.. ఉపాధితోనే ప్రోత్సాహం

నిజామాబాద్‌ లోక్‌సభా స్థానం పరిధిలో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా 19 లక్షలు కాగా తాజాగా వెల్లడైన ఓటరు జాబితా ప్రకారం 18 ఏళ్ల నుంచి 41 ఏళ్ల వయసు యువత 8.39 లక్షల మంది ఉన్నారు.

Updated : 03 May 2024 05:31 IST

ఉద్యోగ నైపుణ్య శిక్షణతోనే ఇందూరు యువతకు మేలు

యువత చేతిలోనే దేశ భవిత ఉన్నా మానవ వనరుల సమర్థ వినియోగం కొరవడింది. అధిక శాతం యువత ఉపాధి అవకాశాలు లేక కునారిల్లుతోంది. సార్వత్రిక  ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్‌ లోక్‌సభ  స్థానంలో యువశక్తిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు: నిజామాబాద్‌ లోక్‌సభా స్థానం పరిధిలో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా 19 లక్షలు కాగా తాజాగా వెల్లడైన ఓటరు జాబితా ప్రకారం 18 ఏళ్ల నుంచి 41 ఏళ్ల వయసు యువత 8.39 లక్షల మంది ఉన్నారు. ఓటర్లలో సింహభాగం యువతే కావడంతో వారిని ఆకట్టుకునేందుకు నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విద్య, ఉద్యోగ, ఉపాధి పరంగా తమ సమస్యలు పరిష్కరించాలని యువ ఓటర్లు కోరుతున్నారు.

అనుబంధ పరిశ్రమలతో ప్రయోజనం

  • లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు బాసర జోన్‌ పరిధిలోకే వస్తాయి. నూతన జోనల్‌ విధానంలో జిల్లా, జోన్‌, బహుళ జోన్‌ల కేడర్లలో ప్రత్యక్ష నియామకాలు చేపట్టి 95 శాతం స్థానికులకే అవకాశం కల్పించాలని యువత కోరుతోంది.
  • నియోజకవర్గ పరిధిలో దాదాపు 3.20 లక్షల మంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా కొలువుల సాధనకు అండగా నిలవాలని నిరుద్యోగులు విన్నవిస్తున్నారు.
  • స్థానికంగా తెలంగాణ విశ్వవిద్యాలయం సహా పశువైద్య కళాశాల, వ్యవసాయ కళాశాల, నర్సింగ్‌ కళాశాల, న్యాక్‌, పాలిటెక్నిక్‌, వృత్తివిద్య, ఐటీఐ, ఫుడ్‌టెక్నాలజీ, సీడ్‌ టెక్నాలజీ, వ్యవసాయ పాలిటెక్నిక్‌ తదితర ఇంజినీరింగ్‌ విద్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో టాస్క్‌ శిక్షణ అమలవుతున్నా ఎక్కువ మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం లేదు. అన్ని కళాశాలల విద్యార్థులకు ఉపకరించేలా ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో ప్రైవేటు కంపనీలతో ప్రాంగణ ఎంపికలు చేపట్టాలి. ్య ఇక్కడి యువత ఉన్నత చదువులకు, ఉపాధి కోసం విదేశాల బాట పడుతోంది. ముఖ్యంగా గల్ఫ్‌ వెళ్లే వారు నకిలీ ఏజెంట్ల బారిన పడి మోసపోతున్నారు. అలాగే ఉన్నత విద్య కోసం పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లడం ఆర్థిక భారంగా మారింది. ఇతర దేశాలు, ప్రాంతాలకు చెందిన కంపెనీలతో ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించడం ద్వారా తమకు అండగా నిలవాలని యువత ఆశిస్తోంది.
  • ఉన్నత విద్యావంతులు కూడా వ్యవసాయంవైపు ఆసక్తి చూపుతున్నారు. వీరు ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకొని దిగుబడులను పెంచేలా ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
  • వ్యవసాయాధారిత ప్రాంతమైనందున అనుబంధ పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా యువతకు ఉద్యోగాల కల్పనతో పాటు, రాయితీ రుణాలు ఇస్తే స్వయం ఉపాధి కల సాకారమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని