logo

రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు

దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు.

Published : 19 Apr 2024 03:22 IST

నామినేషన్ల హోరు
నేడే తుది గడువు

సిద్ధు జోరు : చిక్కబళ్లాపురలో కాంగ్రెస్‌ అభ్యర్థి రక్షా రామయ్య తరఫున ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
గురువారం కదలిన వేళ.. చిక్కబళ్లాపురలో లభించిన ఘన స్వాగత ఘట్టం

ఈనాడు, బెంగళూరు : దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. ఈ క్రమంలో గురువారం అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రముఖ పార్టీల నుంచి అభ్యర్థులు ఎక్కువగా నామినేషన్లు వేయగా మొత్తంగా 241 పత్రాలు దాఖలయ్యాయి. ఎన్నికల పరంగా దక్షిణ కర్ణాటక- ఉత్తర కర్ణాటకలు వేర్వేరు నేపథ్యాలు, నిర్ణయాత్మక అంశాలతో ముడిపడి ఉంటాయి. పార్టీల ప్రణాళికలు ఈ రెండు ప్రాంతాలపై భిన్నమైన వ్యూహాలు రచిస్తాయి. జాతీయ ప్రచారాలు కూడా ఇదే తరహాలోనే కొనసాగిస్తారు. మరో వారం రోజుల్లో తొలి విడత ఎన్నికలకు దక్షిణ ప్రాంతంలోని 14 స్థానాలకు ఎన్నికలుండగా ఇందు కోసం పార్టీలు, వాటి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు.

శివమొగ్గలో భాజపా అభ్యర్థి బి.వై.రాఘవేంద్ర  నామినేషన్‌ సందర్భంగా ప్రత్యేక వాహనంలో గురువారం ఊరేగుతున్న మాజీ ముఖ్యమంత్రులు బి.ఎస్‌.యడయూరప్ప, కుమారస్వామి, ఎస్‌.ఆర్‌.బొమ్మై, మాజీ మంత్రులు అరగ జ్ఞానేంద్ర, భైరతి బసవరాజ్‌ తదితరులు

ప్రచారానికి దండు

తొలివిడత ఎన్నికల కోసం భాజపా తరఫున జాతీయ నేతల దండు రాష్ట్రానికి తరలిరానుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మండ్య, మంగళూరుల్లో ప్రచారం చేయగా మరో విడత ప్రచారం కోసం ఈనెల 20న ఆయన రాష్ట్రానికి రానున్నారు. ఆ రోజున బెంగళూరుతో పాటు చిక్కబళ్లాపురలో పర్యటిస్తారు. ఈ రెండు చోట్ల మోదీ బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. తొలివిడత ఎన్నికల్లో కీలకంగా మారిన బెంగళూరు పరిధిలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు చిక్కబళ్లాపురపై దృష్టి సారిస్తారు. ఈ ఐదు చోట్లా నాలుగు స్థానాలను గత ఎన్నికల్లో గెలుచుకున్న భాజపా ఈసారీ వాటిని కొల్లగొట్టాలని చూస్తోంది. మోదీ తర్వాత రాష్ట్రానికి మరో భాజపా అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌ షా రానున్నారు. ఆయన ఈనెల 23, 24 తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తారు. 23న మహదేవపుర రోడ్‌షోలో పాల్గొంటారు. మరుసటి రోజున చిక్కమగళూరు, తుమకూరు, హుబ్బళ్లిలో బహిరంగ సభలు, రోడ్‌ షోలో షా పాల్గొంటారు. ఇదే రోజున సాయంత్రం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ బెంగళూరులోని రాజరాజేశ్వరి నగరలో బెంగళూరు గ్రామీణ అభ్యర్థి సి.ఎన్‌.మంజునాథ్‌ తరఫున ప్రచారం చేస్తారు. ఆ రోజున కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బెంగళూరులో పర్యటిస్తారు. ఈనెల 21న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగళూరు, మైసూరుల్లో పర్యటిస్తారు.

వారి మధ్యే పోరు..

ఇటీవల మండ్యలో నిర్వహించిన ఎన్‌డీఏ బహిరంగ సభ తర్వాత రాష్ట్రంలో నాయకత్వ సమీకరణాలు పూర్తిగా మారాయి. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేరుగా ప్రధానిని విమర్శిస్తూ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తుండగా- ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌.. మాజీ ప్రధాని దేవేగౌడ, కుమారస్వామిపై దృష్టి సారించారు. మరోవైపు ఎన్‌డీఏ తరఫున కాంగ్రెస్‌పై విమర్శల దాడులకు హెచ్‌.డి.దేవేగౌడ నాయకత్వం వహిస్తుండటం గమనార్హం. ఇటీవల డీకే శివకుమార్‌- కుమారస్వామి మధ్య పెరిగిన వ్యక్తిగత విమర్శల క్రమంలో.. దేవేగౌడ తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు. డీకే శివకుమార్‌కు సంబంధించిన వ్యక్తిగత అంశాలపై ఆయన బుధ, గురువారాల్లో చేసిన ఆరోపణలు రాజకీయాల్లో తీవ్ర సంచలన్లాఉ రేకెత్తించాయి. వీరిద్దరూ ఒక్కలిగ సముదాయానికి నాయకత్వం వహించే నేతలు కావటంతో వ్యక్తిగత విమర్శలన్నీ ఎన్నికల ప్రచారంలో దుమారం రేపుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భాజపాను, కేంద్ర సర్కారును విమర్శిస్తూ సామాజిక మాధ్యమాలు, బహిరంగ ప్రచారాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. జాతీయ నాయకులైన రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే చేపట్టాల్సిన బాధ్యతలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రంలో నిర్వర్తిస్తూ.. విపక్షాలను పరుగు పెట్టిస్తున్నారు.

కలబుగరిలో భాజపా అభ్యర్థి ఉమేష్‌ జాదవ్‌ నామినేషన్‌ సందర్భంగా భాజపా శ్రేణుల భారీ ఊరేగింపు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని