logo

భాజపా తీరు ప్రమాదకరం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా నాయకులతో వెనుకబడిన వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు.

Published : 28 Apr 2024 04:56 IST

ప్రజలకు సిద్ధు హెచ్చరిక

ప్రసంగిస్తున్న సిద్ధరామయ్య.. చిత్రంలో అభ్యర్థి సంయుక్త పాటిల్‌

బాగలకోటె, న్యూస్‌టుడే : ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా నాయకులతో వెనుకబడిన వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. రిజర్వేషన్ల విషయంలోనూ అబద్ధాలను ప్రచారం చేసేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పేందుకు కాషాయ పార్టీ నాయకులకు ఎటువంటి సిగ్గు లేదన్నారు. మండల్‌ కమిషన్‌ నివేదికను వ్యతిరేకిస్తూ భాజపా నాయకుడు రామాజోయిస్‌ సర్వోన్నత న్యాయస్థానంలో అర్జీ వేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. బాగలకోటె జిల్లా రబకవి బనహట్టిలో లోక్‌సభ అభ్యర్థి సంయుక్త పాటిల్‌కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో సిద్ధు శనివారం మాట్లాడారు. దేశంలో మొదటి విడత 102 నియోజకవర్గాల్లో పోలింగ్‌ పూర్తయ్యాక ఓడిపోతామని కాషాయ పార్టీ గుర్తించిందన్నారు. అందుకే అబద్ధాలు, ద్వేష ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. వెనుకబడినవర్గాల రిజర్వేషన్లను రద్దు చేసి, వాటిని ముస్లింలకు ఇస్తున్నారని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని దుయ్యబట్టారు. సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన సూచన చేసిన తర్వాత కరవు పరిహారాన్ని విడుదల చేసి, దాన్ని తమ ఔదార్యంగా ప్రకటించుకోవడం సిగ్గు చేటన్నారు. భాజపా అభ్యర్థి గద్దిగౌడర్‌ను ఓడించాలని ఓటర్లను కోరారు. రెండు దశాబ్దాలుగా స్థానికుల సమస్యలను పరిష్కరించని గద్దిగౌడర్‌తో ఓటర్లకు అవసరం లేదన్నారు. మంత్రులు తిమ్మాపూర్‌, శివానంద పాటిల్‌, పార్టీ నేతలు లక్ష్మణ సవది, వినయ్‌ కులకర్ణి, ఎస్‌ఆర్‌పాటిల్‌, ఉమాశ్రీ, విజయానంద కాశప్పనవర్‌, అజయ్‌ కుఆర్‌, సునీత పాటిల్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని