logo

చెలరేగిన నిరసన ప్రజ్వాల

లైంగిక దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన లోక్‌సభ సభ్యుడు, జనతాదళ్‌ యువ నాయకుడు ప్రజ్వల్‌, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణలపై కఠిన చర్యలు తీసుకోవాలని యువ కాంగ్రెస్‌ సమితి డిమాండు చేసింది.

Published : 29 Apr 2024 01:13 IST

బెంగళూరులో ప్రజ్వల్‌ దిష్టి బొమ్మకు నిప్పంటించిన ఆందోళనకారులు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : లైంగిక దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన లోక్‌సభ సభ్యుడు, జనతాదళ్‌ యువ నాయకుడు ప్రజ్వల్‌, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణలపై కఠిన చర్యలు తీసుకోవాలని యువ కాంగ్రెస్‌ సమితి డిమాండు చేసింది. ప్రజ్వల్‌, రేవణ్ణ, కుమారస్వామి, దేవేగౌడ చిత్రాలు ఉన్న మాస్కులు ధరించి రేసు కోర్సు రోడ్డులోని పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం ధర్నాకు దిగారు. ప్రజ్వల్‌ దిష్టిబొమ్మకు నిప్పంటించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజ్వల్‌పై ఆరోపణలు ఉన్నప్పటికీ దళపతులు, వారి మిత్రపక్షం భాజపా మౌనంగా ఉన్నట్లు ఆందోళనకు నేతృత్వం వహించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.మనోహర్‌ ఆరోపించారు. లైంగిక దౌర్జన్యానికి పాల్పడి, వాటిని చరవాణి కెమెరాలతో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. గతంలోనూ పలువురు యువతులపై ప్రజ్వల్‌ ఇదే తరహా లైంగిక దౌర్జన్యానికి పాల్పడినా, ఎవరూ ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయలేకపోయారని వివరించారు. పార్టీ నేతలు ఆనంద్‌, హేమరాజు, రామకృష్ణ, ఉమేశ్‌, రంజిత్‌ చంద్రశేఖర్‌, ఉమాబాయి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

సంబంధం లేదు.. లోక్‌సభ సభ్యుడు ప్రజ్వల్‌ రేవణ్ణకు- జనతాదళ్‌కు ఎటువంటి సంబంధ లేదని మాజీ మంత్రి జీటీ దేవేగౌడ వ్యాఖ్యానించారు. ప్రజ్వల్‌తో భాజపాకు, జనతాదళ్‌కు ఎటువంటి సంబంధం లేదన్నారు. సిట్ దర్యాప్తుతో వాస్తవాలు బయటకు వస్తాయని, నేరం చేసి ఉంటే వారికి శిక్ష పడుతుందని పేర్కొన్నారు.

పరువు తీశారు

లోక్‌సభ సభ్యునిగా ఉంటూ పలువురు మహిళలు, యువతులపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ప్రజ్వల్‌ రేవణ్ణ దేశం పరువు తీశారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ దుయ్యబట్టారు. ఆయన ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ దీనిపై దళ్‌, భాజపా నాయకులు వివరణ ఇవ్వాలని డిమాండు చేశారు. ప్రజ్వల్‌ పేరిట వచ్చిన వీడియోలపై విపక్ష నేత అశోక్‌, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె ఎందుకు మౌనాన్ని ఆశ్రయించారని ప్రశ్నించారు. హస్తిన నుంచి దీనికి సంబంధించి తనకు రెండు రోజులుగా ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటైందని తెలుసుకున్న తర్వాత ప్రజ్వల్‌ జర్మనీకి పరారయ్యాడని గుర్తించామని హోం మంత్రి డాక్టర్‌ జీ పరమేశ్వర్‌ తెలిపారు. నోటీసులు జారీ చేయడం, విచారణ తదితర అంశాలను ప్రత్యేక దర్యాప్తు దళం చూసుకుంటుందని, దీనిలో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నోరు విప్పాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ కర్ణాటకకు వచ్చి ప్రజలను దారి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని తన ఎక్స్‌కార్ప్‌ ఖాతాలో తప్పుపట్టారు. మంగళసూత్రాలు, ముస్లింలకు రిజర్వేషన్‌, ప్రణాళికకు సంబంధించిన అబద్ధాలు చెప్పే బదులుగా కన్నడిగులకు వాస్తవాలు చెప్పండి అంటూ హితవు పలికారు. మనసును నొప్పించే ఘటన హాసన జిల్లాలో చోటు చేసుకుందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ నేత ఆయనూరు మంజునాథ్‌ శివమొగ్గలో వ్యాఖ్యానించారు. ఇంట్లో పని చేసేందుకు వచ్చిన మహిళతో పాటు, పలువురు యువతులను బెదిరించి ఒక రాజకీయ నాయకుడు అత్యాచారానికి పాల్పడడం శోచనీయమని ఆక్రోశించారు.

ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను అరెస్టు చేయాలంటూ డీజీపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తల నిరసన

మోదీజీ స్పందించండి

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ అనేక మంది ఆడబిడ్డల జీవితాలు నాశనం చేసినట్లు అశ్లీల వీడియోలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించాలని కాంగ్రెస్‌ మహిళా నేతలు డిమాండు చేశారు. బెంగళూరులోని కాంగ్రెస్‌భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అధికార ప్రతినిధులు కవితారెడ్డి, మంజుళనాయుడు మాట్లాడారు. మాజీ ప్రధాని కుటుంబ వ్యవహారాలు ప్రజల్లో చర్చకు కారణమైనట్లు వివరించారు. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రాత్రికి రాత్రే విదేశాలకు వెళ్లిపోవడాన్ని ప్రశ్నించారు. ప్రతిదానికీ స్పందించే భాజపా నాయకులు శోభా కరంద్లాజె, సీటీరవి, విజయేంద్ర, బసవరాజ పాటిల్‌ యత్నాళ్‌, ఆర్‌.అశోక్‌ నోర్లు పెగలవెందుకని నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని