logo

ఉత్తరాన మోదీ ఉరుములు

రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం భాజపా ప్రచారం వాయువేగంతో ప్రారంభించింది. ఒకే రోజున నాలుగు ప్రాంతాలు, తొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థుల విజయం కోసం భాజపా కీలకనేత- ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచారాన్ని ఉరకలెత్తించారు.

Updated : 29 Apr 2024 06:41 IST

 కాంగ్రెస్‌పై జోరుగా విమర్శలు
 ప్రసంగమంతా అబద్ధాలే: కాంగ్రెస్‌

సిరసిలో వేదికపై నుంచి కార్యకర్తలకు అభివాదం చేస్తున్న నరేంద్రమోదీ, ప్రహ్లాద్‌ జోషి, విశ్వేశ్వర హెగ్డే కాగేరి, కోటా శ్రీనివాస పూజారి

ఈనాడు, బెంగళూరు : రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం భాజపా ప్రచారం వాయువేగంతో ప్రారంభించింది. ఒకే రోజున నాలుగు ప్రాంతాలు, తొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థుల విజయం కోసం భాజపా కీలకనేత- ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచారాన్ని ఉరకలెత్తించారు. ఉదయం ఏడు గంటలకే బెళగావి విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఆయన రోజంతా రాష్ట్రంలోనే పర్యటించారు. ఒక్క రోజులోనే మధ్య కర్ణాటక, కల్యాణ కర్ణాటక, కిత్తూరు కర్ణాటక వలయాన్ని చుట్టేసి రెండో విడత ప్రచారాన్ని దాదాపు ముగించారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ తరఫున ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కిత్తూరు కర్ణాటక భాగంలో సంచరించి ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. ఎన్‌డీఏ అభ్యర్థుల కోసం తమ వంతు బాధ్యతగా జేడీఎస్‌ నేత కుమారస్వామి హొసపేటెలో ప్రధాని పాల్గొన్న బహిరంగ సభకు హాజరయ్యారు. తొలివిడత ఎన్నికల్లో అలుపెరగక ప్రచారం చేసిన ప్రముఖ పార్టీల నేతలంతా మలివిడతలో అదే జోరును కొనసాగించారు.

 సమయం తక్కువగా ఉండటం, దేశమంతా ప్రచారం చేయాల్సిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న కారణంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించిన ప్రాంతాల్లో ఇద్దరు అంతకంటే ఎక్కువ అభ్యర్థులను ఆహ్వానిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కిత్తూరు కర్ణాటక ప్రాంతంలోని బెళగావిలో ఏర్పాటు చేసిన సభకు స్థానిక అభ్యర్థి జగదీశ్‌ శెట్టర్‌, చిక్కోడి అభ్యర్థి అన్నాసాహెబ్‌ జొల్లే హాజరయ్యారు. ఉత్తర కన్నడ స్థానాల తరఫున శిరిసిలో ఏర్పాటు చేసిన సభకు స్థానిక అభ్యర్థి విశ్వేశ్వర హెగ్డేకాగేరి, ధార్వాడ అభ్యర్థి ప్రహ్లాద్‌ జోషి వచ్చారు. మధ్య కర్ణాటకలోని దావణగెరెలో ఏర్పాటు చేసిన సభలో స్థానిక అభ్యర్థి గాయత్రి సిద్దేశ్వర, హావేరి అభ్యర్థి బసవరాజ బొమ్మై పాల్గొన్నారు. కల్యాణ కర్ణాటక వలయంలోని హొసపేటెలో ఏర్పాటు చేసిన సభకు బళ్లారి అభ్యర్థి బి.శ్రీరాములు, రాయచూరు అభ్యర్థి రాజా అమరేశ్‌ నాయక్‌, కొప్పళ అభ్యర్థి బసవరాజ క్యావటర్‌ విచ్చేశారు. ఒకే రోజున తొమ్మిది నియోజవకవర్గాల అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. సోమవారం కిత్తూరు కర్ణాటక ప్రాంతంలోని మరో కీలకమైన ప్రాంతం బాగల్‌కోటెలో ప్రధాని ప్రచారం చేస్తారు.

విమర్శల వర్షం

ఈ ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని మోదీ విమర్శల వర్షం కురిపించారు. మత, సామాజిక, శాంతి భద్రతల అంశాలపై ఎక్కువగా దృష్టి సారించారు. నాలుగు చోట్ల ఒకే తరహా ప్రసంగం కొనసాగించారు. కాంగ్రెస్‌ పార్టీ దేశ సంపద, సంస్కృతితో పాటు ఆంగ్లేయుల నుంచి రక్షణగా నిలిచిన ఛత్రపతి శివాజీ, కిత్తూరు రాణి చెన్నమ్మ, సంగొళ్లి రాయణ్ణ, బసవణ్ణల పేర్లను ప్రస్తావించారు. దేశ రక్షణకు నిలిచిన ఈ రాజుల కంటే వీరిని హింసించిన ఔరంగజేబు వంటి సుల్తానులను కొనియాడి ఈ సమాజానికి చెందిన ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేసినట్లు కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ప్రతి చోటా బాంబు దాడులు, హుబ్బళ్లిలో విద్యార్థిని హత్య అంశాలు పదేపదే ప్రస్తావించిన ప్రధాని- కాంగ్రెస్‌ పార్టీ కారణంగా దేశానికి భద్రత కరవైందన్నారు. దేశ ప్రజల సంపదను సమీక్షించి అందులోని 55 శాతాన్ని సేకరించి పేదలకు పంచుతామని రాహుల్‌గాంధీ, ప్రియాంక వాద్రేలు దేశమంతా తిరిగి ప్రచారం చేస్తున్నారు. వీరి కలలు నేనుండగా నిజం కానివ్వనని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. బెనారస్‌ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన గైక్వాడ్‌ మహరాజ్‌ సహకారంతో విదేశాల్లో చదివిన అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించారని వివరించారు. అలా రాజ్యాం రచనకు మహారాజుల సహకారం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. చివరిగా ప్రతి చోటా అభ్యర్థులకు వేసే ప్రతి ఓటూ మోదీకి వేసినట్లని ప్రకటించారు. ఇంటింటికీ వెళ్లి మోదీకి ఓటేయాలని అభ్యర్థించాలని భాజపా శ్రేణులకు సూచించారు. చివరిగా హొసపేటెలో తన ప్రసంగంలో తప్పకుండా ఆచరించే మొబైల్‌ వెలుతురు ప్రదర్శనతో ఓట్లను అభ్యర్థించారు. ఇదే సందర్భంగా మాజీ ముఖ్యమంత్రులు బీఎస్‌ యడియూరప్ప, బసవరాజ బొమ్మై, కుమారస్వామి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ప్రసంగాల్లో.. కాంగ్రెస్‌ రాష్ట్ర ఆర్థికతను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.

హొసపేటె సభలో అభివాదం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ. చిత్రంలో భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర, మాజీ సీఎం కుమారస్వామి తదితరులు..

కాంగ్రెస్‌ నిప్పులు

మోదీ, అమిత్‌షా.. రాష్ట్రంలో పర్యటించిన ప్రతి సందర్భంలోనూ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలను సంధించే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ సామాజిక మాధ్యమ విభాగం ఈసారీ అదే ప్రచారం సాగించడం ప్రస్తావనార్హం. బెళగావి, చిక్కోడిల్లో పర్యటించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ప్రధాని మోదీ చేసిన వాఖ్యలను తప్పుబట్టారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు. ఆయన ఆరోపించినట్లు కాంగ్రెస్‌ స్వాతంత్య్ర సమరయోధులను అవమానించలేదన్నారు. కిత్తూరురాణి చెన్నమ్మ జయంతి, సంగొళ్లి రాయణ్ణ అభివృద్ధి మండలిని రచించింది కాంగ్రెస్‌ తప్ప యడియూరప్ప, బొమ్మై సర్కారు కాదని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దేశాన్ని రక్షించిన మహారాజులను కాంగ్రెస్‌ సర్కారు గౌరవంగా చూసిందన్నారు. భాజపా దేశప్రజలకు వాస్తవాలను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు నిందించారు. చివరిగా మోదీ మాదిరిగానే సిద్ధరామయ్య సైతం బెళగావి, చిక్కోడిల్లో కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఓటు తనకు వేసినట్లుగా భావించాలని మనవి చేశారు. అంతకు ముందు కేంద్రం విడుదల చేయాల్సిన పరిహారంపై కాంగ్రెస్‌ నేతలంతా విధానసౌధ వద్ద ఆందోళన చేపట్టారు.

బెళగావి సాంబ్రా విమానాశ్రయంలో మోదీతో కరచాలనం చేస్తున్న జగదీశ్‌ శెట్టర్‌

ప్రచారానికి రమ్మన్నారు..

దావణగెరె : దావణగెరెలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న సమావేశంలో మండ్య లోక్‌సభ సభ్యురాలు సుమలత అంబరీశ్‌ పాల్గొన్నారు. తనను కుమారస్వామి మద్దతు ఇవ్వాలని కోరారని, ప్రచారానికి రమ్మని ఆహ్వానించారని చెప్పారు. ఏ రోజు, ఎక్కడ ప్రచారం చేయాలో చెప్పలేదని, భాజపా నాయకులు ఎటువంటి సూచనలూ చేయలేదని స్పష్టం చేశారు. సరైన సమాచారం లేకపోవడం, అవగాహన లోపంతోనే తాను ప్రచారానికి దూరంగా ఉన్నానని సష్టం చేశారు. మండ్యలో కుమారస్వామి విజయం సాధిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

మోదీకి నిరసన సెగ

దావణగెరె, న్యూస్‌టుడే : దావణగెరెలో బహిరంగ సభలో మాట్లాడేందుకు వస్తున్న ప్రధాని మోదీని అడ్డగించేందుకు ప్రయత్నించిన ఆరోపణలపై కొందరు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. చెంబులు, నినాదాలు రాసిన అట్టముక్కలతో వచ్చిన కార్యకర్తలను గుర్తించి, పోలీసులు వారిని అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించారు. మోదీ ప్రసంగం పూర్తయిన తర్వాతే వారిని, వ్యక్తిగత పూచీకత్తుపై ఠాణా నుంచి విడిచి పెట్టారు.

బెళగావి బహిరంగ సభలో భాజపా కార్యకర్తలు.. మోదీకి మద్దతుగా నినాదాలు

బెళగావి వేదికపై మోదీని ఆశీర్వదిస్తున్న తల్లి చిత్రాన్ని అందిస్తున్న నాయకబృందం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని