logo

కనుమరుగైన హెలికాప్టర్‌ నియోజకవర్గం

భద్రాచలం లోక్‌సభ స్థానానికి హెలికాప్టర్‌ నియోజకవర్గంగా పేరుండేది. ఈ స్థానంలో వచ్చిన మార్పులు అన్నీఇన్నీ కావు. దేశ ప్రధానులు సైతం ఇక్కడి ఎంపీలను పేరు పెట్టి పిలిచేవారంటే అది నాయకుల గొప్పతనంతో పాటు ఈస్థానానికి ఉన్న ప్రత్యేకతను చాటుతుంది.

Published : 28 Apr 2024 01:24 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం లోక్‌సభ స్థానానికి హెలికాప్టర్‌ నియోజకవర్గంగా పేరుండేది. ఈ స్థానంలో వచ్చిన మార్పులు అన్నీఇన్నీ కావు. దేశ ప్రధానులు సైతం ఇక్కడి ఎంపీలను పేరు పెట్టి పిలిచేవారంటే అది నాయకుల గొప్పతనంతో పాటు ఈస్థానానికి ఉన్న ప్రత్యేకతను చాటుతుంది. కేవలం విస్తీర్ణపరంగా కాకుండా దండకారణ్యంగా ఈ నియోజకవర్గం ప్రసిద్ధి చెందింది. తొలినాళ్లలో సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ సమీపంలో గల గోలుగొండ నియోజకవర్గంలో భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉండేది. 1962 లోక్‌సభ ఎన్నికల సమయంలో గోలుగొండ నియోజకవర్గాన్ని రద్దు చేశారు. అప్పుడు మన్యం ప్రాంతాలను కలుపుతూ విశాఖ సమీపంలోని నర్సీపట్నం లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడగా అందులో భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉండేది. ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో 1967లో భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడు, విశాఖ జిల్లాలోని చింతపల్లి, పాడేరు, తూర్పుగోదావరి జిల్లాలోని ఎల్లవరం, పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం, గోపాలపురం అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండేవి.

దేశంలోనే పెద్దది..!: భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేయాలంటే అభ్యర్థులకు ఎక్కువ సమయం పట్టేది. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌ ఒక్కో మూలకు ఉండటంతో వ్యయప్రయాసలు తప్పేవి కాదు. అప్పట్లో రహదారి సదుపాయాలు అంతంతమాత్రమే. చాలాచోట్ల వాగులపై వంతెనలు ఉండేవి కాదు. వాహనాల్లో వెళ్లినా ఒకచోటు నుంచి మరోచోటుకు చేరుకోవాలంటే రోజంతా ప్రయాణానికే సరిపోయేది. భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని వాజేడు మండలం నుంచి పాడేరుకు 400 కి.మీ దూరం ఉంటుంది. హెలికాప్టర్‌లో తిరిగితేనే ప్రచారం సాధ్యమవుతుందని నాయకులు చమత్కరించుకునేవారు. ఇక్కడ నెగ్గిన వారిని సరదాగా భద్రాచలం ఎంపీ అనడానికి బదులు హెలికాప్టర్‌ నియోజకవర్గ ఎంపీ అని తోటి సభ్యులు పిలిచేవారు. హెలికాప్టర్‌లో తిరిగితేనే ఇక్కడి ప్రజలను కలవడం కుదురుతుందన్న ఉద్దేశంతో అలా అనేవారు. రాజకీయ నాయకులు సైతం దీన్ని అదేవిధంగా పిలుచుకొని మురిసిపోయేవారు. ఎంతో చరిత్ర గల ఇలాంటి ఎంపీ స్థానం 2009లో రద్దయ్యింది. ప్రస్తుతం మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్‌ భాగమైంది. ఎన్నో మార్పులు చోటుచేసుకున్న ఈ ప్రాంతంలో విభిన్న సంప్రదాయాలు కనిపిస్తుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని