logo

భారాస పదేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలే: రఘురాంరెడ్డి

పదేళ్ల భారాస పాలన  వైఫల్యాలమయం అని ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఎద్దేవా చేశారు. 

Published : 29 Apr 2024 01:16 IST

అశ్వారావుపేటలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: పదేళ్ల భారాస పాలన  వైఫల్యాలమయం అని ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అశ్వారావుపేట పోలీసు స్టేషన్‌ కూడలిలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సభలో రఘురాంరెడ్డి    ప్రసంగించారు. భాజపా పదేళ్ల పాలనలో అధిక ధరలతో ప్రజలు కష్టాలపాలయ్యారని  వ్యాఖ్యానించారు. రూ.400 ఉన్న గ్యాస్‌ ధర  రూ.1,000కి పెరిగిందన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, కానీ కోటి మంది కొలువులు కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు.  ప్రభుత్వ సంస్థలన్నీ మూసివేసి కార్పొరేట్‌ శక్తులకు  ధారాదత్తం చేశారని విమర్శించారు. ఆగస్టు 15 వరకు రూ.2లక్షల చొప్పున రైతుల రుణాలను సీఎం రేవంత్‌రెడ్డి మాఫీ చేయనున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే అయిదు అమలవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ మాటిస్తే తప్పక అమలు చేస్తుందనేందుకు ఇదే నిదర్శనమని   వివరించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ      మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో తనకు వచ్చిన ఆధిక్యం కంటే రెట్టింపు మెజారిటీతో రఘురాంరెడ్డిని  గెలిపించాలని కోరారు. మువ్వా విజయబాబు     మాట్లాడుతూ చేయిచేయి కలిపి కాంగ్రెస్‌కు విజయం చేకూర్చాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక  30లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను రాహుల్‌గాంధీ తీసుకుంటారని పేర్కొన్నారు. మద్దినేని స్వర్ణకుమారి, జూపల్లి రమేష్‌, తుమ్మా రాంబాబు, సుంకవల్లి వీరభద్రరావు, సీపీఐ, సీపీఎం నాయకులు సయ్యద్‌ సలీం,   కొక్కెరపాటి పుల్లయ్య పాల్గొన్నారు. అశ్వారావుపేటలో ఆదివారం సాయంత్రం జరిగిన రఘురాంరెడ్డి రోడ్‌షోకు తుమ్మల వర్గీయులు, పలువురు కాంగ్రెస్‌ నాయకులు గైర్హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని