logo

ధర బాగుంది.. ధాన్యం బయటే అమ్మేద్దాం!

యాసంగిలో వరి అత్యధిక విస్తీర్ణం సాగైన జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఒకటి. ప్రాజెక్టులు, ప్రధాన చెరువులు, వాగులు, గొట్టపు బావుల కింద సుమారు 60 వేల ఎకరాల్లో నాట్లు వేశారు.

Published : 29 Apr 2024 01:19 IST

పాల్వంచ మండలం రంగాపురంలో ధాన్యం కొనుగోలు

కొత్తగూడెం వ్యవసాయం, న్యూస్‌టుడే: యాసంగిలో వరి అత్యధిక విస్తీర్ణం సాగైన జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఒకటి. ప్రాజెక్టులు, ప్రధాన చెరువులు, వాగులు, గొట్టపు బావుల కింద సుమారు 60 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. మార్కెట్‌ డిమాండ్‌ కారణంగా ఎక్కువ మంది సన్నాలు సాగు చేశారు. గత రెండు వారాలుగా కోతలు జోరందుకున్నాయి. దీనికి అనుగుణంగా    కలెక్టర్‌ ఆదేశాలతో వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార శాఖల అధికారులు ధాన్యం సేకరణకు 136 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోతలు ప్రారంభమై దాదాపు మూడు వారాలు కావొస్తుండగా, పలుచోట్ల కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరకు మించి బహిరంగ మార్కెట్‌లో ప్రైవేటు వ్యాపారులే సరకు కొంటున్నారు.  

దళారుల వైపు రైతుల మొగ్గు

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు 20 శాతం మంది లోపే రైతులు ధాన్యం తీసుకొస్తున్నారని అంచనా. ‘ఏ’ గ్రేడ్‌ రకానికి క్వింటాకు రూ.2,203 మద్దతు ధర కల్పిస్తున్నారు. ప్రైవేటుగా వ్యాపారులు క్వింటా పచ్చి ధాన్యాన్ని రూ.2,700 నుంచి రూ.2,900 వరకు కొనుగోలు చేస్తున్నారు. అన్నదాతకు సగటున ఒక క్వింటాకు రూ.600 వరకు అదనంగా మిగులుతోంది. దొడ్డు రకాలకూ బయట బాగానే డిమాండ్‌ ఉంటోంది. వాటికి కూడా బహిరంగ మార్కెట్‌లో క్వింటాకు రూ.200 వరకు ఎక్కువ ధర పలుకుతోంది. కోత పూర్తయిన వెంటనే తేమశాతంతో నిమిత్తం లేకుండా కాంటా వేసి లోడు చేస్తుండటంతో కల్లాల్లోనే ధాన్యం అమ్మేస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాలకు తరలిస్తే అకాల వర్ష భయంతో పాటు టార్పాలిన్‌, గోనె సంచులు, కాంటా రుసుము, రవాణాలో జాప్యం వంటి ఇబ్బందులు  తలెత్తుతున్నాయని రైతులు చెబుతున్నారు. ప్రైవేటుగు విక్రయిస్తే ఎక్కువగా తూకాల్లో తేడాలుంటాయి. ఇలా జరగకుండా   సంబంధిత అధికారులు తనిఖీలు చేయాలి.


  • ‘ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల నుంచి వెంటనే ధాన్యం సేకరిస్తున్నాం. జాప్యం లేకుండా మిల్లులకు తరలిస్తున్నాం. ఒకవేళ వర్షాలువచ్చినా ఇబ్బందుల్లేకుండా రాశులు కప్పి ఉంచేందుకు టార్పాలిన్‌ పట్టాలను సిద్ధంగా ఉంచాం’ అని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని