logo

బాధితులకు భరోసా.. పోక్సో ఈ బాక్స్‌

నిత్యం ఎక్కడో ఓ చోట బాలికలు, అభంశుభం తెలియని చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.

Updated : 29 Apr 2024 06:07 IST

అశ్వారావుపేట గ్రామీణం, అన్నపురెడ్డిపల్లి, న్యూస్‌టుడే: నిత్యం ఎక్కడో ఓ చోట బాలికలు, అభంశుభం తెలియని చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆకృత్యాలకు పాల్పడే వారిపై ఫిర్యాదుకు బాధితులు వెనుకాడుతుండటంతో శిక్ష నుంచి వారు తప్పించుకోగలుగుతున్నారు. చాలామంది నేరం చేసిన వారికి భయపడి ఫిర్యాదు చేయడం లేదు. ధైర్యంగా కొందరు ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినా నేరం చేసిన వారి నుంచి బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బాలికలు, చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్టను వేసేందుకు నేరగాళ్లను శిక్షించడంతో పాటు, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచేందుకు ‘పోక్సో ఈ బాక్స్‌’ అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించింది.

దిల్లీ కేంద్రంగా చర్యలు..

బాధితులు చేసిన ఫిర్యాదులపై దిల్లీలో కేంద్ర ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది. యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు స్త్రీ, శిశు సంక్షేమాధికారి రాష్ట్ర కార్యాలయానికి, జిల్లా కేంద్రానికి సమాచారం పంపుతారు. బాలల సంరక్షణ అధికారి,  సిబ్బందీ సహకరించి వెంటనే విచారణ చేపడతారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసే అధికారులకు ఫిర్యాదు ఎవరు చేశారన్న సమాచారమూ తెలియదు. దీంతో పారదర్శకతతో విచారణ సాగి.. పోలీసుల సహకారంతో కేసును నమోదు చేస్తారు. ఎప్పటికప్పుడు విచారణ, కేసుకు సంబంధించిన పురోగతి వివరాలను వారు ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారులకు రక్షణ, నేరానికి పాల్పడిన వారికి శిక్ష పడేలా యంత్రాంగం తోడ్పాటునిస్తుంది. దీంతో బాధితులకు న్యాయం జరుగుతుంది. అఘాయిత్యానికి గురైన వారు తప్పక ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.


ఫిర్యాదు చేసే విధానం ఇలా..

స్మార్ట్‌ ఫోన్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ‘పోక్సో ఈ-బాక్స్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అక్కడ వెంటనే ఫిర్యాదుల విభాగం ముఖచిత్రం కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి. సాధారణంగా చిన్నారులకు ఎదురయ్యే ఆరు రకాల హింసలకు సంబంధించిన చిత్రాలు కనిపిస్తాయి. హింస స్వభావాన్ని గమనించి ఆ చిత్రంపై క్లిక్‌ చేయాలి. అనంతరం ఫిర్యాదు పత్రంలో బాధితుల వివరాలు, జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను సంబంధిత ట్యాబ్‌లో పొందుపర్చి సమర్పించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని