logo

ఉద్యోగుల సొమ్ము.. జగన్‌ వమ్ము

ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్‌ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్‌ జమానాలో నరకం అనుభవించారు.

Updated : 19 Apr 2024 05:55 IST

రూ.1,500 కోట్ల బకాయిలకు నిరీక్షణ
అడిగితే అణచివేతలు.. ప్రశ్నిస్తే కేసులు 
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే

నాడు: మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.. గతంలో తెదేపా పాలనలో ఉద్యోగులను అణగదొక్కారు.
- పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌ ప్రగల్భాలు.!!

నేడు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా కొలువుదీరాక ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై మౌనం దాల్చారు.. ఉద్యమిస్తామని డిమాండు చేస్తే నోటీసులు, గృహ నిర్బంధాలు.. అరెస్టులు.. ఆనక బెదిరింపులతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. పీఆర్సీ, కరవుభత్యం, సరెండర్‌ లీవులు తదితరాల కింద ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులకు రూ.1,500 కోట్లకు పైగా బకాయిలు ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంది. చివరికి ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలిచ్చే అంశాన్ని విస్మరించారు.

మ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్‌ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్‌ జమానాలో నరకం అనుభవించారు. ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వకుండా భయపెట్టే ప్రయత్నం చేసింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జగన్‌ మాట తప్పారని, మడమ తిప్పారని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. 2018 జులై, 2019 జనవరి డీఏ బకాయిలు, ఆర్జిత సెలవుల పెండింగ్‌ బకాయిలు రెండు విడతల్లో చెల్లిస్తామని నమ్మబలికి ధోకా ఇచ్చారు.

రూ.17 కోట్ల రుణం ఏమైంది

తాము దాచుకున్న సొమ్ము, రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా కరుణించడం లేదు.. పాలసీ ఫైనల్‌ సెటిల్‌మెంట్లకు 768 మంది, ఏపీజీఎల్‌ఐ రుణాలకు 283 మంది అర్జీ పెట్టుకున్నారు. మ్యానువల్‌గా దరఖాస్తు చేసుకున్నవారికి సుమారు రూ.17 కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది.

పీఆర్సీ బకాయిలు: రూ.538.46 కోట్లు

చరిత్రలో మొదటిసారి పీఆర్‌సీ నివేదిక కాకుండా ఆఫీసర్స్‌ కమిటీ నివేదికను ఆమోదించి ప్రభుత్వం కొత్త పోకడ సృష్టించింది. ఎన్నికల హామీగా ప్రకటించిన 27 శాతం మధ్యంతర భృతి కంటే తక్కువ ఫిట్‌మెంటు 23 శాతం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో 35 వేల మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, సుమారు 30 వేల మంది పింఛనుదారులకు సంబంధించి రూ.153.84 కోట్ల డీఏ బకాయిల చెల్లింపుల్లో సైతం జాప్యం చేస్తోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. 01.04.2021 నుంచి 2022, జనవరి 1 నుంచి ఉద్యోగులు, పింఛనుదారులకు పీఆర్సీ బకాయిలు రూ.538.46 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.


డీఏ సొమ్ము: రూ.84.61 కోట్లు

వైకాపా ప్రభుత్వం ఒక్క డీఏ ఇచ్చిన సందర్భం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు (2023, జనవరి, జులై ) చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.84.61 కోట్ల డీఏ బకాయిల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. 15 వేల మందికిపైగా ఉన్న సీపీఎస్‌ ఉద్యోగులకు డీఏ రూ.69.23 కోట్లు రావాల్సి ఉంది. ఏప్రిల్‌, జూన్‌లో డీఏలు ఇస్తామని ప్రభుత్వం చెప్పి జీవోలు ఇచ్చింది. ఈ నెలలో రావాల్సి ఉన్నా.. ఇప్పటివరకు రాలేదు. ఆన్‌లైన్‌లో డీఏకు సంబంధించిన వివరాలు కనిపించడం లేదు. నమోదు చేసుకునేందుకు ఎక్కడా ఆప్షన్‌ కన్పించడం లేదు. ఒక్కో ఉద్యోగికి డీఏ బకాయిలే కనీసం రూ.2 లక్షల వరకు రావాల్సి ఉంది. 2018 నుంచి రావాల్సిన డీఏ బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు.


సరెండర్‌ సెలవులు: రూ.173 కోట్లు

రెండర్‌ లీవ్‌ల నగదు కోసం ఉద్యోగులు ఏడాదికి ఒకసారి దరఖాస్తు పెట్టుకుంటారు. అదే పోలీసు శాఖలో ఉద్యోగులకు రెండుసార్లు పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. గత ప్రభుత్వంలో ఏటా ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటే నగదును సదరు ఉద్యోగి ఖాతాలో జమ చేసేవారు. వైకాపా సర్కారులో గడిచిన మూడేళ్లుగా సరెండర్‌ లీవు డబ్బులను జమ చేయడం లేదు. వేలాది మంది ఉద్యోగులు ఈ డబ్బుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. సరెండర్‌ లీవులకు సంబంధించి ఒక్కో ఉద్యోగికి సగం జీతం చొప్పున ఉమ్మడి జిల్లాలో 35 వేల మందికి రూ.173 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. పోలీసు శాఖతో పాటు ఇతర శాఖల్లో సుమారు 6 వేల మంది ఉద్యోగులకు సంబంధించి రవాణా, కరవు భత్యం చెల్లింపుల్లో ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తోంది.


ముందస్తు నగదు చెల్లిస్తేనే వైద్యం

మ్మడి జిల్లాలో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులు పంపిణీ చేయలేదు. ఇదివరకే ఇచ్చిన కార్డులు ఎందుకూ పనికిరావడం లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు సంబంధించి అన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో నగదురహిత చికిత్సలు అమలు చేయాలి. ఉద్యోగులందరికీ ఈహెచ్‌ఎస్‌ కార్డులు జారీ చేయాలి. కానీ అన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఈహెచ్‌ఎస్‌ ద్వారా నగదు రహిత వైద్యం ఉద్యోగులకు అందని ద్రాక్షలా మారింది. నగదు చెల్లిస్తేనే చికిత్స చేస్తున్నారు. అత్యవసర వైద్యానికి సైతం ఉద్యోగులు ముందస్తుగా నగదు చెల్లించాలని.. ఆ తర్వాత ప్రభుత్వానికి క్లెయిమ్‌ చేసుకోవాలని ఆస్పత్రి యాజమాన్యాలు ఉద్యోగులకు సూచిస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఉద్యోగులకు ఈ హెల్త్‌ కార్డులు ఉపయోగంలోకి రాలేదు.


రూ.215 కోట్ల వాటాకు ఎగనామం

ద్దెనెక్కిన వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పిన జగన్‌ ఐదేళ్లయినా పట్టించుకోలేదు. ఉమ్మడి జిల్లాలో 18 వేల మందికిపైగా సీపీఎస్‌ ఉద్యోగులు ఉన్నారు. పింఛను కాంట్రిబ్యూషన్‌ కింద ఉద్యోగులు తమ వాటా మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించారు. ప్రభుత్వం సగం వాటా రూ.215.38 కోట్లను జమ చేయాల్సి ఉండగా.. ఆ చెల్లింపులు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తోంది. 2004 తర్వాత ఏదైనా ప్రభుత్వ శాఖలో కొలువు సాధించిన వారందరినీ సీపీఎస్‌ పరిధిలోకి చేర్చారు. వారందరికీ అంతకుముందు ఉద్యోగుల మాదిరిగా మూల వేతనంలో సగం పింఛనుగా మంజూరు చేయరు. సీపీఎస్‌ ఉద్యోగులకు పది శాతం వాటా చెల్లింపుల్లో జాప్యంతో తీవ్రంగా నష్టపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని