logo

ఘాట్‌ రోడ్డుకు ‘జగన్‌’ గండం

ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు రాష్ట్ర రాజధానికి వెళ్లాలంటే కర్నూలు- గుంటూరు రహదారే కీలకం. ఇది నల్లమల మీదుగా వెళ్తోంది.

Updated : 28 Apr 2024 03:03 IST

‘విస్తరణను’ అడవిలో వదిలేసిన సర్కారు

ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు రాష్ట్ర రాజధానికి వెళ్లాలంటే కర్నూలు- గుంటూరు రహదారే కీలకం. ఇది నల్లమల మీదుగా వెళ్తోంది. ఆత్మకూరు- దోర్నాల మధ్య ఘాట్‌ రోడ్డులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆత్మకూరు నుంచి దోర్నాల మధ్య 58 కి.మీ ఉండగా అందులో దాదాపు 40 కి.మీ మేర అటవీమార్గం ఉంది. 15 కి.మీ మేర దారంతా ఛిద్రమైంది.


బాబు ఆమోదం

కర్నూలు- గుంటూరు ఎన్‌హెచ్‌ 340సి విస్తరించాలని జిల్లా పాలకులు విన్నవించడంతో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. 2016- 18 వరకు పలుమార్లు సర్వే చేయించారు.. విస్తరణకు ‘మార్గం’ సుగమం చేశారు.

జగన్‌ అటకెక్కించి

2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ సర్కారు పనులను అటకెక్కించింది.. వాహనాల రద్దీ తక్కువగా ఉందంటూ పక్కన పెట్టారు. ఇక్కడి ప్రజల విన్నపం మేరకు ఎన్నికలు సమీపించాక హడావుడిగా కర్నూలు నుంచి ఆత్మకూరు వరకు మాత్రమే పనులు చేపడుతున్నారు. మిగిలిన 38 కి.మీ అడవి మార్గాన్ని వదిలేశారు.

అడిగేవారు లేక

కర్నూలు నుంచి వెంకటాపురం వరకు విస్తరణ పనులు జరుగుతున్నాయి. అక్కడి నుంచి అడవి మార్గంలో రోడ్డు విస్తరణకు అడుగులు పడలేదు. అనుమతుల కోసం దిల్లీ అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి అధికారులు నివేదిక పంపించారు. అక్కడి అధికారులు పట్టించుకోలేదు. సీఎం జోక్యం చేసుకుంటే తప్ప అటవీ శాఖ అనుమతులు ఇచ్చే పరిస్థితి ఉండదు. పలుమార్లు దిల్లీ వెళ్లిన జగన్‌ ఈ రోడ్డు విస్తరణపై ఒక్కసారి కూడా మాట్లాడలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఆత్మకూరు, న్యూస్‌టుడే :


124 కి.మీల్లో విస్తరిస్తున్నది 72 కి.మీలే

కర్నూలు- గుంటూరు (ఎన్‌హెచ్‌ 340సి) రహదారిని విస్తరించేందుకు 2016లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు నంద్యాల కేంద్రంగా ఓ కన్సల్టెంట్‌ను నియమించారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరడంతో ఎన్‌హెచ్‌ఏఐ పీడీ సర్వే చేపట్టారు. మళ్లీ 2018లో వాహన రద్దీపై సర్వే చేపట్టారు. అన్నింటిని పరిగణనలోకి తీసుకుని కర్నూలు నుంచి దోర్నాల వరకు 124.00 కి.మీ పొడవున రోడ్డు విస్తరణకు ప్రణాళికలు రూపొందించారు. గార్గేయపురం నుంచి ఆత్మకూరు మండలం పిన్నాపురం వరకు 73.600 కి.మీ. మేర నాలుగు వరుసల రోడ్డును ప్రతిపాదించారు. ప్రస్తుతం నన్నూరు టోల్‌ప్లాజా నుంచి ఆత్మకూరు వరకు నాలుగు వరుసల రహదారి (ఎన్‌హెచ్‌ 340సీ) నిర్మాణం చేపడుతున్నారు. రూ.1200 కోట్ల వ్యయంతో సుమారు 72 కి.మీ మేర పనులు చేస్తున్నారు.

2016లోనే సర్వే పూర్తి

విస్తరణ పనుల్లో భాగంగా నల్లమల ఘాట్‌లో రహదారిని 10 మీటర్లు వెడల్పు చేసేందుకు 2016లో సర్వే చేపట్టారు. పిన్నాపురం- సంజీవనగర్‌ తండాల మధ్య పల్లెకట్ట వద్దనున్న 10వ నంబరు కి.మీ నుంచి ప్రకాశం జిల్లా కొత్తూరు వరకు 38.80 కి.మీలు రహదారి విస్తరణకు ప్రతిపాదించారు. ఇందులో 7 మీటర్ల వెడల్పుతో తారురోడ్డు, ఇరువైపులా 1.5 మీటర్ల చొప్పున ఫుట్‌పాత్‌ నిర్మాణానికి గతంలో సర్వే చేశారు. ఘాట్‌లో కొండల మధ్య కొన్నిచోట్ల 5 మీటర్ల దారికే అవకాశం ఉండటంతో అంత మేరకే చేపట్టాలని ప్రతిపాదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని