logo

‘అధికారం’లో విభేదాల మంట

కోడుమూరు నియోజకవర్గంలో అధికార పార్టీ వైకాపాలో విభేదాలు తారస్థాయికి చేరాయి.. ఏకంగా పార్టీ జెండాలను తగలబెడుతున్నారు.. గూడూరు మండలం ఆర్‌.కానాపురంలో సర్పంచి మునిస్వామి వర్గీయులు, జడ్పీటీసీ సభ్యుడు వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Updated : 28 Apr 2024 04:40 IST

కోడుమూరులో ఫ్యాన్‌ ఉక్కిరిబిక్కిరి

వైకాపా జెండాలను తగులబెడుతున్న సొంత పార్టీ కార్యకర్తలు

కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: కోడుమూరు నియోజకవర్గంలో అధికార పార్టీ వైకాపాలో విభేదాలు తారస్థాయికి చేరాయి.. ఏకంగా పార్టీ జెండాలను తగలబెడుతున్నారు.. గూడూరు మండలం ఆర్‌.కానాపురంలో సర్పంచి మునిస్వామి వర్గీయులు, జడ్పీటీసీ సభ్యుడు వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీ జెండాలు, కండువాలు, టోపీలు కుప్పగా పోసి నిప్పు పెట్టారంటే విభేదాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ఎమ్మెల్యే డా.సుధాకర్‌, నియోజకవర్గ సమన్వయకర్త, కుడా మాజీ ఛైర్మన్‌ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి మధ్య ఐదేళ్లపాటు అంతర్గత యుద్ధం (కోల్డ్‌వార్‌) నడిచింది. ఇద్దరూ ఒకే పార్టీ అయినప్పటికీ సభలు, సమావేశాలు వేర్వేరుగా నిర్వహించేవారు. వీరిద్దరి విభేదాలతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఇన్నాళ్లు ఫ్యాన్‌ కింద ఉన్న నేతలు సైకిల్‌ ఎక్కుతున్నారు. వీరి సంఖ్య పెరగడం.. విభేదాలు మరింత ముదరడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైంది.

పార్టీ వీడుతున్న ముఖ్యనేతలు

కోడుమూరు వైకాపాలో ఓవైపు కోట్ల హర్షవర్దన్‌రెడ్డి వర్గం, మరోవైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యే వర్గంతో వైకాపా అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఇరువర్గాల మధ్య పాలన ముగిసేనాటికి సంధి కుదర్చకపోవడంతో నేటికి అదే తంతు కొనసాగుతోంది. దీంతో ఎమ్మెల్యేను నమ్ముకొని పార్టీలో పని చేసిన ముఖ్య నేతలు, జడ్పీటీసీలు, సర్పంచులు వైకాపాను వీడి తెదేపాలో చేరడంతో వైకాపాలో వణుకు మొదలైంది. ముఖ్యనేతగా పని చేస్తున్న అమడగుండ్ల కృష్ణారెడ్డి, సి.బెళగల్‌ జడ్పీటీసీ సభ్యుడు గిరిజోన్‌, గోరంట్ల సర్పంచి బాలకృష్ణ వంటి వారు పార్టీని వీడారు.

ఓట్ల చీలక తప్పదా

మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ వైకాపాను వీడి షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీకి పెద్ద దెబ్బనే తగిలింది. దీంతోపాటు ఆయన వర్గీయులంతా కాంగ్రెస్‌లో చేరడం, ఇటీవల కోడుమూరులో వైఎస్‌ షర్మిల బస్సు యాత్ర సభకు భారీ ఎత్తున జనం హాజరు కావడంతో వైకాపా ఓట్లు భారీగానే చీలనున్నాయి. సభ విజయవంతం కావడంతో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటమి భయం పట్టుకుందని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని